Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14696

సూడుబంటునే బలాలు చూపించ వచ్చితిమిదె

రాగము: ముఖారి

సూడుబంటునే బలాలు చూపించ వచ్చితిమిదె
యీడ మనమే కూళల మీతఁడేమి సేసునే॥పల్లవి॥
  
  
నగ నేరిచినవాఁడు నాలికాఁడు మనవాఁడు
తెగనీఁడు యెంతైనాఁ దేరనీఁడు
వెగటున మనమే వెఱ్ఱివారమై యిందాఁక
జగడించితిమి గాక చాలుఁ జాలుఁ బదవే॥సూడు॥
  
  
కడురాజసపువాఁడు గామిడివాఁడు మనల-
నొడఁ బరచఁడు మాటకుత్తరమీఁడు
అడియాసలనూరకే అండనుంటిమింతె కాక
గొడవకాఁడితఁడు కూడనీఁడు పదవే॥సూడు॥
  
  
ఇద్దరినడిమివాఁడు ఇచ్చకుఁడు మనమంకు
తిద్దలేఁడు లోపలికి తెగిపోనీఁడు
గద్దరీఁడు శ్రీవేంకటఘనుఁడొకరొకరినే
వొద్దికతోఁ గూడెనింక నొక్కటైతిఁ బదవే॥సూడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!