Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14145

వెలఁది యీకె ఇదిగో వీఁడిగో పెండ్లికొడుకు

రాగము: పాడి

వెలఁది యీకె ఇదిగో వీఁడిగో పెండ్లికొడుకు
యెలమి నుపచారాలు ఇన్నియునుఁ జేయరే॥పల్లవి॥
  
  
అంబుజపాణికిని హారములు గట్టరే
బింబాధరికిఁ గొప్పు వెట్టఁగదరే
కంబుకంఠికిని కప్రపు బొట్టు వెట్టరే
అంబరమధ్యకును ఆరతులు యెత్తరే॥వెలఁ॥
  
  
కలువకంటికి మంచికాటుక వెట్టఁగదరే
తలిరుఁబోణికి పూలదండ వేయరే
మలయజగంధికి బొమ్మలపెండె మందియ్యరే
అలినీలవేణికి నట్టె సింగారించరే॥వెలఁ॥
  
  
కరిగమనకును బాగాలు చేతి కొసఁగరే
హరిమధ్య కొడ్డాణ మమరించరే
ఇరవుగా శ్రీవేంకటేశ్వరునిఁ బెండ్లాడె
తరుణికి నితనికి తగు పీఁట వెట్టరే॥వెలఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!