Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4715

ఎంతమేలు గట్టుకొన్నా యిదె నీ చిత్తము కొద్ది

రాగము: దేశాక్షి

ఎంతమేలు గట్టుకొన్నా యిదె నీ చిత్తము కొద్ది
సంతోసములెల్లానాయ సమ్మతించే నిఁకను॥పల్లవి॥
  
  
నన్ను నీ వెఱుఁగుదువు నాకు నీపై బత్తి గద్దు
విన్నవించ నేమున్నది వేఁగినంతాను
మన్నించితి వన్నిటాను మనసొక్కటాయ నేఁడు
సన్నల నేమి సేసినా సమ్మతించే నిఁకను॥ఎంత॥
  
  
యేలుకొంటి విటు నన్ను ఇన్నిటా నమ్మితి నిన్ను
జోలితోఁ బెనఁగనేల చుట్టి చుట్టి
లాలన మీవల్లఁ గద్దు లాగాయ నా బతుకిది
చాలా నీ పొందుల కెల్లా సమ్మతించే నిఁకను॥ఎంత॥
  
  
నీవు నన్నుఁ గూడితవి నేఁ దొల్లె నీ సొమ్మనయితి
వావులు చెప్పఁగనేల వరుసతోను
శ్రీ వేంకటేశ నీకు చెలఁగి దేవుల నైతి
సావి వోరాదు వలపు సమ్మతించే నిఁకను॥ఎంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!