Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4613

ఎంతని చెప్పేము నీకు యింతి నీపైఁగల బత్తి

రాగము: శ్రీరాగం

ఎంతని చెప్పేము నీకు యింతి నీపైఁగల బత్తి
చెంత నీవే చూతువు విచ్చేయవయ్యా ఇంటికి॥పల్లవి॥
  
  
తరుణి నీరూపము తలపోసితలపోసి
శిరసూఁచి మెచ్చిమెచ్చి చెంగలించును
గరమ నీవిచ్చినవుంగరము తప్పకచూచి
మరిగి సంతోసాన మనసు గరఁగును॥ఎంత॥
  
  
చెలులచే నీసుద్దులు చెవులారా వినివిని
సెలవుల నవ్వినవ్వి చిమ్మిరేఁగును
మెలుపున నీవంపినచిలుకతో మాటలాడి
వెలలేనివేడుకల విఱ్ఱవీఁగును॥ఎంత॥
  
  
వేసరక నీరాకకు వేళగాఁచి వేళగాఁచి
ఆసలనే చొక్కిచొక్కి యానందించును
సేసవెట్టి కూడితివి శ్రీవేంకటేశ యింతలో
వాసితో నీరతికేలి వరుసఁ బొగడును॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!