Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4004

ఎన్నఁగలుగు భూతకోటినెల్లఁ జేసినట్టి చేఁత

రాగము: సామంతం

ఎన్నఁగలుగు భూతకోటినెల్లఁ జేసినట్టి చేఁత
నిన్నుఁ జేసుకొనుట గాక నీకుఁ దొలఁగవచ్చునా॥పల్లవి॥
  
  
గుట్టుచెరిచి లోకమెల్ల ఘోరసంసారమందు
కట్టివేసినట్టి పాపకర్మ మేల తీరును
పట్టితెచ్చి నిన్ను రోలఁగట్టివేసి లోకమెఱఁగ
రట్టుసేసుఁగాక నిన్ను రాజనన్న విడుచునా॥ఎన్న॥
  
  
మిఱ్ఱుపల్లములకుఁ దెచ్చి మెరసి భూతజాలములకుఁ
దొఱ్ఱపెసలు గొలచినట్టి దోసమేల పాయును
అఱ్ఱుసాఁచి గోపసతుల నలమి వెంటవెంటఁదిరుగ
వెఱ్ఱిఁ జేయుఁగాక నీవు విభుఁడనన్న విడుచునా॥ఎన్న॥
  
  
పరులఇంటి కేఁగి పరులపరుల వేఁడఁజేసినట్టి -
యెరుకమాలినట్టి చేఁత లేల నిన్ను విడుచును
వెరపుమిగిలి వేంకటాద్రివిభుఁడ ననుచు జనులచేత-
నరులుగొనఁగఁ జేయుఁగాక ఆస నిన్ను విడుచునా॥ఎన్న॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!