Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -632

అయ్యో యేమరి నే నాఁ డప్పు డేమై వుంటినో

రాగము: బౌళి

అయ్యో యేమరి నే నాఁ డప్పు డేమై వుంటినో
అయ్యడ నీ దాసి నైతే ఆదరింతుగా॥పల్లవి॥
  
  
అల్లనాఁడు బాలుఁడవై ఆవులఁగాచేవేళ
చిల్లర దూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుఁడవై రేపల్లెలో నుండే నాఁడు
గొల్లెత నయినా నన్ను కూడుకొందుగా॥అయ్యో॥
  
  
మేలిమి రామావతారవేళ రాయి రప్ప నైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవులవద్ద వానరమై వుండినాను
యేలి నన్నుఁ బనిగొని యీడేర్తువుగా॥అయ్యో॥
  
  
వారిధిలో మచ్చ కూర్మావతారములైన నాఁడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్ళు మోసపోతిఁగా॥అయ్యో॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!