Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3966

ఎన్ని నేరుచుకొంటివి యెంత వొడఁబరచేవు

రాగము: హిందోళవసంతం

ఎన్ని నేరుచుకొంటివి యెంత వొడఁబరచేవు
నిన్నటనుంటి వింటి నీ మాటలే కావా॥పల్లవి॥
  
  
యెచ్చరించి యెచ్చరించి యెటువంటివారికైనా
మచ్చికె లూరించే వీ మాటలే కావా
పచ్చివొట్టు వెట్టుకొని పాసి వుండినవారి
నిచ్చకమై కలిపేవి యీ మాటలే కావా॥ఎన్ని॥
  
  
తలపించి తలపించి తనివి దీరఁగనీక
మలసి నాటుకొనే వీ మాటలే కావా
చలపట్టినాఁ బోనీక సాదించి తెచ్చి కౌఁగిటి
కెలయించి తగిలించే వీ మాటలే కావా॥ఎన్ని॥
  
  
కరఁగించి కరఁగించి కడుఁ జవులు వుట్టించి
మరిగించే విందరి కీ మాటలే కావా
నిరతి శ్రీవేంకటేశ నే నలమేల్మంగను
యిరవుగాఁ బెండ్లి సేసే వీ మాటలే కావా॥ఎన్ని॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!