Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14631

సిగ్గువడి మూల నేమిసేసేవు నీవు

రాగము: బౌళి

సిగ్గువడి మూల నేమిసేసేవు నీవు
అగ్గమైన నాయకుని అండకు రాఁగదవే॥పల్లవి॥
  
తలపోసి తలపోసి తమకించి నిన్నుఁ బిల్చు
చెలి వూడిగముదని చింతింపఁడు
చిలుకవలికితే నీయెలుగంటా మాటాడు
వలచిన రమణునివద్దికి రాఁగదవే॥సిగ్గు॥
  
వుమ్మడి నీనిట్టూర్పని వూరకే దిక్కులు చూచు
యిమ్ములఁ జల్లగాలెని యెరఁగఁడు
నెమ్మి వెన్నెలగాయఁగ నీనవ్వని తానూ నవ్వీ
రమ్మనవలెనా పతి రతికి రాఁగదవే॥సిగ్గు॥
  
పదరుచు లేచి నీపంజని యెదురేఁగు
ఉదయచందురుఁడని వూహించఁడు
యిదివో శ్రీవేంకటేశుఁ డింత సేసి నిన్నుఁ గూడె
యెద వెట్టుకోవలెనా యెప్పుడు రాఁగదవే॥సిగ్గు॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!