Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12514

మీవలెనే వుండవద్దా మేటియైన జాణలెల్లా

రాగము: పాడి

మీవలెనే వుండవద్దా మేటియైన జాణలెల్లా
భావించి తెలియలేక పదరఁగ నేలా॥పల్లవి॥
  
  
మొక్కలము లేఁటికి మోహముగలవారికి
మిక్కిలి వివేకాన మించుటగాక
వెక్కసపుఁదమకాన వేఁడుకొనె నిన్నాతఁడు
తక్కక నీ వందుకుఁ దగ నియ్యకొంటివి॥మీవ॥
  
  
కోపగించనేమిటికి కూటమిగలవారికి
వోపికతో నిన్నిటికి నోర్చుటగాక
చేపట్టి నిన్నాతఁడు చెనకి నవ్వులు నవ్వె
తీపులమోవి యొసఁగితివి నీ వతనికి॥మీవ॥
  
  
వింతసేయనేమిటికి వేడుకగలవారికి
అంతరంగాన సంతసమందుటగాక
యింతలోనే శ్రీవేంకటేశుఁడు నిన్నేలినాఁడు
కాంతపు నీవాతనిఁ గాఁగిలించుకొంటివి॥మీవ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!