Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -13604

వలపు లొడిఁగట్టుక వచ్చితి విప్పుడు నీవు

రాగము: రామక్రియ

వలపు లొడిఁగట్టుక వచ్చితి విప్పుడు నీవు
యెలమి నీ యాసోద మింకా నెంత గలదో॥పల్లవి॥
  
  
కొంగు దాఁకీఁ బతి వద్దఁ గూచుండక ఇటు రావే
ముంగురులు పైఁ బడీని మొక్కఁబోకువే
యెంగిలి సోఁకివచ్చీని యేకతా లే మాడేవే
సంగతెరఁగ వాతఁడు సదరమా నీకు॥వల॥
  
  
తమ్మ చెదరులు రాలీ తతిగొని నవ్వకువే
చిమ్ముఁజూపులు నాటీఁ గొచ్చి చూడకువే
చెమ్మఁజెమట లంటీని చెక్కులు నొక్కకువే
యెమ్మెలు సేసేవు ఆతఁ డెంత నీ వెంత॥వల॥
  
  
వూరుపులు పైఁ బారీ నొద్ద బండుండకువే
గీరులు కొనీ సొమ్ములు కాఁగిలించకువే
చేరి నన్ను నేలినాఁడు శ్రీవేంకటేశుఁడు తొల్లె
దారకపు నీ బోఁటికి దక్కునా యీతఁడు॥వల॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!