Bhimalapuram co in
మను చరిత్రము
అవతారిక
ఇష్టదేవతా వందనము
- ఉ. శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
- దేవిన్ దత్కమలా సమీపమునఁ బ్రీతిన్ నిల్పినాఁడో యనం
- గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా
- జీవాక్షుండు గృతార్థుఁజేయు శుభదృష్టిన్ గృష్ణరాయాధిపున్. 1
- ఉ. ఉల్లమునందు నక్కటిక మూనుట మీకులమందుఁ గంటి మం
- చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁతనవ్వు సం
- ధిల్లఁ గిరీటిఁ బాశుపత దివ్యశరాఢ్యునిఁ జేయు శాంబరీ
- భిల్లుఁడు గృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది గావుతన్. 2
- ఉ. నాలుగు మోములన్ నిగమ నాదము లుప్పతిలం బ్రచండవా
- తూలహతిన్ జనించు రొదతోడి గుహావళి నొప్పు మేరువుం
- బోలి పయోజపీఠి మునిముఖ్యులు గొల్వఁగ వాణిఁ గూడి పే
- రోలగ మున్న ధాత విభవోజ్జ్వలుఁ జేయుతఁ గృష్ణరాయనిన్. 3
- ఉ. అంకముఁ జేరి శైలతనయాస్తన దుగ్ధము లానువేళ బా
- ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చన్ కబళింపఁబోయి యా
- వంకఁ గుచంబు గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా
- ళాంకురశంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికిన్. 4
- సీ. చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే, సిందూరతిలకంబు చెమ్మగిల్ల
- నవతంసకుసుమంబు నందున్న యెలదేఁటి, రుతి కించిదంచిత శ్రుతుల నీన
- ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ, దుంబీఫలంబు తుందుడుకుఁ జెందఁ
- దరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు, లింగిలీకపు వింతరంగు లీన
- తే. నుపనిషత్తులు బోటులై యోలగింపఁ
- బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి
- నించువేడుక వీణ వాయించు చెలువ
- నలువరాణి మదాత్మలో వెలయుఁగాత! 5
గురుస్తుతి
- క. కొలుతున్ మద్గురు విద్యా
- నిలయున్ గరుణా కటాక్ష నిబిడ జ్యోత్స్నా
- దళితాశ్రితజన దురిత
- చ్ఛల గాఢ ధ్వాంతసమితి శఠకోపయతిన్. 6
పూర్వకవి ప్రస్తుతి
- మ. వనజాక్షోపము వామలూరుతనయున్, ద్వైపాయనున్, భట్టబా
- ణుని, భాసున్, భవభూతి, భారవి, సుబంధున్, బిల్హణున్, గాళిదా
- సుని, మాఘున్, శివభద్రు, మల్హణకవిం, జోరున్, మురారిన్, మయూ
- రుని, సౌమిల్లిని, దండిఁ బ్రస్తుతులఁ బేర్కొందున్ వచశ్శుద్ధికిన్. 7
- ఆ. వ్యాసరచిత భారతామ్నాయ మాంధ్ర భా
- షగ నొనర్చి జగతిఁ బొగడు గనిన
- నన్నపార్యుఁ, దిక్కనను గృతక్రతు, శంభు
- దాసు నెఱ్ఱసుకవిఁ దలఁతు భక్తి. 8
కుకవి నిరాకృతి
- మ. భరమై తోఁచు కుటుంబరక్షణకుఁగాఁ బ్రాల్మాలి చింతన్ నిరం
- తర తాళీదళ సంపుట ప్రకర కాంతారంబునం దర్థపుం
- దెరువాటుల్ దెగి కొట్టి, తద్జ్ఞ పరిషద్విజ్ఞాత చౌర్యక్రియా
- విరసుండై కొఱఁతన్ బడున్ గుకవి, పృథ్వీభృత్సమీప క్షితిన్. 9
- క. అని ఇష్టదేవతా వం
- దన సుకవిస్తుతులుఁ, గుకవితతి నికృతియుఁ జే
- సి నవీన కావ్య రచనకు
- ననుకూల కథల్ దలంచు నా సమయమునన్. 10
పెద్దనామాత్యునకుఁ గృష్ణరాయని యభ్యర్థనము
- సీ. ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వని కుమా, రతకుఁ గ్రౌంచాచల రాజ మయ్యె
- నావాడపతి శకంధర సింధురాధ్యక్షు, లరిగాఁపు లెవ్వాని ఖరతరాసి
- కాపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని, కసివాఱుగా నేఁగునట్టి బయలు
- సకల యాచకజనాశాపూర్తి కెవ్వాని, ఘన భుజాదండంబు కల్పశాఖి
- తే. ప్రబల రాజాధిరాజ వీరప్రతాప
- రాజపరమేశ బిరుద విభ్రాజి యెవ్వఁ
- డట్టి శ్రీకృష్ణరాయ వీరాగ్రగణ్యుఁ
- డొక్కనాఁడు కుతూహలం బుప్పతిల్ల. 11
- సీ. ఇందీవరంబులనీను క్రాల్గన్నుల, శరదిందుముఖులు చామరము లిడఁగఁ
- బణినసూను కణాద బాదరాయణ సూత్ర, ఫక్కి విద్వాంసు లుపన్యసింపఁ
- బార్శ్వభూమి నభీరుభటకదంబ కరాళ, హేతిచ్ఛటాచ్ఛాయ లిరులు కొనఁగ
- సామంత మండనోద్దామ మాణిక్యాంశు, మండలం బొలసి యీరెండ గాయ
- తే. మూరురాయర గండపెండార మణి మ
- రీచి రింఛోళిఁ గలయ నావృతము లగుచు
- నంకపాళి నట ద్దుకూలాంచలములు
- చిత్రమాంజిష్ఠ విభ్రమశ్రీ వహింప. 12
- క. భువనవిజయాఖ్య సంస
- ద్భవన స్థిత భద్రపీఠిఁ బ్రాజ్ఞులగోష్ఠిన్
- గవితామధురిమ డెందము
- దవులన్ గొలువుండి సదయతన్ ననుఁ బల్కెన్. 13
- గీ. సప్తసంతానములలోఁ బ్రశస్తిఁ గాంచి
- ఖిలము గాకుండునది ధాత్రిఁ గృతియ, కానఁ
- గృతి రచింపుము మాకు శిరీషకుసుమ
- పేశల సుధామయోక్తులఁ బెద్దనార్య! 14
- క. హితుఁడవు చతురవచోనిధి
- వతుల పురాణాగమేతిహాస కథార్థ
- స్మృతియుతుఁడ వాంధ్రకవితా
- పితామహుఁడ వెవ్వ రీడు పేర్కొన నీకున్? 15
- క. మనువులలో స్వారోచిష
- మను సంభవ మరయ రస సమంచిత కథలన్
- విన నింపు, కలిధ్వంసక
- మనఘ! భవ చ్చతుర రచన కనుకూలంబున్. 16
వ. కావున మార్కండేయ పురాణోక్త ప్రకారంబునం జెప్పు మని కర్పూర తాంబూలంబు పెట్టినం బట్టి, మహాప్రసాదం బని మోదంబున నమ్మహాప్రబంధ నిబంధనంబునకుఁ బ్రారంభించితి, నేతత్కథానాయకరత్నంబగు నమ్మహీనాథు వంశావతారం బెట్టి దనిన. 17
కృతిపతి వంశ ప్రశంస
- సీ. కలశపాథోరాశి గర్భవీచిమతల్లి, కడుపార నెవ్వానిఁ గన్నతల్లి
- యనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాఁడు, వన్నెవెట్టు ననార్తవంపుఁబువ్వు
- సకలదైవత బుభుక్షా పూర్తి కెవ్వాఁడు, పుట్టు గానని మేని మెట్టపంట
- కటికిచీఁకటితిండి కరముల గిలిగింత, నెవ్వాఁడు దొగకన్నె నవ్వఁజేయు
- తే. నతఁడు వొగడొందు, మధు కైటభారి మఱఁది,
- కళల నెల వగువాఁడు, చుక్కలకు ఱేఁడు,
- మిసిమి పరసీమ, వలరాజు మేనమామ,
- వేవెలుంగుల దొర జోడు, రేవెలుంగు. 18
- తే. ఆ సుధాధాము విభవమహాంబురాశి
- కుబ్బు మీఱంగ నందనుఁ డుదయమయ్యె
- వేద వేదాంగ శాస్త్రార్థ విశద వాస
- నాత్త ధిషణా ధురంధరుం డైన బుధుఁడు. 19
- క. వానికిఁ బురూరవుఁడు ప్ర
- జ్ఞానిధి యుదయించె సింహ సదృశుఁడు, తద్భూ
- జానికి నాయువు తనయుం
- డై నెగడె, నతండు గనె యయాతి నరేంద్రున్. 20
- క. అతనికి యదు తుర్వసు లను
- సుతు లుద్భవమొంది రహిత సూదనులు, గళా
- న్వితమతులు, వారిలో వి
- శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై. 21
- తే. వానివంశంబు తుళువాన్వవాయ మయ్యె,
- నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నొంది
- నిఖిల భువన ప్రపూర్ణ నిర్ణిద్రకీర్తి
- నధికులైరి తదీయాన్వయమునఁ బుట్టి. 22
- మహాస్రగ్ధర. ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి, శఠకమఠ గ్రావసంఘాత వాతా
- శనరా డాశాంతదంతి స్థవిరకిరుల, జంజాటముల్ మాన్పి, యిమ్మే
- దిని దోర్దండైకపీఠిన్ దిరముపఱిచి, కీర్తిద్యుతుల్ రోదసిం బ
- ర్వ నరాతుల్ నమ్రులై పార్శ్వములఁ, గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్. 23
- క. వితరణఖని యాతిమ్మ
- క్షితిపగ్రామణీకి దేవకీదేవికి సం
- చితమూర్తి యీశ్వర ప్రభుఁ
- డతిపుణ్యుఁడు పుట్టె సజ్జనావనపరుఁడై. 24
- చ. బలమదమత్త దుష్టపుర భంజనుఁడై పరిపాలితార్యుఁడై
- యిలపయిఁ దొంటి యీశ్వరుఁడె యీశ్వరుఁడై జవియింప రూపఱెన్
- జలరుహనేత్రలం దొరఁగి శైలవనంబుల భీతచిత్తులై
- మెలఁగెడు శత్రుభూపతుల మేనులఁ దాల్చిన మన్మథాంకముల్. 25
- సీ. నిజభుజాశ్రిత ధారుణీ వజ్రకవచంబు, దుష్టభుజంగాహితుండికుండు
- వనజేక్షణా మనోధన పశ్యతోహరుం, డరిహంస సంసదభ్రాగమంబు
- మార్గణగణ పిక మధుమాస దివసంబు, గుణరత్న రోహణ క్షోణిధరము
- బాంధవసందోహ పద్మవనీ హేళి, కారుణ్యరస నిమ్నగా కళత్రుఁ
- తే. డని, జగంబుల మిగులఁ బ్రఖ్యాతిఁ గాంచె
- ధరణీధవ దత్త వివిధోపదా విధా స
- మార్జితశ్రీ వినిర్జిత నిర్జరాల
- యేశ్వరుఁడు, తిమ్మభూపతి యీశ్వరుండు. 26
- క. ఆ యీశ్వర నృపతికిఁ బు
- ణ్యాయతమతియైన బుక్కమాంబకుఁ దేజ
- స్తోయజహితు లుదయించిరి,
- ధీయుతులగు నారసింహ తిమ్మనరేంద్రుల్. 27
- క. అందు నరసప్రభుఁడు, హరి
- చందన మందార కుంద చంద్రాంశు నిభా
- స్పంద యశ స్తుందిల ది
- క్కందరుఁడై ధాత్రి యేలెఁ గలుషము లడఁగన్. 28
- ఉ. శ్రీరుచిరత్వ భూతిమతి జిత్వరతాకృతి శక్తికాంతులన్
- ధీరత సార భోగముల, ధీనిధి యీశ్వర నారసింహుఁ డా
- వారిజనాభ శంకరుల, వారికుమారుల, వారితమ్ములన్,
- వారియనుంగు మామలను, వారివిరోధులఁ బోలు నిమ్మహిన్. 29
- సీ. అంభోధివసన విశ్వంభరావలయంబుఁ, దనబాహుపురి మరకతముఁ జేసె
- నశ్రాంత విశ్రాణ నాసార లక్ష్మికిఁ, గవికదంబముఁ జాతకములఁ జేసెఁ
- గకుబంత నిఖిలరా ణ్నికరంబుఁ జరణమం, జీరంబు సాలభంజికలఁ జేసె
- మహనీయ నిజవినిర్మలయశ స్సరసికి, గగనంబుఁ గలహంసకంబుఁ జేసె
- తే. నతిశిత కృపాణ కృత్త మత్తారివీర
- మండలేశ సకుండల మకుట నూత్న
- మస్త మాల్య పరంపరా మండనార్చి
- తేశ్వరుండగు నారసింహేశ్వరుండు! 30
- తే. ఆ నృసింహప్రభుండు తిప్పాంబవలన
- నాగమాంబికవలన నందనులఁ గాంచె
- వీరనరసింహరాయ భూవిభుని, నచ్యు
- తాంశసంభవుఁ గృష్ణరాయ క్షితీంద్రు. 31
- క. వీరనృసింహుఁడు నిజభుజ
- దారుణకరవాల పరుషధారాహత వీ
- రారి యగుచు నేకాతప
- వారణముగ నేలె ధర నవారణమహిమన్. 32
- క. ఆవిభు ననంతరంబ ధ
- రావలయముఁ దాల్చెఁ గృష్ణరాయఁడు చిన్నా
- దేవియు, శుభమతి తిరుమల
- దేవియునుం దనకుఁ గూర్చు దేవేరులు గాన్. 33
కృష్ణరాయల ప్రతాపాది వర్ణనము
- సీ. తొలఁగెను ధూమకేతుక్షోభ జనులకు, నతివృష్టి దోష భయంబు వాసెఁ
- గంటకాగమ భీతి గడచె నుద్ధత భూమి, భృత్కటకం బెల్ల నెత్తువడియె
- మాసె నఘస్ఫూర్తి మరుభూములందును, నెల మూఁడువానలు నిండఁ గురిసె
- నాబాలగోపాల మఖిల సద్వ్రజమును, నానందమున మన్కి నతిశయిల్లెఁ
- తే. బ్రజల కెల్లను గడు రామరాజ్య మయ్యెఁ
- జారుసత్త్వాఢ్యుఁ డీశ్వర నారసింహ
- భూవిభుని కృష్ణరాయఁ డభ్యుదయ మొంది
- పెంపు మీఱంగ ధాత్రిఁ బాలింపుచుండ. 34
- మ. అలపోత్రిప్రభు దంష్ట్ర, భోగివరభోగాగ్రాళిఱా, లుద్భటా
- చలకూటోపలకోటి రూపుచెడ నిచ్చల్ రాయఁగా నైన మొ
- క్కలు భూకాంతకు నున్ననయ్యె నరసక్ష్మాపాలు శ్రీకృష్ణరా
- యల బాహామృగనాభిసంకుమద సాంద్రాలేప పంకంబునన్. 35
- ఉ. క్రూర వనేభ దంత హత కుడ్య పరిచ్యుత వజ్రపంక్తిఁ బొ
- ల్పారు మిడుంగుఱుంబురువు లంచు వెసన్ గొనిపోయిపొంత శృం
- గారవనద్రుమాళి గిజిగాఁడులు గూఁడులఁ జేర్చు దీపికల్
- గా రహిఁ గృష్ణరాయమహికాంతుని శాత్రవపట్టణంబులన్. 36
- సీ. తొలుదొల్త నుదయాద్రి శిలఁ దాఁకి తీండ్రించు, నసిలోహమున వెచ్చనై జనించె,
- మఱి కొండవీ డెక్కి మార్కొని నలియైన, యల కసవాపాత్రు నంటి రాఁజె,
- నట సాఁగి జమ్మిలోయఁ బడి వేఁగి దహించెఁ, గోన బిట్టేర్చెఁ, గొట్టానఁ దగిలెఁ,
- గనకగిరిస్ఫూర్తిఁ గరఁచె గౌతమిఁ గ్రాఁచె, నవుల నాపొట్నూర రవులుకొనియె,
- తే. మాడెములు ప్రేల్చె, నొడ్డాది మసి యొనర్చెఁ,
- గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱవఁ
- దోఁకచిచ్చన నౌర యుద్ధరతఁ గృష్ణ
- రాయబాహుప్రతాప జాగ్రన్మహాగ్ని. 37
- మ. ధరకెంధూళులు కృష్ణరాయల చమూ ధాటీగతిన్ వింధ్యగ
- హ్వరముల్ దూఱఁగఁజూచి, తా రచటఁ గాఁపై యుండుటన్ జాల న
- చ్చెరువై యెఱ్ఱని వింత చీఁకటులు వచ్చెం జూడరే! యంచు వే
- సొరిదిం జూతురు వీరరుద్రగజరాట్ శుద్ధాంతముగ్ధాంగనల్. 38
- చ. అభిరతిఁ గృష్ణరాయఁడు జయాంకములన్ లిఖియించి తాళస
- న్నిభముగఁ బొట్టునూరికడ నిల్పిన కంబము, సింహభూధర
- ప్రభు తిరునాళ్ళకున్ దిగు సురప్రకరంబు కళింగమేదినీ
- విభు నపకీర్తి కజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలున్. 39
- మహాస్రగ్ధర. ఎకరాలఁ మండువా సా, హిణములఁ గల భ ద్రేభ సందోహవాహ
- ప్రకరంబుల్ గొంచుఁ దత్త, త్ప్రభువులు పనుపన్ రాయబారుల్ విలోకో
- త్సుకులై నిత్యంబు శ్రీకృ, ష్ణునియవసరముల్ చూతు రందంద కొల్వం
- దక యాప్రత్యూష మాసం, ధ్యము పనివడి తన్మందిరాళింద భూమిన్. 40
- చ. మదకల కుంభి కుంభ నవ మౌక్తికముల్ గనుపట్టు దట్టమై
- వదలక కృష్ణరాయ కరవాలమునం దగు ధారనీట న
- భ్యుదయమునొంది శాత్రవుల పుట్టి మునుంగఁగ ఫేనపంక్తితోఁ
- బొదిగొని పైపయిన్ వెడలు బుద్బుదపంక్తులు వోలెఁ బోరులన్. 41
- సీ. వేదండ భయద శుండాదండ నిర్వాంత, వమధువుల్ పైఁజిల్కు వారిగాఁగఁ
- దత్కర్ణ విస్తీర్ణ తాళవృంతోద్ధూత, ధూళి చేటలఁ జల్లు దుమ్ము గాఁగ
- శ్రమబుర్బురుత్తురంగమ నాసికాగళ, త్పంకంబు వైచు కర్దమము గాఁగఁ
- గుపిత యోధాక్షిప్త కుంతకాంతారఖే, లనములు దండఘట్టనలు గాఁగఁ
- తే. జెనఁటి పగఱ ప్రతాపంబు చిచ్చు లార్చు
- కరణి, గడిదేశములు చొచ్చి కలఁచి యలఁచు
- మూరురాయర గండాంక వీర కృష్ణ
- రాయ భూభృ ద్భయంకర ప్రబలధాటి. 42
షష్ఠ్యంతములు
- క. ఏవంవిధ గుణవంతున
- కావల్గత్తురగ బహు విధారోహ కళా
- రేవంతున కతిశాంతున
- కావిష్కృతకీర్తి ధవళితాశాంతునకున్. 43
- క. పుంఖానుపుంఖ సైంధవ
- రింఖా సంఘాతజాత రేణూగ్ర తమో
- రింఖ ద్రిపునృప దహర
- ప్రేంఖ దనుగ్రసన జఠరభృత్యసిఫణికిన్. 44
- క. అవిరళ వితరణ విద్యా
- నవరాధేయునకు సజ్జన విధేయునకున్
- గవితాస్త్రీలోలునకున్
- ఖవిటంక నటద్యశోఽబ్ధి కల్లోలునకున్. 45
- క. దిగధీశాసహ్య ధగ
- ద్ధగితేద్ధ రుచి ప్రతాప తపన స్ఫురణ
- స్థగిత ద్యుమణికి నిమిషా
- ర్ధ గృహీత కళింగరాజ తనయాగ్రణికిన్. 46
- క. కరుణాకర వేంకటవిభు
- చరణ స్మరణ ప్రసంగ సంగతమతి కీ
- శ్వరనృసింహ మహీభృ
- ద్వరనందన కృష్ణరాయ ధరణీపతికిన్. 47
ప్రథమాశ్వాసము
కథా ప్రారంభము
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన స్వారోచిష మను సంభవం బను మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టి దనిన, జైమినిముని స్వాయంభువమను కథాశ్రవణానంతరంబున, మీఁద నెవ్వండు మను వయ్యె నెఱింగింపు మనవుడుఁ, బక్షులు మార్కండేయుండు క్రోష్టికిం జెప్పినప్రకారంబున నిట్లని చెప్పం దొడంగె. 48
అరుణాస్పద పుర వర్ణనము
- మ. వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
- బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
- హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబునన్
- బుర మొప్పన్, మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్. 49
- సీ. అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు
- నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు
- నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు
- లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
- తే. నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ
- గాసెకొంగున వారించి కడపఁగలరు
- నాట్యరేఖాకళాధురంధరనిరూఢి
- నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ. 50
ప్రవరుని సౌశీల్యాది ప్రశంస
- మ. వరణాద్వీపవతీ తటాంచలమునన్ వప్రస్థలీ చుంబితాం
- బరమై, సౌధసుధాప్రభా ధవళిత ప్రాలేయరుఙ్మండలీ
- హరిణంబై, యరుణాస్పదం బనఁగ నార్యావర్తదేశంబునన్
- బుర మొప్పన్, మహికంఠహార తరళస్ఫూర్తిన్ విడంబింపుచున్. 49
- సీ. అచటి విప్రులు మెచ్చ రఖిలవిద్యాప్రౌఢి, ముది మది దప్పిన మొదటివేల్పు
- నచటి రాజులు బంటు నంపి భార్గవు నైన, బింకానఁ బిలిపింతు రంకమునకు
- నచటి మేటి కిరాటు లలకాధిపతి నైన, మును సంచిమొద లిచ్చి మనుప దక్షు
- లచటి నాలవజాతి హలముఖాత్తవిభూతి, నాదిభిక్షువు భైక్షమైన మాన్చు
- తే. నచటి వెలయాండ్రు రంభాదులైన నొరయఁ
- గాసెకొంగున వారించి కడపఁగలరు
- నాట్యరేఖాకళాధురంధరనిరూఢి
- నచటఁ బుట్టిన చిగురుఁ గొమ్మైనఁ జేవ. 50
- ఉ. ఆ పురిఁ బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భా
- షాపరశేషభోగి, వివిధాధ్వర నిర్మల ధర్మకర్మ దీ
- క్షాపరతంత్రుఁ, డంబురుహగర్భ కులాభరణం, బనారతా
- ధ్యాపన తత్పరుండు, ప్రవరాఖ్యుఁ డలేఖ్య తనూవిలాసుఁడై. 51
- ఆ. వానిచక్కఁదనము వైరాగ్యమునఁజేసి
- కాంక్షసేయు జార కామినులకు
- భోగబాహ్య మయ్యెఁ, బూచిన సంపెంగ
- పొలుపు మధుకరాంగనలకుఁ బోలె. 52
- ఉ. యౌవనమందు యజ్వయు ధనాఢ్యుఁడునై కమనీయకౌతుక
- శ్రీవిధిఁ గూఁకటుల్ గొలిచి చేసిన కూరిమి సోమిదమ్మ సౌ
- ఖ్యావహయై భజింప, సుఖులై తలిదండ్రులు గూడి దేవియున్
- దేవరవోలె నుండి యిలుదీర్పఁగఁ, గాపుర మొప్పు వానికిన్. 53
- సీ. వరణాతరంగిణీ దరవికస్వర నూత్న, కమల కషాయగంధము వహించి,
- ప్రత్యూషపవనాంకురములు పైకొనువేళ, వామనస్తుతి పరత్వమున లేచి,
- సచ్ఛాత్త్రుఁ డగుచు నిచ్చలు నేఁగి యయ్యేట, నఘమర్షణస్నాన మాచరించి,
- సాంధ్యకృత్యము దీర్చి సావిత్రి జపియించి, సైకతస్థలిఁ గర్మసాక్షి కెఱఁగి,
- తే. ఫల సమిత్కుశ కుసుమాది బహుపదార్థ
- తతియు, నుదికిన మడుఁగుదోవతులుఁ గొంచు
- బ్రహ్మచారులు వెంటరా, బ్రాహ్మణుండు
- వచ్చు నింటికిఁ బ్రజ తన్ను మెచ్చి చూడ. 54
- శా. శీలంబున్, గులమున్, శమంబు, దమముం, జెల్వంబు లేఁబ్రాయముం
- బోలం జూచి యితండె పాత్రుఁ డని యే భూపాలుఁ డీ వచ్చినన్
- సాలగ్రామము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం
- దాలన్ బండు నొకప్పుడుం దఱుఁగ దింటం బాఁడియున్ బంటయున్. 55
- తే. వండ నలయదు వేవురు వచ్చిరేని
- నన్నపూర్ణకు నుద్దియౌ నతనిగృహిణి
- యతిథు లేతేర నడికిరేయైనఁ బెట్టు
- వలయు భోజ్యంబు లింట నవ్వారి గాఁగ. 56
- సీ. తీర్థసంవాసు లేతెంచినారని విన్న, నెదురుగా నేఁగు దవ్వెంతయైన,
- నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ, దెచ్చి సద్భక్తి నాతిథ్యమిచ్చు,
- నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయు, జేసి గూర్చున్నచోఁ జేరవచ్చు,
- వచ్చి యిద్ధరఁ గల్గు వనధి పర్వత సరి, త్తీర్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు,
- తే. నడిగి యోజన పరిమాణ మరయు నరసి
- పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
- ననుదినము తీర్థసందర్శనాభిలాష
- మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి. 57
- క. ఈ విధమున నభ్యాగత
- సేవాపరతంత్ర సకల జీవనుఁడై భూ
- దేవకుమారకుఁ డుండం
- గా విను మొక నాఁడు కుతప కాలమునందున్. 58
సిద్ధాగమనము - అతిథి సత్కారము
- సీ. ముడిచిన యొంటి కెంజడ మూయ మువ్వన్నె, మెగముతోలు కిరీటముగ ధరించి
- కకపాల కేదార కటక ముద్రిత పాణిఁ, గుఱుచ లాతాముతోఁ గూర్చిపట్టి
- యైణేయమైన యొడ్డాణంబు లవణిచే, నక్కళించిన పొట్ట మక్కళించి
- యారకూటచ్ఛాయ నవఘళింపఁగఁ జాలు, బడుగుదేహంబున భస్మ మలఁది
- తే. మిట్టయురమున నిడుయోగ పట్టె మెఱయఁ
- జెవుల రుద్రాక్షపోఁగులు చవుకళింపఁ
- గావికుబుసంబు జలకుండికయును బూని
- చేరెఁ దద్గేహ మౌషధసిద్ధుఁడొకడు. 59
- తే. ఇట్లు చనుదెంచు పరమయోగీంద్రుఁ గాంచి
- భక్తిసంయుక్తి నెదురేఁగి ప్రణతుఁ డగుచు
- నర్ఘ్యపాద్యాది పూజనం బాచరించి
- యిష్టమృష్టాన్నకలన సంతుష్టుఁ జేసి, 60
- క. ఎందుండి యెందుఁ బోవుచు
- నిందుల కేతెంచినార లిప్పుడు? విద్వ
- ద్వందిత! నేఁడుగదా! మ
- న్మందిరము పవిత్రమయ్యె, మాన్యుఁడ నైతిన్. 61
- క. మీమాటలు మంత్రంబులు,
- మీమెట్టినయెడ ప్రయాగ, మీపాద పవి
- త్రామలతోయము లలఘు
- ద్యోమార్గఝరాంబు పౌనరుక్త్యము లుర్విన్. 62
- ఉ. వానిది భాగ్యవైభవము వానిది పుణ్యవిశేష మెమ్మెయిన్
- వాని దవంధ్యజీవనము వానిది జన్మము వేఱు సేయ కె
- వ్వాని గృహాంతరంబున భవాదృశయోగిజనంబు పావన
- స్నానవిధాన్నపానముల సంతస మందుచుఁ బోవు నిచ్చలున్. 63
- తే. మౌనినాథ! కుటుంబజంబాలపటల
- మగ్న మాదృశ గృహమేధి మండలంబు
- నుద్ధరింపంగ నౌషధ మొండు గలదె?
- యుష్మదంఘ్రిరజోలేశ మొకటి దక్క. 64
- క. నా విని ముని యి ట్లను వ
- త్సా! విను మావంటి తైర్థికావళి కెల్లన్
- మీవంటి గృహస్థుల సుఖ
- జీవనమునఁగాదె! తీర్థసేవయుఁ దలపన్. 65
- సీ. కెలఁకుల నున్న తంగెటిజున్ను గృహమేధి, యజమానుఁ దంకస్థితార్థపేటి
- పండిన పెరటి కల్పకము వాస్తవ్యుండు, దొడ్డిఁ బెట్టిన వేల్పుగిడ్డి కాఁపు
- కడలేని యమృతంపు నడబావి సంసారి, సవిధమేరునగంబు భవనభర్త
- మరుదేశపథ మధ్యమప్రప కులపతి, యాఁకటి కొదవు సస్యము కుటుంబి
- తే. బధిర పంగ్వంధ బిక్షుక బ్రహ్మచారి
- జటి పరివ్రాజ కాతిథి క్షపణ కావ
- ధూత కాపాలికా ద్యనాథులకుఁ గాన
- భూసురోత్తమ! గార్హస్థ్యమునకు సరియె? 66
- క. నావుఁడు బ్రవరుం డి ట్లను
- దేవా! దేవర సమస్త తీర్థాటనమున్
- గావింపుదు రిలపై నటు
- గావున విభజించి యడుగఁ గౌతుక మయ్యెన్. 67
- శా. ఏ యే దేశములన్ జరించితిరి, మీ రే యే గిరుల్ చూచినా,
- రే యే తీర్థములందుఁ గ్రుంకిడితి, రే యే ద్వీపముల్ మెట్టినా,
- రే యే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి, రే యే తోయధుల్ డాసినా
- రాయా చోటులఁ గల్గు వింతలు మహాత్మా! నా కెఱింగింపరే! 68
- తే. పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ
- మహిమ వినుటయు నఖిల కల్మష హరంబ
- కాన వేఁడెద ననిన న మ్మౌనివర్యుఁ
- డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె. 69
సిద్ధుని తీర్థయాత్రాభివర్ణనము
- ఉ. ఓ చతురాస్యవంశ కలశోదధి పూర్ణశశాంక! తీర్థయా
- త్రాచణ శీలినై జనపదంబులుఁ బుణ్యనదీనదంబులున్
- జూచితి నందు నందుఁ గల చోద్యములున్ గనుఁగొంటి నాపటీ
- రాచల పశ్చిమాచల హిమాచల పూర్వదిశాచలంబుగన్. 70
- శా. కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
- పాదాంభోరుహముల్, ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించితిన్,
- యాదోనాథసుతాకళత్రు బదరీ నారాయణుం గంటి, నీ
- యా దేశం బన నేల? చూచితి సమస్తాశావకాశంబులన్. 71
వ. అది యట్లుండె, వినుము గృహస్థరత్నంబ! లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామరచ్ఛటా ప్రేక్షణక్షణోద్గ్రీవ చమర సముదయంబగు నుదయంబునం గల విశేషంబులు శేష ఫణికి నైన లెక్కింప శక్యంబె? యంధకరిపు కంధరావాస వాసుకి వియోగభవ దుర్వ్యథాభోగ భోగినీ భోగభాగ పరివేష్టిత పటీర విటపి వాటికావేల్ల దేలాలతావలయంబగు మలయంబునం గల చలువకు విలువ యెయ్యది? యకటకట! వికట కూట కోటి విటంక శృంగాటకాఢౌకమాన జరదిందు బింబ గళదమృత బిందు దుర్దినార్ద్రీకృత సల్లకీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు నస్తంబునం గల మణిప్రస్తరంబుల విశ్రాంతిఁ జింతించిన మేనం బులక లిప్పుడుం బొడమెడు, స్వస్వప్రవర్ధిత వర్ధిష్ణు ధరణీరుహ సందోహ దోహదప్రధానాసమాన ఖేల దైల బిల విలాసినీ విలాస వాచాల తులాకోటి కలకలాహూయమాన మానస మదాలస మరాళంబగు రజతశైలంబు నోలంబులం గాల గళు విహారప్రదేశంబులం గన్న సంసృతిక్లేశంబులు వాయవే? సతతమదజలస్రవణ పరాయణై రావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్కురువింద కందళ వ్రాత జాతాలాతశంకాప సర్ప దభ్రముభ్రమీవిభ్రమ ధురంధరంబగు మేరుధరాధరంబు శిఖరంబుల సోయగంబులు గలయం గనుంగొనుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునం గాక యేల చేకూఱ నేర్చు? నే నిట్టి మహాద్భుతంబు లీశ్వరానుగ్రహంబున నల్పకాలంబునం గనుంగొంటి ననుటయు, నీషదంకురిత హసన గ్రసిష్ణు గండ యుగళుం డగుచుఁ బ్రవరుం డతని కిట్లనియె. 72
ప్రవరునికి సిద్ధుఁడు పాదలేప మొసఁగుట
- ప్రవరునికి సిద్ధుఁడు పాదలేప మొసంగుట
- చ. వెఱవక మీ కొనర్తు నొక విన్నప మిట్టివి యెల్లఁ జూచిరా
- నెఱకలు గట్టుకొన్న మఱి యేండ్లును బూండ్లును బట్టుఁ బ్రాయపుం
- జిఱుత తనంబు మీ మొగము చెప్పక చెప్పెడు నద్దిరయ్య! మా
- కెఱుఁగఁ దరంబె! మీ మహిమ లీర యెఱుంగుదు రేమిచెప్పుదున్? 73
- క. అనినఁ బరదేశి గృహపతి
- కనియెన్ సందియముఁ దెలియ నడుగుట తప్పా?
- వినవయ్య! జరయు రుజయును
- జెనకంగా వెఱచు మమ్ము సిద్ధుల మగుటన్. 74
- మ. పరమంబైన రహస్య మౌ నయిన డాఁపన్, జెప్పెదన్ భూమిని
- ర్జరవంశోత్తమ! పాదలేప మను పేరం గల్గు దివ్యౌషధం
- పు రసం బీశ్వరసత్కృపం గలిగెఁ దద్భూరి ప్రభావంబునం
- జరియింతున్ బవమాన మానస తిరస్కారిత్వరాహంకృతిన్. 75
- క. దివి బిసరుహబాంధవ సైం
- ధవ సంఘం బెంత దవ్వు దగ లే కరుగున్
- భువి నంత దవ్వు నేమును
- ఠవఠవ లే కరుగుదుము హుటాహుటి నడలన్. 76
- మ. అనినన్ విప్రవరుండు కౌతుకభర వ్యగ్రాంతరంగుండు భ
- క్తి నిబద్ధాంజలి బంధురుండు నయి మీ దివ్య ప్రభావం బెఱుం
- గని నా ప్రల్లదముల్ సహించి మునిలోకగ్రామణీ! సత్కృపన్
- నను మీ శిష్యుని దీర్థయాత్రవలనన్ ధన్యాత్ముఁగాఁ జేయరే! 77
- క. అనుటయు రసలింగము నిడు
- తన వట్రువ ప్రేఁపసజ్జ దంతపుబరణిన్
- నినిచిన యొకపస రిది యది
- యని చెప్పక పూసెఁ దత్పదాంబుజ యుగళిన్. 78
పసరు మహిమచేఁ బ్రవరుఁడు హిమాద్రి కేఁగుట
- క. ఆ మం దిడి యతఁ డరిగిన
- భూమీసురుఁ డరిగెఁ దుహిన భూధర శృంగ
- శ్యామల కోమల కానన
- హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్. 79
వ. అనిన విని యమ్మహీసురవరుఁ డట్లరిగి యెట్లు ప్రవర్తించె, నతని పుణ్యవర్తన శ్రవణంబు మనంబునకు హర్షోత్కర్షంబు గల్పించెఁ, దరువాతి వృత్తాంతంబుఁ గృపాయత్త చిత్తంబున నానతీయ వలయు నని యడుగుటయును. 80
ఆశ్వాసాంత పద్యగద్యములు
- శా. గంగా స్వచ్ఛ తరంగ భంగిక యశో గాఢ చ్ఛవి చ్ఛన్న సా
- రంగాంకాంక! నిరంకుశ ప్రతికళా ప్రౌఢి ప్రియంభావుకా!
- గాంగేయాచలచాప నూపుర వచో గాంభీర్య లీలాస్పదా!
- బంగా ళాంగ కళింగ భూప సుభటాభ్రశ్రేణి ఝంఝానిలా! 81
- క. మండలికతపన! శోభిత
- కుండలపతిశయన! కర్ణకుండలిత రసా
- ఖండకవికావ్య! దిగ్వే
- దండ శ్రుతిదళన కలహ తాడిత పటహా! 82
- ఉత్సాహ. కుకురు కాశ కురు కరూశ కోస లాంధ్ర సింధు బా
- హ్లిక శకాంగ వంగ సింహళేశ కన్యకామణి
- ప్రకర పాణిఘటిత రత్న పాదుకా కలాచికా
- ముకుర వీటికాకరండ ముఖ్య రాజలాంఛనా! 83
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస, శఠకోప తాపస ప్రసాదాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా మాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా ప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.
ద్వితీయాశ్వాసము
- శ్రీఖండ శీతనగ మ
- ధ్యాఖండక్షోణిమండలాఖండల! వి
- ద్యాఖేలనభోజ! సుధీ
- లేఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా! 1
వ. అవధరింపుము. జైమిని మునీంద్రునకుం బ్రజ్ఞాసాంద్రంబులగు పక్షీంద్రంబు లవ్వలికథ యిట్లని చెప్పం దొడంగె. 2
హిమనగర సౌందర్యములఁగని ప్రవరుని యానందము
- చ. అటఁ జని కాంచె భూమిసురుఁ డంబరచుంబి శిరస్సరజ్ఝరీ
- పటల ముహుర్ముహు ర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
- స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్,
- గటక చరత్కరేణు కర కంపిత సాలము, శీతశైలమున్. 3
వ. కాంచి యంతరంగంబునఁ దరంగితం బగు హర్షోత్కర్షంబున. 4
- క. నరనారాయణ చరణాం
- బురుహద్వయ భద్రచిహ్న ముద్రిత బదరీ
- తరుషండ మండలాంతర
- సరణిన్ ధరణీసురుండు చనఁ జన నెదుటన్. 5
- క. ఉల్లల దలకాజలకణ
- పల్లవిత కదంబముకుళ పరిమళ లహరీ
- హల్లోహల మద బంభర
- మల్లధ్వను లెసఁగ విసరె మరుదంకురముల్. 6
- సీ. తొండముల్ సాఁచి యందుగుఁజిగుళ్ళకు నిక్కు, కరుల దంతచ్ఛాయ గడలుకొనఁగ
- సెలవుల వనదంశములు మూఁగి నెఱెవెట్టఁ, గ్రోల్పులుల్ పొదరిండ్ల గుఱక లిడఁగ
- సెలయేటి యిసుకలంకల వరాహంబులు, మొత్తంబులై త్రవ్వి ముస్తెలెత్త
- నడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుఁ, బిళ్ళు డొంకలనుండి క్రేళ్లుదాఁటఁ
- తే. బ్రబల భల్లుక నఖభల్ల భయదమథన
- శిథిల మధుకోశ విసర విశీర్ణ మక్షి
- కాంతరాంతర దంతురితాతపమునఁ
- బుడమి తిలతండులన్యాయమున వెలుంగ. 7
- క. పరికించుచు డెందంబునఁ
- బురికొను కౌతుకముతోడ భూమీసురుఁ డ
- గ్గిరికటక తట నిరంతర
- తరు గహన గుహా విహార తత్పర మతియై. 8
- సీ. నిడుదపెన్నెఱిగుంపు జడగట్ట సగరు ము, మ్మనుమండు తపము గైకొనిన చోటు
- జరఠ కచ్ఛప కులేశ్వరు వెన్ను గానరా, జగతికి మిన్నేఱు దిగినచోటు
- పుచ్చడీకతనంబు పోఁబెట్టి గిరికన్య, పతిఁ గొల్వ నాయాస పడినచోటు
- వలరాచరాచవాఁ డలికాక్షు కనువెచ్చఁ, గరఁగిన యల కనికరపుఁజోటు
- తే. తపసి యిల్లాండ్ర చెలువంబుఁ దలఁచి తలఁచి
- మున్ను ముచ్చిచ్చును విరాళిఁ గొన్న చోటు
- కనుపపులు వేల్పుఁబడవాలుఁ గన్నచోటు
- హర్షమునఁ జూచి ప్రవరాఖ్యుఁ డాత్మలోన. 9
- చ. విలయకృశానుకీలముల వేఁడిమిఁ బోఁడిమి మాలి వెల్మిడిన్
- గలసిన భూతధాత్రి మఱి క్రమ్మఱ రూపయి నిల్చి యోషధుల్
- మొలవఁగఁజేయునట్టి నయముం బ్రతికల్పము నెట్లు గాంచు? నీ
- చలిమలవల్ల నుల్లసిలు చల్లఁదనంబును నూనకుండినన్. 10
- సీ. పసపునిగ్గులు దేఱు పాఁపజన్నిద మొప్పఁ, బ్రమథాధిపతి యింటిపట్టెఱింగె
- శచి కీఁత గఱపుచుఁ జదలేట సురరాజు, జలకేళి సవరించు చెలు వెఱింగె
- నదనుతోఁ జేఁపి చన్నవిసి యోషధుల మ, న్మొదవు కొండల కెల్లఁ బిదుక నెఱిఁగె
- వేల్పుటింతులలోన విఱ్ఱవీఁగుచు మేన, నవరత్న రచనల రవణ మెఱిఁగెఁ
- తే. బరిపరివిధంపు జన్నంపుఁ బరికరంపు
- సొంపుసంపద నిఖిల నిలింపసభయు
- నప్పటప్పటికిని జిహ్వ త్రుప్పు డుల్ల
- నామెత లెఱింగె నీతుషారాద్రికతన. 11
- మ. తలమే బ్రహ్మకు నైన నీనగ మహత్త్వం బెన్న? నే నియ్యెడం
- గల చోద్యంబులు ఱేపు గన్గొనియెదం గాకేమి, నేఁ డేఁగెదన్
- నళినీబాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహారకం
- దళ చూత్కారపరంపరల్ పయిపయిన్మధ్యాహ్నముందెల్పెడిన్. 12
- తే. అనుచుఁ గ్రమ్మఱువేళ నీహారవారి
- బెరసి తత్పాదలేపంబు గరఁగిపోయెఁ,
- గరఁగిపోవుట యెఱుఁగఁ డద్ధరణిసురుఁడు,
- దైవకృతమున కిల నసాధ్యంబు కలదె? 13
- మ. అతఁడట్లౌషధహీనుఁడై నిజపురీ యాత్రామిళత్కౌతుకో
- ద్ధతిఁ బోవన్ సపది స్ఫుటార్తిఁ జరణ ద్వంద్వంబు రా కుండినన్
- మతిఁ జింతించుచు నవ్విధం బెఱిఁగి హా! న న్నిట్లు దైవంబ! తె
- చ్చితె! యీ ఘోరవన ప్రదేశమునకున్ సిద్ధాపదేశంబునన్. 14
- క. ఎక్కడి యరుణాస్పదపుర!
- మెక్కడి తుహినాద్రి! క్రొవ్వి యే రాఁదగునే?
- యక్కట! మును సనుదెంచిన
- ది క్కిదియని యెఱుఁగ, వెడలు తెరు వెయ్యదియో! 15
- మ. అకలంకౌషధసత్త్వముం దెలియ మాయా ద్వారకావంతి కా
- శి కురుక్షేత్ర గయా ప్రయాగములు నే సేవింప కుద్దండ గం
- డక వేదండ వరాహ వాహరిపు ఖడ్గ వ్యాఘ్ర మిమ్ముంచుఁగొం
- డకు రాఁ జెల్లునె? బుద్ధిజాడ్య జనితోన్మాదుల్ గదా! శ్రోత్రియుల్. 16
- సీ. నను నిముసంబు గానక యున్న నూ రెల్ల, నరయు మజ్జనకుఁ డెంతడలునొక్కొ!
- యెపుడు సంధ్యలయందు నిలు వెళ్ళనీక న, న్నోమెడుతల్లి యెంతొఱలునొక్కొ!
- యనుకూలవతి నాదు మనసులో వర్తించు, కులకాంత మది నెంత కుందునొక్కొ!
- కెడఁ దోడునీడలై క్రీడించు సచ్ఛాత్రు, లింతకు నెంత చింతింతురొక్కొ!
- తే. యతిథి సంతర్పణంబు లేమయ్యెనొక్కొ!
- యగ్ను లే మయ్యెనొక్కొ! నిత్యంబు లైన
- కృత్యములఁ బాపి, దైవంబ! కినుక నిట్లు
- పాఱవైచితె! మిన్నులు పడ్డచోట! 17
- క. నను నిలు సేర్చు నుపాయం
- బొనరింపఁగఁజాలు సుకృతి యొకఁ డొదవఁడొకో!
- యనుచున్ జింతా సాగర
- మున మునిఁగి భయంబు గదురఁ బోవుచు నెదురన్. 18
- సీ. కులిశధారాహతి పొలుపునఁ బైనుండి, యడుగు మోవఁగ జేగు ఱైన తటులఁ
- గనుపట్టు లోయ గంగానిర్ఝరము వాఱఁ, జలువయౌ నయ్యేటి కెలఁకులందు
- నిసుకవెట్టిన నేల నేచి యర్కాంశులఁ, జొరనీక దట్టమై యిరులు గవియు
- క్రముక పున్నాగ నారంగ రంభా నాళి, కేరాది విటపి కాంతారవీథిఁ
- తే. గెరలు పిక శారికా కీర కేకి భృంగ
- సారసధ్వనిఁ దనలోని చంద్రకాంత
- దరులు ప్రతిశబ్ద మీన గంధర్వ యక్ష
- గానఘూర్ణిత మగు నొక్క కోనఁ గనియె. 19
- క. కనుఁగొని యిది మునియాశ్రమ
- మను తహతహ వొడమి, యిచటి కరిగిన నాకున్
- గన నగు నొక తెఱకువ యని
- మనమునఁ గల దిగులు కొంత మట్టువడంగన్. 20
- చ. నికట మహీధరాగ్ర తట నిర్గత నిర్ఝరధారఁ బాసి, లో
- యకుఁ దలక్రిందుగా మలఁకలై దిగు కాలువ వెంటఁ, బూచు మ
- ల్లిక లవలంబనంబుగ నళి ప్రకరధ్వని చిమ్మి రేఁగ, లో
- నికి మణిపట్టభంగసరణిన్ ధరణీసురుఁ డేఁగి చెంగటన్. 21
మణిమయభవనమున నప్సరస వరూధిని
- శా. తావుల్ క్రేవలఁ జల్లు చెంగలువ కేదారంబు తీరంబున
- న్మావుల్ క్రోవులు నల్లిబిల్లిగొను కాంతారంబునం, దైందవ
- గ్రావాకల్పిత కాయమాన జటిల ద్రాక్షా గుళుచ్ఛంబులన్,
- బూవుందీవెల నొప్పు నొక్క భవనంబున్, గారుడోత్కీర్ణమున్. 22
- క. కాంచి, తదీయ విచిత్రో
- దంచిత సౌభాగ్యగరిమ కచ్చెరువడి, య
- క్కంచన గర్భాన్వయమణి
- యించుక దఱియంగ నచటి కేఁగెడు వేళన్. 23
- క. మృగమద సౌరభ విభవ
- ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీగంధ
- స్థగితేతర పరిమళమై
- మగువ పొలుపుఁ దెలుపు నొక్క మారుత మొలసెన్. 24
- మ. అతఁ డా వాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా
- న్విత మిచ్చోటని చేరఁ బోయి, కనియెన్ విద్యుల్లతావిగ్రహన్,
- శతపత్రేక్షణఁ, జంచరీకచికురన్, జంద్రాస్యఁ జక్రస్తనిన్
- నతనాభిన్, నవలా నొకానొక మరున్నారీ శిరోరత్నమున్. 25
- తే. అమల మణిమయ నిజ మందిరాంగణస్థ
- తరుణ సహకార మూల వితర్దిమీఁద
- శీతలానిల మొలయ నాసీన యైన
- యన్నిలింపాబ్జముఖియు నయ్యవసరమున. 26
- సీ. తత నితంబాభోగ ధవళాంశుకములోని, యంగదట్టపుఁ గావి రంగువలన
- శశికాంతమణిపీఠి జాజువాఱఁగఁ గాయ, లుత్తుంగకుచపాళి నత్తమిల్లఁ
- దరుణాంగుళీ ధూతతంత్రీస్వనంబుతో, జిలిబిలిపాట ముద్దులు నటింప
- నాలాపగతిఁ జొక్కి, యరమోడ్పుఁ గనుదోయి, రతిపారవశ్య విభ్రమము దెలుపఁ
- తే. బ్రౌఢిఁ బలికించు గీత ప్రబంధములకుఁ
- గమ్రకరపంకరుహ రత్న కటక ఝణఝ
- ణ ధ్వనిస్ఫూర్తి తాళమానములు గొలుప
- నింపు దళుకొత్త వీణ వాయింపుచుండి. 27
ప్రవరుని సౌందర్యముఁగని వరూధిని మోహించుట
- ఉ. అబ్బురపాటుతోడ నయనాంబుజముల్ వికసింపఁ, గాంతి పె
- ల్లుబ్బి కనీనికల్ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా,
- గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్, మదిలోనఁ గోరికల్
- గుబ్బతిలంగఁ జూచె, నలకూబరసన్నిభు నద్ధరామరున్. 28
- ఉ. చూచి, ఝళంఝళ త్కటక సూచిత వేగ పదారవిందయై
- లేచి, కుచంబులున్ దుఱుము లేనడుమల్లల నాడ, నయ్యెడన్
- బూచిన యొక్క పోఁక నునుబోదియఁ జేరి విలోకనప్రభా
- వీచికలన్‌ఁ, దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్. 29
- మ. మునుమున్ పుట్టెడుకొంకు లౌల్యము నిడన్, మోదంబు విస్తీర్ణతన్
- జొనుపన్, గోర్కులు గ్రేళ్లు ద్రిప్ప, మదిమెచ్చుల్ ఱెప్ప లల్లార్ప న
- త్యనుషంగస్థితి ఱిచ్చపా టొసఁగ, నొయ్యారంబునన్ జంద్రిక
- ల్దనుకన్ జూచె లతాంగి భూసురుఁ బ్రఫుల్లన్నేత్ర పద్మంబులన్. 30
- క. పంకజముఖి కప్పుడు మై
- నంకురితము లయ్యెఁ బులక లావిష్కృత మీ
- నాంకానల సూచక ధూ
- మాంకురములు వోలె మఱియు నతనిన్ జూడన్. 31
- ఉ. తొంగలిఱెప్పలం దొలఁగఁ ద్రోయుచుఁ, బైపయి విస్తరిల్లు క
- న్నుంగవ యాక్రమించుకొనునో! ముఖచంద్రు నటంచుఁ బోవనీ
- కంగజుఁ డానవెట్టి కదియన్ గుఱివ్రాసె ననంగ, జాఱి సా
- రంగమదంబు లేఁజెమటఁ గ్రమ్మె లలాటము డిగ్గి చెక్కులన్. 32
- మ. అనిమేషస్థితి మాన్పె బిత్తరపుఁజూ, పస్వేదతావృత్తి మా
- న్పె నవస్వేదసమృద్ధి, బోధకళ మాన్పెన్ మోహవిభ్రాంతి, తో
- డనె గీర్వాణవధూటికిన్, భ్రమర కీట న్యాయ మొప్పన్ మను
- ష్యుని భావించుట మానుషత్వము మెయింజూపట్టె నానత్తఱిన్. 33
వ. ఇట్లతని రూపరేఖావిలాసంబులకుంజొక్కి, యక్కమలపత్రేక్షణ యాత్మగతంబున. 34
- ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్
- జక్కఁదనంబునన్ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం
- బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్
- డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్. 35
- సీ. వదన ప్రభాత లావణ్యాంబు సంభూత, కమలంబు లన వీనికన్ను లమరు
- నిక్కి వీనులతోడ నెక్కసక్కెములాడు, కరణి నున్నవి వీని ఘనభుజములు,
- సంకల్ప సంభవాస్థాన పీఠిక వోలె, వెడఁదయై కనుపట్టు వీని యురము
- ప్రతిఘటించు చిగుళ్ళపై నెఱ్ఱవాఱిన, రీతి నున్నవి వీని మృదుపదములు,
- తే. నేరెటేటియసల్ తెచ్చి, నీరజాప్తు
- సానఁ బట్టిన రాపొడి చల్లి, మెదిపి
- పదను సుధ నిడి చేసెనో పద్మభవుఁడు
- వీని; గాకున్నఁ గలదె యీ మేని కాంతి? 36
- క. సుర గరుడోరగ నర ఖే
- చర కిన్నర సిద్ధ సాధ్య చారణ విద్యా
- ధర గంధర్వ కుమారుల
- నిరతము గనుఁగొనమె! పోల నేర్తురె వీనిన్? 37
- మ. అని చింతించుచు మీనకేతనధనుర్జ్యాముక్త నారాచ దు
- ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై, దీపించు పెందత్తఱం
- బునఁ బేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్ మ్రోయ, నడ్డంబు ని
- ల్చిన నయ్యచ్చరఁ జూచి చేరఁ జని పల్కెన్ వాఁడు విభ్రాంతుఁడై. 38
తెరువుఁ దెల్పుమని ప్రవరుఁడు వరూధిని నర్థించుట
- ఉ. ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే
- కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితిన్
- గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి, పురంబుఁ జేర నిం
- కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగున్. 39
- క. అని తనకథ నెఱిఁగించినఁ
- దన కనుఁగవ మెఱుఁగు లుబ్బఁ, దాటంకములున్
- జనుఁగవయ నడుమ వడఁకఁగ,
- వనిత సెలవివాఱ నవ్వి వానికి ననియెన్. 40
వరూధినీ నర్మగర్భ భాషణము
- ఉ. ఇంతలు కన్ను లుండఁ దెరువెవ్వరి వేఁడెదు భూసురేంద్ర! యే
- కాంతమునందు నున్న జవరాండ్ర, నెపంబిడి పల్కరించు లా
- గింతయ కాక, నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు? నీ
- కింత భయంబు లే కడుగ నెల్లిద మైతిమె! మాట లేటికిన్? 41
వ. అని నర్మగర్భంబుగాఁ బలికి, క్రమ్మఱ నమ్మగువ యమ్మహీసురున కిట్లనియె. 42
- సీ. చిన్ని వెన్నెలకందు వెన్నుదన్ని సుధాబ్ధిఁ, బొడమిన చెలువ తోఁబుట్టు మాకు
- రహి పుట్ట జంత్రగాత్రముల ఱాల్ గరఁగించు, విమలగాంధర్వంబు విద్య మాకు
- ననవిల్తు శాస్త్రంపు మినుకు లావర్తించు, పని వెన్నతోడఁ బెట్టినది మాకు
- హయమేధ రాజసూయము లనఁ బేర్వడ్డ, సవనతంత్రంబు లుంకువలు మాకుఁ
- తే. గనకనగసీమఁ గల్ప వృక్షముల నీడఁ
- బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుఁ,
- పద్మసంభవ వైకుంఠ భర్గ సభలు
- సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర! 43
- క. పేరు వరూధిని విప్రకు
- మార! ఘృతాచీ తిలోత్తమా హరిణీ హే
- మా రంభా శశిరేఖ లు
- దారగుణాఢ్యలు మదీయలగు ప్రాణసఖుల్. 44
- మ. బహురత్నద్యుతి మేదురోదర దరీ భాగంబులం బొల్చు ని
- మ్మిహికాహార్యమునన్ జరింతు మెపుడుం బ్రేమన్, నభోవాహినీ
- లహరీ శీతల గంధవాహ పరిఖేల న్మంజరీ సౌరభ
- గ్రహణేందిందిర తుందిలంబు లివి, మత్కాంతార సంతానముల్. 45
- క. భూసుర! కైతవ కుసుమ శ
- రాసన! మాయింటి విందవైతివి, గైకొ
- మ్మా! సముదంచ న్మణిభవ
- నాసీనత సేద దేఱి యాతిథ్యంబున్. 46
- తే. కుందనమువంటి మేను మధ్యందినాత
- పోష్మహతిఁ గందె, వడ దాఁకె నొప్పులొలుకు
- వదన, మస్మద్గృహంబు పావనము సేసి
- బడలికలు వాసి చను మన్న బ్రాహ్మణుండు. 47
- ఉ. అండజయాన! నీ వొసఁగునట్టి సపర్యలు మాకు వచ్చె, నిం
- దుండఁగ రాదు, పోవలయు నూరికి, నింటికి నిప్పు, డేను రా
- కుండ నొకండు వచ్చి మఱియొండునె? భక్తియ చాలు, సత్క్రియా
- కాండముఁ దీర్ప, వేగ చనఁగా వలయున్ గరుణింపు నాపయిన్. 48
- ఉ. ఏ నిఁక నిల్లు సేరుటకు నెద్ది యుపాయము? మీ మహత్త్వము
- ల్మానిని! దివ్యముల్; మదిఁ దలంచిన నెందును మీ కసాధ్యము
- ల్గానము గానఁ దల్లి! ప్రజలన్ ననుఁ గూర్చు మటన్న, లేఁత న
- వ్వాననసీమఁ దోఁప, ధవళాయతలోచన వాని కిట్లనున్. 49
- ఉ. ఎక్కడియూరు? కాల్నిలువకింటికిఁ బోయెద నంచుఁ బల్కె దీ
- వక్కట! మీకుటీరనిలయంబులకున్ సరిరాక పోయెనే
- యిక్కడి రత్నకందరము! లిక్కడి నందన చందనోత్కరం!
- బిక్కడి గాంగసైకతము! లిక్కడి యీ లవనీనికుంజముల్. 50
ప్రవరుఁడు వరూధుని కామనను నిరాకరించుట
- ఉ. నిక్కము దాఁప నేల ధరణీసురనందన! యింక నీపయిన్
- జిక్కె మనంబు నాకు, ననుఁ జిత్తజుబారికి నప్పగించెదో?
- చొక్కి మరందమద్యముల చూఱలఁ బాటలువాడు తేంట్ల సొం
- పెక్కినయట్టి పూవుఁబొదరిండ్లను గౌఁగిట గారవించెదో? 51
- క. అనుటయుఁ బ్రవరుం డిట్లను
- వనజేక్షణ! యిట్లు వలుక వరుసయె? వ్రతులై
- దినములు గడపెడు విప్రులఁ
- జనునే కామింప? మది విచారము వలదే? 52
వరూధినీ ప్రవర సంవాదము
- ఉ. వేలిమియున్ సురార్చనయు విప్రసపర్యయుఁ జిక్కె, భుక్తికి
- న్వేళ యతిక్రమించె, జననీ జనకుల్ కడు వృద్ధు లాఁకటన్
- సోలుచుఁ జింతతో నెదురు సూచుచునుండుదు, రాహితాగ్ని నేఁ,
- దూలు సమస్తధర్మములుఁ దొయ్యలి! నేఁ డిలు సేరకుండినన్. 53
- ఉ. నావుడు విన్నఁబాటు వదనంబున నించుక దోఁప బల్కె నో
- భావజరూప! యిట్టియెలప్రాయము వైదికకర్మనిష్ఠలం
- బోవఁగ, నింక భోగములఁ బొందుట యెన్నఁడు? యజ్ఞకోటులం
- బావను లౌటకున్ ఫలము మా కవుఁగిళ్ళ సుఖించుటేకదా? 54
- సీ. సద్యో వినిర్భిన్న సారంగనాభికా, హృతమై పిసాళించు మృగమదంబు
- కసటువో బీఱెండఁ గరఁగి కఱ్ఱల నంటి, గమగమ వలచు చొక్కపు జవాజి
- పొరలెత్తి ఘనసార తరువులఁ దనుఁదాన, తొరఁగిన పచ్చకప్పురపు సిరము
- గొజ్జంగి పూఁ బొదల్ గురియంగఁ బటికంపు, దొనల నిండినయట్టి తుహినజలము
- తే. వివిధ కుసుమ కదంబంబు దివిజతరుజ
- మృదుల వసన ఫలాసవామేయ రత్న
- భూషణంబులు గల, విందు భోగపరుఁడ
- వయి, రమింపుము ననుఁగూడి యనుదినంబు. 55
- క. అంధునకుఁ గొఱయె వెన్నెల?
- గంధర్వాంగనల పొందు గా దని, సంసా
- రాంధువునఁ బడియె దకట! ది
- వాంధము, వెలుఁగు గని గొంది నడఁగిన భంగిన్ 56
- ఉ. ఎన్నిభవంబులన్ గలుగు? నిక్షుశరాసన సాయక వ్యథా
- భిన్నత వాడి వత్తలయి కేలఁ గపోలము లూఁది, చూపులన్
- విన్నఁదనంబు దోఁపఁ, గనువేఁదుఱునన్ బయిగాలి సోఁకినన్
- వెన్నవలెం గరంగు నలివేణులఁ గౌఁగిటఁ జేర్చుభాగ్యముల్. 57
- క. కుశలతయే వ్రతముల నగు
- నశనాయాపీడ నింద్రియ నిరోధమునన్
- గృశుఁడ వయి యాత్మ నలఁచుట?
- సశరీరస్వర్గ సుఖము సమకొని యుండన్. 58
- తే. అనినఁ బ్రవరుండు నీ వన్న యర్థ మెల్ల
- నిజము కాముకుఁడైనవానికి, నకాముఁ
- డిది గణించునె? జలజాక్షి! యెఱిఁగితేని
- నగరమార్గంబుఁ జూపి పుణ్యమునఁ బొమ్ము. 59
- క. బ్రాహ్మణుఁ డింద్రియవశగతి
- జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా
- జిహ్మగముల పాలై, చెడు
- బ్రహ్మానందాధిరాజ్య పదవీ చ్యుతుఁడై. 60
వ. అనిన నత్తెఱవ యక్కఱకరి పలుకుల కులికి, గఱిగఱిం గఱవఁ గరకరిం జెఱకు విలుకాఁడు పరఁగించు విరిదమ్మి గొరకలు నెఱఁ కులఁ జుఱుకుచుఱుక్కునం గాఁడినఁ గడుం గెరలి, పరిణత వివిధ విబుధతరు జనిత మధుర మధురసం బానుమదంబు నదటునం జిదిమిన నెఱుంగక, మదనహరునైనఁ జదురునం గదియ గమ కించు తిమురునం గొమిరెప్రాయంపు మదంబునను, ననన్య కన్యా సామాన్య లావణ్యరేఖా మదంబునను, నొంటిపాటునం గంటికిం బ్రియుండై, తంగేటి జుంటి చందంబునం గొంటుఁదనం బెఱుంగక కుఱంగటనున్న యమ్మహీసురవరకుమారు తారుణ్యమౌగ్ధ్యంబులం జేసి తన వైదగ్ధ్యంబు మెఱయఁ గలిగె నని పల్లవించు నుల్లంబు నుల్లాసంబునం గదురు మదంబున నోసరించక, చంచల దృగంచల ప్రభ లతని ముఖాంబుజంబునఁ బొలయ వలయ మణిగణ చ్ఛాయా కలాపంబు లుప్పరం బెగయఁ, గొప్పు చక్కంజెక్కుచు, జక్కవ గిబ్బలుం బోని గబ్బిగుబ్బలన్ జొబ్బిల్లు కుంకుమ రసంబునం బంకి లంబులగు హారముక్తాతారకంబుల నఖకోరకంబులం గీఱి తీరు వడం జేయుచుఁ, బతిత వనతరు కుసుమకేసరంబులు దాల్చు నెపంబునఁ బయ్యెద విదల్చి చక్క సవరించుచు, నంతంతం బొలయు చెలులం దలచూపక యుండం దత్తఱంబునంజేసి బొమముడిపాటుతో మగిడి మగిడి చూచుచుఁ, జిడిముడిపాటు చూపుల నంకురించు జంకెనల వారించుచుం జేరి యిట్లనియె. 61
- శా. ఎందే డెందము కందళించి రహిచే, నేకాగ్రతన్ నిర్వృతిం
- జెందున్ గుంభగత ప్రదీపకళికాశ్రీ దోఁప, నెందెందుఁ బో
- కెందే నింద్రియముల్ సుఖంబుఁగను, నాయింపే పరబ్రహ్మ, 'మా
- నందో బ్రహ్మ' యటన్న ప్రాఁజదువు నంతర్భుద్ధి నూహింపుమా! 62
- తే. అనుచుఁ ద న్నొడఁబఱుచు న య్యమరకాంత
- తత్తఱముఁ జూచి, యాత్మ నతండు దనకు
- సిగ్గు వెగటును బొడమ, నిస్పృహతఁ దెలుపు
- నొక్కచిఱునవ్వు నవ్వి, యయ్యువిద కనియె. 63
- శా. ఈ పాండిత్యము నీకుఁదక్క మఱి యెందేఁ గంటిమే? కామశా
- స్త్రోపాధ్యాయివి నా వచించెదవు మేలొహో! త్రయీధర్మము
- ల్పాపంబుల్, రతి పుణ్య మంచు, నిఁక నేలా తర్కముల్? మోక్షల
- క్ష్మీపథ్యాగమ సూత్రపంక్తికివె పో మీ సంప్రదాయార్థముల్. 64
- మ. తరుణీ రేపును మాపు హవ్యములచేతం దృప్తుఁడౌ వహ్ని స
- త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు? నా
- కరణుల్ దర్భలు నగ్నులుం బ్రియములైనట్లన్యముల్గా వొడ
- ల్తిరమే? చెప్పకు మిట్టి తుచ్ఛసుఖము ల్మీసాలపైఁ దేనియల్. 65
- చ. అనుటయు మాట లేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
- కనలుచు నీరుదేఱు తెలిగన్నుల నాతనిఁ బుల్‌కు పుల్కునన్
- గనుఁగొని మాటలం బొదువు గద్గదికం దల యూఁచి యక్కటా!
- వనిత తనంతఁ దా వలచి వచ్చినఁ జుల్కన కాదె! యేరికిన్? 66
వరూధిని పై కొనఁ బ్రవరుఁడు తిరస్కరించిపోవుట
- మ. వెతలం బెట్టకు మింక న న్ననుచు నీవీబంధ మూడన్, రయో
- ద్ధతి నూర్పుల్ నిగుడన్ విరులు చిందం గొప్పు వీడం దనూ
- లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతిదీనాస్యయై
- రతిసంరంభము మీఱ నిర్జరవధూరత్నంబు పై పాటునన్. 67
- శా. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
- యంచుల్ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ'
- యంచున్ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
- మ్మంచున్ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్ ధీర చిత్తంబులన్? 68
- క. త్రోపువడి నిలిచి ఘన ల
- జ్జా పరవశ యగుచుఁ గొప్పు సవరించి, యొడల్
- దీపింప నతనిఁ జుఱచుఱఁ
- గోపమునన్ జూచి క్రేఁటుకొనుచున్ బలికెన్. 69
- ఉ. పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
- చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
- ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో
- మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్. 70
- క. ఈ విధమున నతికరుణము
- గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్
- గావిగొన నేడ్చి, వెండియు
- నా విప్రకుమారుఁ జూచి యలమటఁ బల్కెన్. 71
- ఉ. చేసితి జన్నముల్ దపము చేసితి నంటి, దయావిహీనతన్
- జేసిన పుణ్యముల్ ఫలము సెందునె? పుణ్యము లెన్ని యేనియున్
- జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి, కో
- భూసురవర్య! యింత దలపోయవు నీ చదు వేల? చెప్పుమా! 72
- సీ. వెలివెట్టిరే బాదములు పరాశరుఁ బట్టి, దాశకన్యాకేళిఁ దప్పుఁజేసి?
- కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి, పట్టికి మేనక చుట్టఱికము?
- ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి, మహిమ గోల్పడియెనే మాందకర్ణి?
- స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ, ల్యాజారుఁ డైన జంభాసురారి?
- తే. వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె?
- పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప
- కచ్చడాల్ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్లఁ
- దామరసనేత్ర లిండ్ల బందాలు గారె? 73
అగ్నిని బ్రార్థించి ప్రవరుఁ డిలుసేరుట
- తే. అనిన నేమియు ననక యవ్వనజగంధి
- మేని జవ్వాదిపస కదంబించు నొడలు
- గడిగికొని వార్చి, ప్రవరుండు గార్హపత్య
- వహ్ని ని ట్లని పొగడె భావమునఁ దలఁచి. 74
- మ. దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తిం గాంచు, నిన్నీశుఁగా
- స్తవముల్ సేయు శ్రుతుల్, సమస్త జగదంతర్యామివిన్ నీవ, యా
- హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్, గ్రతూ
- త్సవసంధాయక! నన్నుఁ గావఁగదవే! స్వాహావధూవల్లభా! 75
- ఉ. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుఁడనేని, భవత్పజాంబుజ
- ధ్యాన రతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స
- న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
- భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా! 76
వ. అని సంస్తుతించిన నగ్నిదేవుం దమ్మహీదేవు దేహంబున సన్ని హితుం డగుటయు నమ్మహాభాగుండు గండు మీఱి పొడుపుఁగొండ నఖండ సంధ్యారాగప్రభా మండలాంతర్గతుండగు పుండరీక వన బంధుండునుంబోలె నుత్తప్త కనకద్రవధారా గౌరంబగు తనుచ్ఛా యావూరంబున నక్కాన వెలింగించుచు నిజగమన నిరోధిని యగు నవ్వరూధిని హృదయకంజమున రంజిల్లు నమందానురాగరస మకరందంబు నందంద పొంగంజేయుచుఁ బావకప్రసాద లబ్ధంబగు పవనజవంబున నిజమందిరంబున కరిగి నిత్యకృత్య సత్కర్మ కలాపంబులు నిర్వర్తించె నని మార్కండేయుండు క్రోష్టికిం జెప్పెనని చెప్పిన. 77
- క. జైమిని యా దివ్య ఖగ
- గ్రామణులంజూచి వేడ్క గడలుకొనంగా
- నామీఁద వరూధిని విధ
- మే మయ్యె నెఱుంగఁ జెప్పరే నా కనుడున్. 78
ఆశ్వాసాంత పద్యగద్యములు
- శా. నిస్తంద్రప్రతిభా! సుధీనుత! దిశోన్మీలద్యశశ్శ్రీవధూ
- హస్తాగ్రామలకాయమాన మహనీయాంభోజగర్భాండ! సై
- న్యస్తోమోత్థ రజోవ్రజ స్థగిత కృష్ణాగౌతమీ మధ్య భూ
- మ్యస్తోకోత్కలరాట్పురీ హరణ లీలావార్య శౌర్యోదయా! 79
- క. బిసరుహనయనా నవవిధ
- కుసుమాయుధ! యవధికుధరకూటాంచల భూ
- విసృమర తేజ శ్చంపక
- భసల దసత్కీర్తి మలిన పరిపంథినృపా! 80
- కవిరాజ విరాజితము. నల నృగ రంతి భగీరథ భారతనందన కల్ప! యనల్ప యశ
- శ్చులుకితలోక! విలోకివధూజన సూనశరానన! మానఖనీ!
- ప్రళయ ఘనాఘన ఘోష జయానక భాంకృతి భీమ చపేట లుఠ
- త్కలబరిగీకటకక్షితి రక్షక! కన్నడరాజ్య రమారమణా! 81
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లికాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవంబను మహా ప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.
తృతీయాశ్వాసము
- శ్రీ వేంకటేశ పదప
- ద్మావేశిత సదయహృదయ! హరనిటల నట
- త్పావక పరిభావి మహః
- ప్రావృతనిఖిలాశ! కృష్ణరాయమహీశా! 1
వ. అవధరింపు మమ్మహాత్మునకుం బక్షు లిట్లనియె. 2
వరూధినీ విరహ వేదనము
- శా. ఆ భూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూన రమ్యాకృతిన్
- దా భావంబున నిల్పి యంగభవ కోదండోగ్ర మౌర్వీరవ
- క్షోభాకంపిత ధైర్యయై, యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త
- ద్భూభృన్మేఖల వెంటఁ గానలబడిన్ దుఃఖాబ్ధినిర్మగ్నయై. 3
- క. తిరుగుచు ధరణీసురవరుఁ
- డరిగిన చొప్పరసియరసి యటఁగానక యా
- హరిణాంకముఖి సఖీజన
- పరివృతయై మగిడి వచ్చి భావములోనన్ 4
- ఉ. అక్కట! వాఁడు నాతగుల మాఱడిసేసి దయావిహీనుఁడై
- చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగరాని వియోగసాగరం
- బెక్కడ నీఁదుదాన? నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే
- నెక్కడ? వాని కౌఁగి లది యెక్కడ? హా విధి? యేమి సేయుదున్? 5
- ఉ. కమ్మనికుందనంబు కసుగందనిమే, నెలదేఁటి దాఁటులన్
- బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెఁడు వెండ్రుక, లిందుబింబమున్
- గిమ్మననీదు మోము, గిరిక్రేపులు మూఁపులు , కౌను గాన రా
- దమ్మకచెల్ల! వాని వికచాంబకముల్ శతపత్త్ర జైత్రముల్. 6
- ఉ. చొక్కపుఁబ్రాయమున్ మిగుల సోయగముం గల ప్రాణనాయకుం
- డెక్కుడు వశ్యతన్ రతుల నేఁకటఁ దీర్చి సమేళ మొప్పఁగా
- నక్కున గారవించి ప్రియ మందఁగ నోఁచని యింతిదైన యా
- చక్కఁదనం బ దేమిటికి? జవ్వన మేటికిఁ? బ్రాణ మేటికిన్? 7
- ఉ. ఎంత తపంబు సేసి జనియించిన వారొకొ! మర్త్యభామినుల్
- కాంతుఁడవజ్ఞ చేసినను గాయము వాయుదు; రే నమర్త్యనై
- చింతల వంతలం జివికి సిగ్గఱితిన్ మృతి లేని నాదుచె
- ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపిక యయ్యె నక్కటా! 8
వ. అని వితర్కించుచుఁ గ్రిందుఁదనంబునం బునఃపునః పరిభవ కారియై కాఱియఁ బెట్టు సిరిపట్టి బెట్టేయం గాఁడిచను నలరంప కట్టియల గుట్టుచెడి వెచ్చవెచ్చనై హెచ్చి విచ్చలవిడిం గాయు నుద్దామ విరహ దవదహన దాహంబున దేహంబు తల్లడిల్ల, మల్లడిగొని పెల్లడరు నిట్టూర్పుగాడ్పు విసరులం గస రెత్తి యంతకంత కంతరంగంబున నితంతనరాక పొంగి చింతాసాగ రంబు వేగిరంబ వెల్లివొడిచె ననం దుడిచిన నడంగక సారెకుం దారకల నీరిక లెత్తు పొగ రన నిగనిగ లినుమడిగ నిగుడ మిగులు వగల బుగులు బుగులున నెగసి యెగసి యొప్పులకుప్ప లగు ఱెప్పలం జిప్పిలు కాటుక లప్పళించి కరంచి దరదళ దరుణ కమలదళ శోణంబులగు దృక్కోణంబులన్ దిగువాఱు కన్నీరు చెన్నారు కర్ణద్వయీ గోళంబులు నిండి తనుతాప తప్తంబగు హాటకతాటంక యుగళంబునంబడి క్రొంబొగ లెగయింప, బిస కిసలయ సగంధంబగు మణిబంధంబునఁ జికురబంధంబుఁ జేర్చు కొని పొరలం దుఱిమిన విరు లురుల నరవిరిసి కవిసి యిరులు కొను గరగరని నెఱికురులు గుఱిగడవఁ బెరిఁగినవగుటం జేసి రాశివడి మెయి మూసికొని గ్రహగణంబులం జెన్నగు మిన్ను విఱిగి పయింబడిన వడుపున బెడంగువడఁ, గలయఁ దలకొను పులకమొలక పయిరునకుం బాఱు దుర్వార వారిపూరం బనం గ్రమ క్రమంబున సంగంబులం గ్రమ్ము చెమ్మటల మిన్నేటి పెన్నీటి వఱ్ఱున మునుంగకుండ సవరించిన మించు కుంభప్లవం బనం బరిభ్రష్టోత్తరీయంబై బయలువడి యబ్బురంపు గుబ్బ చనుదోయి నిబ్బరంపు మెఱుంగు లీనం, గుపిత హర నయన శిఖి శిఖా భస్మీకృత స్మర విరహ శోకంబునం బడి చందురునిం బట్టుకొని యడలు రతిరమణి చందంబునం, గుసుమిత లతాంత నిశాంత శశికాంత వేదికాంతరంబున మేను సేర్చి వివిధ దశాంతరంబుల వేఁగుచుండె నంత.9
సూర్యాస్తమయ వర్ణనము
- చ. తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యథా
- భర వివశాంగి నంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
- యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని, రోషభీషణ
- స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్. 10
- సీ. ఉరుదరీకుహర సుప్తోత్థ శార్దూలముల్, ఝరవారి శోణిత శంకఁ ద్రావ
- వనకుంజమధ్య శాద్వలచరన్మృగపంక్తి, దావపావక భీతిఁ దల్లడిల్ల
- నాశ్రమాంతర భూరుహాగ్రముల్ మునికోటి, బద్ధకాషాయ విభ్రాంతిఁ జూడ
- ఘనసాను శృంగ శృంగాటకంబులఁ గాంచి, యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ
- తే. గాసెఁ, బేశలరుచిఁ గింశుక ప్రవాళ
- ఘుసృణ కిసలయ కంకేళి కుసుమగుచ్ఛ
- బంధుజీవ జపా రాగ బాంధవంబు
- లన్నగంబున జరఠారుణాతపములు. 11
- శా. శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు, లుష్ణాంశుపా
- షాణవ్రాతము కోష్ణ మయ్యె, మృగతృష్ణావార్ధు లింకెన్, జపా
- శోణం బయ్యెఁ బతంగబింబము, దిశాస్తోమంబు శోభాదరి
- ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్. 12
- క. తరణి యిదె గ్రుంకుచున్నాఁ
- డరుదె మ్మని చంద్రుఁ బిల్వ నరిగెడు రజనీ
- తరుణీమణిదూతిక లన
- నరిగెం దూర్పునకు నీడ లతిదీర్ఘములై. 13
- క. క్రుంకె నపరాంబురాశిం
- బంకజబంధుఁడు తదీయ బడబాముఖ వీ
- క్షాంకురిత కుతుక రథ్య ని
- రంకుశ వేగాపహృత శతాంగుఁడు వోలెన్. 14
వ. ఆ సమయంబున. 15
- సీ. ఏ విహంగముఁ గన్న నెలుఁగిచ్చుచును సారె, కును సైకతంబులఁ గూఁడ దారుఁ
- దారి కన్గొని యది తనజోడు గాకున్న, మెడ యెత్తి కలయంగ మింట నరయు
- నరసి కన్నీటితో మరలి తామర యెక్కి, వదన మెండఁగ సరోవారి నద్దు
- నద్ది త్రావఁగ సైఁప కట్టిట్టు గన్గొని, ప్రతిబింబ మీక్షించి బ్రమసి యుఱుకు
- తే. నుఱికి యెఱకలు దడియ వేఱొక్కతమ్మి
- కరుగు, నరిగి రవంబుతోఁ దిరుగుతేంట్లఁ
- బొడుచు ముక్కున, మఱియును బోవు వెదుక
- సంజఁ బ్రియుఁ బాసి వగ నొక్క చక్రవాకి. 16
- సీ. రవిబింబ పతన దీర్ఘ పయోధి గర్భ ని, ర్గత శేషఫణి ఫణా రత్న రుచియొ!
- దివసావసాన సందీప్తాస్తగిరి శిఖా, జ్యోతిర్లతా ప్రతానాతపంబొ!
- తపనధూర్దండ నిర్దళిత దిక్తట దృశ్య, కమలజాండ కటాహ కనకఘృణియొ!
- చండీశ తాండవోత్సవ సంభృతక్షపా, హస్తాగ్ర దీప గభస్తి చయమొ!
- తే. ద్రా గ్విదాహ చ్ఛిదా వినిద్రాణ మదవ
- దంజనాలాన మూల శయ్యా విధాన
- వారుణాధోరణాకల్పితోరు శోణ
- మృత్తికా రాశియో! యన మెఱసె సంధ్య. 17
- క. బహుళజల ప్లవమాన
- ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
- రహితతఁ గాటుకపట్టెను
- రహి చెడి యన నంధతమస రాసులు బెరసెన్. 18
- సీ. మృగనాభిపంకంబు మెయినిండ నలఁదిన, మాయాకిరాతు మైచాయఁ దెగడి
- నవపించమయభూష లవధరించి నటించు, పంకజాక్షునిచెల్వు సుంక మడిగి
- కాదంబ నికురంబ కలిత యై ప్రవహించు, కాళిందిగర్వంబుఁ గాకుసేసి
- తాపింఛవిటపి కాంతార సంవృతమైన, యంజనాచలరేఖ నవఘళించి
- తే. కవిసె మఱియును గాకోల కాలకంఠ
- కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
- ఘనఘనాఘనసంకాశ గాఢకాంతిఁ
- గటికిచీఁకటి రోదసీ గహ్వరమున. 19
చంద్రోదయ వర్ణనము
- క. అంతటఁ బ్రాచి నిశాపతి
- యంతికగతుఁ డౌట విని ముఖాలంబి తమః
- కుంతలములు దీర్పఁగఁ గొను
- దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోఁచెన్. 20
- చ. మరున కొసంగఁ గాలము తమశ్ఛట గాటుకగా నవోదయ
- స్ఫురదరుణప్రభా పథిక శోణితసిక్త సితోడుభక్తమున్
- హరిహయదిఙ్నభస్స్థలమునన్ బలి చల్లి వటాంకమున్ వసూ
- త్కరభరితంబు నై వెలుఁగఁ గాంచి సుధానిధి నెత్తె నత్తఱిన్. 21
- మ. జలజాగారపరంపరల్ మఘవదాశాభిత్తిఁ దీండ్రించుచున్
- దళ మై వెన్నెలచిచ్చు లంటిన మిళద్బాహ్య చ్ఛదశ్యామికా
- చ్ఛలనం గంది ముడుంగుచో సిమసిమచ్ఛబ్దంబుతోఁ బుట్టు న
- గ్గలపుంగ్రొంబొగలో! యనంగ వెడలెన్ గర్భస్వనద్భృంగముల్. 22
- సీ. ప్రిదిలి కైరవదళశ్రేణి నొక్కులు దీరె, శశికాంతపంక్తుల జలము లూరెఁ
- గోరి కాంతులతోఁ జకోరికల్ రతిఁ గేరె, వారాశిగర్వంబు మేర మీఱెఁ
- ద్రోపడి యిరులు పటాపంచలై పాఱె, దిఙ్ముఖంబుల వింతతెలివి సేరెఁ
- జక్రవాకంబు లబ్జకుడుంగములు దూఱెఁ, గామినీకాంతుల కలఁక దేఱె
- తే. మదనుఁ డమ్ముల నూఱె, హిమంబు పేరె,
- జడిసి విరహిణి వగఁ గూరె, జారచోర
- దర్పములు జాఱె, రవికరతాప మాఱెఁ,
- జూడఁ జూడంగఁ దారక స్ఫురణ దాఱె. 23
- మ. స్ఫుట సౌగంధిక రాగ రక్తరుచి మైఁ బూనెన్ జపాసన్నిధి
- స్ఫటికంబ ట్లుదయాద్రి గైరిక శిరస్స్థానస్థితిం జంద్రుఁడ
- చ్చొటువాయన్ శుచియయ్యె, నౌఁబ్రకృతి నచ్ఛుండైన సన్మార్గియె
- న్నఁటికిం గూటమివంక వచ్చువికృతిన్ మగ్నుండు గానేర్చునే? 24
- శా. ఆరూఢస్థితిఁ జంద్రికాధవళితాజాండంబులోఁ జంద్రుఁ డొ
- ప్పారెం, గాలభిషగ్వరుం డవిరతంబై కాముకశ్రేణికిన్
- మారోత్సాహము నిల్వఁ, బాదరసముం బంధించి, గ్రాసార్థ మై
- క్షీరస్థాలికఁ బెట్టినట్టి గుటికాసిద్ధౌషధంబో? యనన్. 25
- తే. రాజు తేజస్వియై గ్రహరాజుమీఁద
- నలిగి దాడిగ వెంటాడ, నిలువ కతఁడు
- బెగడువడి పాఱుచోఁ, జెఱఁ దగిలినట్టి
- ఛాయ యిది యన నీలలాంఛనము మెఱసె. 26
- తే. కలయ జగమునఁ గలయట్టి నలుపు లెల్లఁ
- దెలుపులుగఁ జేసి, నీడలు దెలుపు సేయఁ
- గా వశము గామిఁ, బొడము దుఃఖమునఁ బోలె
- సాంద్రచంద్రిక తుహినబాష్పములు గురిసె. 27
వ. మఱియు వికసితకైరవంబు లగు సరోవరంబుల నిజధవళధాళ ధళ్యంబున నాక్రమించి యందు నానందించు నరవిందమందిరకుం బుట్టినింటిసొబగు చూపి, చూపఱకు నిందుబింబం బిది గ్రహంబు లివి యను నంతరంబు లేకుండ నేకవర్ణంబు గావించి, సేవించు చకోరకదంబంబుల పుక్కిళ్ళకు వెక్కసంబై ముక్కులకు నెక్కి చిక్కంబడి, యొండొండ బొండుమల్లియల దందడిం దొరఁగు పుప్పొళ్ళ నుప్పతిల్లు నెత్తావులకు వెకలులై యాడుమొకరి తుమ్మెదలు రొదలు గల మెఱుఁగుడుంబురువులట్లు మిసమిసని మెఱవ ససిమెఱుంగు మొత్తంబుల నుమిసి యుమిసి, యందంద ప్రవహించు నిందూపల స్యందంబులకు విందు లగు నిందీవరమరందంబుల బెందడిం బడి బందనగొను వలిమించుక్రొమ్మంచుటౌదులీఁది యీఁది, వడిసడలి సుడివడుచు నొడలోము సోమరిగాలి యలవోక సోఁకులం గదలెం గదల వనం గదలునుపవన కదళి కేతకీ తాలహింతాల నారికేళపూగావళి కోమల పలాశద్రోణికల నునుపుగల పొరల యోరల శరధితరఁగల మీఁదనుంబోలె గిఱికొని, యెల్లవల్లికలుం బూవకఁపూచిన ట్టుల్లసిల్ల ఱెల్లుల్లసిల్లిన చందంబునం దెల్ల తెల్లనై, మొల్లమిగ నంతకంతకు దిగంతంబులు దంతంబులు దీరిచిన యిడుపులుంబోలెఁ దీండ్రింప రేయెండ దానగుటం జేసి యెండమావులం బుట్టించె ననం బట్టుగల పటికంపు రాచట్టు నేలల నెట్టుకొని, వెండియుం జిట్టకంబులకుం బెడమొగంబు వెట్టుకొని పట్టఁబట్టం బోవు ప్రాణభర్తల వెంటంబడి నూపురంబులు మొరయ వేనలులు విరియఁ గ్రమంబునంబుట్టు నిట్టూర్పు పవనంబు జవంబునం బైఁటకొం గెడలింప నందని కౌఁగిటం బొదివి ప్రియంబు చిలుకం బలికి ముద్దాడు జవరాండ్ర దంతచంద్రికల సాంద్రతం బంతంబు మెఱసి, మంతనంపువేళల మాటతబ్బిబ్బునం బుట్టు పొలయలుకలం దలలు వంచి రొద లేని నాలియేడ్పు లేడ్చు ప్రియల ననునయింప నింపునం జనవుమెఱసి చెక్కుటద్దంబులు నొక్కి మొగం బెగయ నెత్తి ముత్తియంపు ముంగఱ రంగునఁ గడలుకొను బుడిబుడి కన్నీటం బ్రతిఫలించి తుఱంగలించు తనదు నిగనిగలు గనుంగొని నగెనగె ననుచుం జుంబనం బిడం బోయి కెంగేల నదరంట వాటువడు కాముకుల వెల వెలపాటుకూటువం గోటికిం బడగలెత్తి, పిండి చల్లినగతిం గాయ డాయ లజ్జించి బుజ్జవంబునం బొదరిండ్లకుం దార్చి కాంతులం గవయ నంగనాచులగు నంగనల యంగంబుల పస ముంగిటంబడఁ జలిత కిసలయాంతరాళంబులం దూఱితూఱి యిరులు విరియించి, పతుల ప్రార్థనంబులం బుంభావ సురతాడంబరంబునకుఁ దోడు సూపి దూపటిలి యంగరాగంబులు గరంగం జెమర్చిన చంచలాక్షుల నిద్దంపుఁ దనూలతలం బుట్టి దట్టంబులగు చిఱుచెమట బొట్టులం బొడకట్టి తెలుపారు మలయజంపుఁ జిటులు గందంబుల యందంబు లొసంగి, సంజకడం దారు నొడివిన సంకేతంబుల నుండక తెరువు గట్టి పొరువుఁ దరువుల నీడల నడంగి నవ్వుటాలకు వెనుకపాటునం గదిసి ముసుంగు లెడలింప బెగడి కళవళంపుఁ జూపుల వల్లభులం జూచి యల్లన నగు నభిసారికల వెడందకన్నుల చెన్ను నన్ను కొని, పొదలు మదనోన్మాదంబునకుం బ్రోదిగా మోదంబునం గాదంబరి గండూషించి విటకదంబంబునకుం నొసంగు నంబురుహముఖుల యొప్పులకుప్పలగు నిప్పపూ మొగ్గలం బోని బుగ్గలం దగ్గలిక సూపు కమ్మ పంజుల వజ్రపుం జకచకల నకనకలు వీడుకొని, కలికితనంబులం గలసి మెలసి రతాంతంబునం బరిశ్రాంతి యడంగ నంగణంబుల నిలిచి యొండొరులకురులు దువ్వుచు విహరించు సమయంబునం బల్లవులు కేళి కల్లప్పుడన్న తమ మాటలు దలఁపించిన నుదరిపడి మందస్మితంబు లంకురించు హుంకృతుల జంకించి కంకణంబుల రత్నంపుఁ దళుకులు సెదర నుంకించి వైచు చేమంతిపూబంతులం బుటపుటనై, మిటమిటం గాయు దట్టంపుఁ బండు వెన్నెల మెండున బెండువడి డెందంబు గంది తాలిమి చిందువందై కెందలిరు పాన్పునం దను వొందక లేచి కూర్చుండి కన్నీరు గోట మీటుచు బోటితో వరూధిని యిట్లనియె. 28
వరూధినికిఁ జెలుల శైత్యోపచారములు
- ఉ. నోములు నోఁచినమ్మలు మనోరథముల్ దయివాఱ నిత్తఱిం
- దామరతంపరై ప్రియులుఁ దారు విహారము సల్ప, వీరిలో
- నీమెయి దుఃఖశీల నగునే వసియింపఁ దరంబె? పోద మా
- రామముఁ జూద నందు సుకరం బగు సర్వము నంబుజాననా! 29
- క. అని పలికి పాన్పు డిగి కా
- మిని చంద్రాతపము వేఁడిమికిఁ బైఁట చెఱం
- గున ముసుఁ గిడి నిజకేళీ
- వనిఁ జొచ్చి వియోగవహ్ని వడఁబడి తెగువన్. 30
- సీ. చనుఁగప్పు దొలఁగ వాసన గాలి కెదురేఁగుఁ, బరువొప్ప నలుఁగులఁ బాఱు కరణి
- నిడుదవేనలి నూనెముడి వీడఁ జిగురాకుఁ, బొదఁ దూఱుఁ గార్చిచ్చుఁ గదియు కరణిఁ
- బసిఁడిగాజులు పైకి వెసఁ ద్రోచి నునుఁదీఁగఁ, దెమలించు నురిత్రాడు నెమకు కరణి
- మొలనూలు బిగియించి వెలఁది వెన్నెలఁ జొచ్చుఁ, బిఱుదీయ కేటిలో నుఱుకు కరణి
- తే. జడియ దళులకుఁ, గురియు పుప్పొడుల మునుఁగు,
- మావి కడ నిల్చు, విరుల నెత్తావిఁ గ్రోలు,
- విషమసాయకు నేఁపుల విసివి విసివి
- తనువుఁ దొఱఁగంగఁ దలఁచి యవ్వనరుహాక్షి. 31
- క. అట్టియెడ నమ్మృగేక్షణఁ
- బట్టి సఖీజనము వెడఁగుఁబట్టీ! తగవే
- యిట్టి తెగు వనుచుఁ, జెక్కులఁ
- దొట్టిన కన్నీరు వోవఁ దుడుచుచుఁ బలికెన్. 32
- ఉ. పూఁతపసిండివంటి వలపున్ బచరించు కులంబు నీతికిన్
- లేఁత గదమ్మ యిత్తెఱఁగు? లేమ! సురాంగన లెల్ల నిట్టి నీ
- చేఁతకు మెత్తురమ్మ? దయసేయక తిన్నని మేను వెన్నెలన్
- వేఁతురటమ్మ? యింత కనువేఁదుఱు సెల్లునఁటమ్మ యింతికిన్? 33
- చ. ఉడుపతిబారికిన్ వెఱచి యూఱట యౌ నని పేరుటామనిన్
- ముడివడు కంతుసేనలకు ముయ్యెల గుట్టయినట్టి యిందు రా
- నడఁగునె తాపవహ్ని? మన మై హరితేక్షణ! ముల్లు పుచ్చి కొ
- ఱ్ఱడిచిన చంద మయ్యెఁ, బదమా యెలదోఁటఁ జరింప కింటికిన్! 34
చంద్రోపాలంభము
- క. అని యొడఁబడఁ బల్కుచుఁ దో
- డ్కొని వచ్చినఁ బాన్పుఁ జేరి గురుకుచ, తనపైఁ
- గనకనఁ గనలెడు వెలుఁగులఁ
- గనికర మఱి మండు చంద్రుఁ గని కర మలుకన్. 35
- క. ఓచెల్ల! విరహిణీవధ
- మే చతురత నీకు? దురితమే చేయు పనుల్
- రాచఱికపు ఫలమే? య
- య్యో చంద్ర! వివేక మెఱుఁగవొకొ గురుసేవన్? 36
- సీ. తొలుదొల్తఁ గమలమిత్రుని వంక రూపౌట, దక్షాధ్వరధ్వంసి తన్ను గనుటఁ
- బరివేషమిషమునఁ బాశంబు దాల్చుటఁ, గప్పు దేహమునందుఁ గానఁబడుటఁ,
- గాలవశంబునఁ గాని తోఁపక యుంట, సతతనిష్ఠురగదాన్వితతఁ గనుటఁ
- బూని పాండుక్షేత్రమునఁ బ్రవర్తించుటఁ, బ్రకటానురాగతారకుఁ డగుటను
- తే. నంతరం బెద్ది యాత్మలో నరసి చూడ
- రాజ! నీకును నల ధర్మరాజునకును?
- బ్రాణిలోకంబు బాధలఁ బఱుచునపుడు
- ధర్మపద మొక్కఁ డెక్కు డా ధన్యునందు. 37
- చ. ఒక పెనుబాఁపఱేడు చలమొప్ప రసాతలసీమకుం, జకో
- రకములు భూతధాత్రికి, సురల్ దివికిం బగదీఱునట్లుగా
- మెకమెకపాటుతోడ నిను మ్రింగక పో రెపుడుం, ద్రిలోకకం
- టకుఁడవు గాన, నీయొడలు నజ్జుగఁ జేసి కురంగలాంఛనా! 38
- క. వాతాపివలన నెఱిఁగితొ
- శీతకిరణ! కడుపుఁ జొచ్చి జీర్ణింపని యీ
- రీతి? నినుఁ దినియు నాయువు
- చేత సురల్ చెడరుగాక, చెఱుపవె వారిన్? 39
- తే. త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు
- బండికల్లుగ నీమేను గండి చేసె
- నదియు సెలవాఱి తెగటాఱవైతి చంద్ర!
- యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి. 40
- తే. పాలఁ బుట్టిన మాత్రాన మేలి గుణము
- నేఁడు నీకేల గల్గు నో నీరజారి!
- నీటఁ బుట్టిన వాఁడు గాఁడోటు వహ్ని?
- కాల్చుచున్నాఁడు జగమెల్లఁ గరుణలేక. 41
- క. గోవధము సేయు తురకల
- దైవంబవు నీవు మొదలఁ, దక్కక పాంథ
- స్త్రీవధము సేయ రోయుదె?
- నీవర్తన మేమిచెప్పు? నీరజవైరీ! 42
- క. విడువక తలపయిఁ గొన్నా
- ళ్ళిడి చూచి కళంకి వగుట యెఱిఁగి, మహేశుం
- డుడుకుచు దక్షాధ్వరమున
- నడుగునఁ బడవైచె దాన నడఁగవు చంద్రా! 43
- క. గాండీవము నీ చేతిది
- పాండవునిం జేరఁబట్టి బ్రతికితి మా వి
- ల్లుండిన నేఁడు నిశాచర!
- చెండవె యల్లునికిఁ దోడు శిత భల్లములన్? 44
మన్మథోపాలంభము
- వ. అని పలికి యక్కలికి తేనియ లొలుకు పూములుకుల జళుకుఁ
- బుట్టించు నించువిలుతు నుద్దేశించి. 45
- చ. తొడిఁబడఁ బాఱి పైకుఱికి ధూర్జటి కంటి కడిందిమంటలో
- నడపొడ గానరాక తెగటాఱియుఁ గాలినయట్టి మ్రోడు కై
- వడి, రతిలోచనాంబువుల వాన నిగిర్చితె పాంథబాధకై?
- మడియ కనంగ! యవ్వెలఁది మంగళసూత్రమహత్త్వ మెట్టిదో! 46
- శా. సాహంకారత శంకరుం డలిగి నేత్రాగ్నిం బయిం బంపినన్
- స్వాహాకాముకుఁడౌట ని న్నతఁడు గావం బోలు మోమోడి, సం
- దేహంబేని రతీశ! నీవు మగుడన్ దేహంబుతో నుండు టె
- ట్లాహా! దైవము దోసకారులకె తోడై వచ్చు నెప్పట్టునన్. 47
- చ. జడ నొక యింత లేని నెఱ చక్కఁదనంబుల నెల్లఁ గూర్పఁగాఁ
- బొడ వయినట్టి ధన్యుఁడవు భోగివి పూవిలుకాఁడ విట్టి నీ
- వెడపక నిష్ఠురత్వమున కెట్లలవాటుగఁ జేసి తక్కటా!
- పడఁతులమీఁద నేయ రతిపయ్యెదకున్ నను పైన చేతులన్. 48
మలయ పవనోపాలంభము
- తే. అనుచు నిందించి వలవంత యినుమడింప
- నవ్వరారోహ విదళిత హల్లకముల
- కమ్మపుప్పొడి పై దుమారమ్ము రేఁచు
- మలయ మంథర పవనుపై నలుక వొడమి. 49
- ఉ. అక్కట గంధవాహ! తగవా హరిణాంకునిఁ గూడి పాంథులం
- బొక్కఁగఁ జేయఁ? బావకుని పొం దొనరించి జగమ్ము లేర్చు నీ
- యక్కొఱగామి మాన, వది యట్టిద, చుల్కనివృత్తి దుర్జనుం
- డొక్కనిఁ జొచ్చి క్రిందపడు నొడ్లకుఁ గీ డొనరింపఁ గల్గినన్. 50
- క. నాలుకలు రెండు నిన్నుం
- గ్రోలనె కల్పించె నలువ ఘోరాహికి, న
- న్నాలి గ్రహ మిపుడుఁ దెగఁ దినఁ
- జాలద మృదుపవన! విరహి జన దురితమునన్. 51
- వ. అని పలికి యక్కలకంఠకంఠి దీపించు తాపంబు పెల్లున
- మూర్ఛిల్లినం, జూచి తోడిపల్లవోష్ఠు లల్లనల్లన హల్లకంబుల
- హిమాంబు పూరంబులం గర్పూరపటీర కర్దమాసారంబులం జెంగావుల
- మృణాలభంగంబుల నంగంబులకుం జలువ పుట్టింప నెట్టకేలకుం
- దెలిసె, నంతఁ బ్రభాత సమయం బగుటయు నొక్క పువ్వుఁ
- బోఁడి వరూధినితో నిట్లనియె. 52
సూర్యోదయ వర్ణనము
- ఉ. పాటన సేయమిం గురులు పైఁబడి శీర్ణపటీరపంక లా
- లాటికమై దరస్మిత విలాసపుఁజంద్రిక డొంకి వాడుటం
- దేటఁ దొఱంగి విన్న నగు నీ మొగమో! యన మాసి చంద్రుఁడో
- పాటలగంధి! వ్రాలె నదె భానురుచిం దన కందు మీఱఁగన్. 53
- సీ. సకుటుంబముగ వీఁగి చరమశైలముఁ జేరు, తుహినాంశు దుముదారుదొర యనంగ
- నాసీరమై వచ్చు నలినబాంధవు టెక్కి, యంబుపై దీపించు నద్ద మనఁగ
- నరుణాగ్ర నిబిడ వాద్యములలోఁ గనుపట్టు, సమయశాంఖికుచేతి శంఖ మనఁగ
- నినుఁ డప్పు డజుఁ డైట మునుమున్న పడివాగెఁ, గొనివచ్చు రాయంచ కొదమ యనఁగ
- తే. నుదయగిరిమీఁదఁ గోవురంబుండి నిగుడు
- నహిత రవిరశ్మిచే బద్ధుఁ డగుచుఁ దోడి
- బలఁగ మైనట్టి చుక్కల వలసత్రోవఁ
- జూప నేతెంచె నన వేగుఁ జుక్క వొడిచె. 54
- మ. సకలాశాగతి నర్మకోపవిరతి శ్రౌతక్రియారంభణా
- త్మక వర్గత్రయికిన్ మదుచ్చరిత శబ్దజ్ఞానమే మూల మిం
- తకుఁ బోలన్ వినుఁడంచుఁ దెల్పుగతిఁ, జెంతం గొండపై పల్లెలం
- గృకవాకుల్ మొరసెన్ గృహోపరిఁ ద్రిభంగిన్ భుగ్నకంఠధ్వనిన్. 55
- మ. ఇనుఁ డస్తాద్రికిఁ బోవఁ గొల్లకొని నేఁ డేతేరఁ దద్దీప్తినం
- జన సంబంధజ బాంధవంబున రతి శ్రాంతాంగనా నేత్రకో
- ణనికాయంబుల డాఁచి తద్ధవళిమం దాఁ బూనెనో చొప్పు మా
- ర్ప ననన్ వెల్వెలఁ బాఱె దీపకళికా వ్రాతంబు శాతోదరీ! 56
- శా. వాలారుం గొనగోళ్ల నీ వలసతన్ వాయించుచో, నాటకున్
- మేళంబైన విపంచి, నిన్న మొదలున్ నీ వంటమింజేసి యా
- యాలాపంబె యవేళఁ బల్కెడుఁ, బ్రభాతాయాత వాతాహ తా
- లోల త్తంత్రుల మేళవింపఁగదవే లోలాక్షి! దేశాక్షికిన్. 57
- చ. పలుకులు నేర్పు వేళఁ గలభాషిణి! నీ విటు లుండఁ బంజరం
- బుల నరగన్ను వెట్టి ముఖముల్ చరణాగ్ర నఖాళి గోఁకుచున్
- నిలుగుచు నావులింపుచు వనీవిహగోత్కర మెట్లు పల్కు, న
- ప్పలుకులె యఱ్ఱు లెత్తి విని పల్కెడు వింటివె? కీరశారికల్. 58
- మ. ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండ మ
- న్గరడిం గాలపుహొంతకాఁడు చరమాగస్కంధముం జేర్చు ని
- బ్బరపున్ సంగడమో! యనన్ శశి డిగెం బ్రాగ్భూమిభృత్కైతవే
- తరబాహాగ్రపుసంగడం బనఁగ, మార్తాండుండు దోఁచెన్ దివిన్. 59
- చ. కరకరి గూఁటఁ గఱ్ఱ యిడఁగా మొఱవెట్టెడులీల బాల భా
- స్కర కరకాండకందళ విఘట్టన నించుక వాయివిడ్డ తా
- మర మొఱ వెట్టి వెట్టి పలుమాఱును వాకిలి దాఁటి యాఁగుచున్
- మొరయ విపంచి మీటుగతి మ్రోసి యళుల్ వెడలెన్ గొలంకులన్. 60
- చ. అడరు నవీన భానుకిరణానల మంటినఁ గూడుకొన్న పు
- ప్పొడి కొలుచెల్ల మోచికొని పోయెడి సంభ్రమమొప్పఁ గంటివే?
- పడఁతి! భవద్విహారవనపద్మసరః కుముదాలయంబులన్
- వెడలు మిళిందబృందములు వీఁవు పిశంగిమ కైతవంబునన్. 61
- చ. కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁ గుత్తుకఁ గుత్తుకఁ జుట్టుఁ బాఱు చి
- ల్వలక్రియఁ గానరానిగతులన్ మయి మైఁ బెనఁచున్ జనించు న
- శ్రు లఱుత నొత్తు సోలు నిలుచున్ విధిచాతురిఁ గూడియున్ రతిం
- దలఁవవు కంటె పాసిన వెతల్ ద147లఁపించుచుఁ గోక దంపతుల్. 62
వరూధినికి సఖుల సమాశ్వాసనము
- ఉ. ఇందునిభాస్య! వాఁడనఁగ నింద్రుఁడొ? చంద్రుఁడొ? యా యుపేంద్రుఁడో?
- యిందులకై వగం బొగుల నేటికి? నేఁటికి నందుఁ బోదమా
- నందనభూమి భూమిసురనందనుఁ డుండకపోఁడు, రమ్ము నీ
- చందము నందము గనిన జవ్వని! యెవ్వని వెఱ్ఱిఁ జేయదే? 63
- ఉ. ఏల దురంతవేదన మెయిం బొరలాడెదు తాల్మి దక్కి? మే
- లే లలితాంగి? యెంత పని లె మ్మిది, విప్రవరుండు గోలయున్
- బాలుఁడు గాన నప్పటికిఁ బైఁ బడఁ గొంకెను గాని, వానికిన్
- గా లొకచోట నిల్చునె వగన్ మగుడన్ నినుఁ జూచునంతకున్? 64
- క. రార మ్మనుటయు, దివిష
- న్నారీరత్నంబు నికట నాకనాధునీ క
- ల్హారాంభోరుహ మధురస
- ధారా చంద్రకిత సలిల ధౌతాననయై. 65
- సీ. ఘనసార పంక మొక్క లతాంగి దెచ్చిన, ముట్టి వ్రేలనె చుక్క బొట్టు పెట్టి
- యింతి యొక్కతె పూవు టెత్తు లెత్తినఁ జూచి, విసువుతో నొకకొన్ని విరులు దుఱిమి
- పడఁతి యొక్కతె రత్నపాదుక లిడ నిల్చి, తొడుగ కవ్వలికిఁ బో నడుగు పెట్టి
- బాగాలు వెస నొక్క పద్మాక్షి యొసఁగిన, వెగ్గలం బని కొన్ని వెడల నుమిసి
- తే. సగము గొఱికిన యాకును, సఖులు పిలువ
- సగ మొసఁగు నుత్తరముఁ, దెల్వి సగము, మఱపు
- సగము నయి, చింతచే సగ మగుచు నరిగె
- నవ్వరూధిని యంతికోద్యానమునకు. 66
వ. ఆ సమయంబున దేవజాతిత్వ జనిత విమలజ్ఞానపాటవంబునం దద్వృత్తాంతంబు సమస్తంబు నెఱుంగుటంజేసి. 67
వరూధినీ కాముకుఁడైన గంధర్వుని మాయోపాయము
- శా. ఏ గంధర్వుఁడు తద్విలాసములు మున్నీక్షించి తా నెంతయున్
- రాగాంధుం డయి కోరి హత్తక గడున్ రారాపులం గంతుఁ డు
- ద్వేగం బందఁగఁ జేయ నెవ్వగల నువ్విళ్లూరుచున్ వేఁగుఁవాఁ,
- డా గంధర్వకుమారుఁ, డంగభవవిద్యాపారగుం డాత్మలోన్. 68
- ఉ. ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు, రొక్కవేళఁ బె
- న్మక్కువ నాదరింతురు, క్షణక్షణముల్ జవరాండ్రచిత్తముల్,
- పక్కున వేసఱన్ జన, దుపాయములన్ దగు నిచ్చకంబులన్
- జిక్కఁగఁజేసి డాసి, సతి చిత్తముఁ బట్టి సుఖింపఁగాఁ దగున్. 69
- క. అని తలఁచి యవ్విలాసిని
- యనిశముఁ గ్రీడించు పుష్పితారామంబున్
- మును కలుగఁ జొచ్చి యొక చం
- దనభూజము నీడ నిల్చి దంభం బమరన్. 70
- సీ. అర్ధచంద్రునితేట నవఘళించు లలాట, పట్టిఁ దీర్చిన గంగమట్టితోడఁ
- జెక్కుటద్దములందు జిగి వెల్లువలు చిందు, రమణీయ మణికుండలములతోడఁ
- బసిఁడివ్రాఁత చెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు, నరుణాంశు కోత్తరీయంబుతోడ
- సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు, బెడఁగారు నీర్కావి పింజెతోడ
- గీ. ధవళధవళము లగు జన్నిదములతోడఁ
- గాశికాముద్ర యిడిన యుంగరముతోడ
- శాంతరస మొల్కు బ్రహ్మతేజంబుతోడఁ
- బ్రవరుఁ డయ్యె వియచ్చర ప్రవరుఁ డపుడు. 71
వరూధిని సఖులతో నుద్యాన విహారము
- క. ఇట నవ్వరూధినియు నొ
- క్కొటఁ గతిపయసఖులు దన్నుఁగొలిచి నడువఁగాఁ
- జటుల ఝళంఝళరవ పద
- కటక సమాకృష్ట కేళి కలహంసిక యై. 72
- సీ. ఉరగఫూత్కార ధూమోగ్ర గంధముఁ బాసి, పొలయుఁబో యీతావి మలయపవనుఁ
- డనలాక్షు పెడబొబ్బ నలమిన తలదిమ్ముఁ, బాయుఁబో యీ తేంట్ల పాట మరుఁడు
- ఘర్మ సామీప్య సంకలిత దాహస్ఫూర్తి, నీఁగుఁబో యీ చల్ల్ నీట మధుఁడు
- గరళసౌదర్యాత్తకర సుధాకటుకత్వ, ముడుపుఁ బో యీ తేనె నోషధీశుఁ
- తే. డనఁగఁ జంపక కురవక పనసతినిశ
- నిచుల వంజుల దాడిమీ విచికిలామ్ర
- పాటలీ పూగ కేసర ప్రముఖతరుల
- సొబగు మీఱు నుద్యానంబుఁ జొచ్చి యచట. 73
- మ. పవమాన ప్లవమాన పంకజ రజః పాళీ పిశంగచ్ఛవీ
- భవ దభ్యర్ణ వికీర్ణకృత్రిమ సరిత్పాథస్తరంగాహతైం
- దవపాషాణవితర్దికాతలమునన్ నాళీకపత్త్రాక్షు లు
- త్సవ మొప్పన్ విహరించుచున్ సరస వాచా ప్రౌఢిమల్ మీరఁగన్. 74
- చ. బటువయి విఱ్ఱవీఁగి పరిపాటిగఁ బూచి పరాగపుంజ మొ
- క్కొటఁ గలయంగఁ బర్వఁ గొనకొమ్మను గోయిల మించనొప్పెఁ జెం
- గటి యెలమావి హారరుచి గందవొడిం గనుపట్టి నీలతా
- స్ఫుటతర చూచుకం బగుచుఁ బొల్చు వనేందిరగుబ్బ చన్ననన్. 75
- తే. వెలఁది యిచ్చట సంపెంగ విరులు గహన
- దేవతల యిండ్ల నెత్తిన దీపశిఖలు
- గాక యుండినఁ బంచబంగాళ మగుచుఁ
- బాఱునే మత్తమధుకర పటల తమము? 76
- చ. అపరిమితానురాగ సుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
- దపసిని గౌఁగిలించె వనితా? యిదె రంభ; దలంప రంభ దా
- నపరిమితానురాగసుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
- దపసిని గౌఁగిలించు టుచితంబె కదా! యన నవ్వె రంభయున్. 77
- ఆ. కొమ్మ! కన్నుఁగవకుఁ గోరగింపఁగఁ బూచి
- తఱుచు జొత్తు గ్రక్కు దాసనంబు
- గవియు నీతమాల గహనాంధకార వి
- తానమునకు నుదయభానుఁడయ్యె. 78
- తే. శ్యామ లోపరి నిబిడపత్త్రాభ్రములకుఁ
- గాండషండంబు దిగు వాన కాళ్ళు గాఁగఁ
- బంకరుహనేత్ర! వర్షర్తు శంక నొసఁగు
- పోఁకబోదియ నవకంబు మోకఁ గంటె? 79
- ఉ. చూతమె డాసి పస్వతర శుక్తిపుటాంతర దృశ్య మౌక్తిక
- వ్రాతములై వెలుంగు గరువంపుఁ గొటారుల నొప్పు తామ్రప
- ర్ణీతటమట్లు జీర్ణదళబృంద సమావృత పాండుర ప్రసూ
- నాతిమనోజ్ఞ మూలముల నర్థి నెసంగు మధూకసాలముల్. 80
- క. పంకజముఖి! విరహులపయిఁ
- గింకన్ నిజసైన్యకోటికిని సెలవిడు మీ
- నాంకుని కరతల మన నల
- కంకేళిం జిగురు గాలిఁ గదలెడుఁ గంటే! 81
- చ. నునుఁజిగురాకు మేయుతఱి నోరికెలంకులఁ దేఁటి గుట్టినన్
- వనతరు శాఖలం గువకువధ్వనిఁ బాఱు పికాంగనం బికం
- బనునయ మొప్పమాన్పు గతి నాత్మముఖంబు ముఖంబుఁ జేర్చి చుం
- బన మొనరించె, సందుసుడిమాయలుగా మగవారికృత్యముల్. 82
- క. అని పొగడుచు నొయ్యారపు
- టనువున జడ లల్లి జిలుఁగు లగు పయ్యెదలం
- జనుకట్లు గట్టి గట్టిగ
- ననిమిషకాంతలు లతాంగ హరణోత్సుకలై. 83
పుష్పాతిచయము
- రగడ. నేర్పుమై నల్లయది నెఱులఁ దొలుపూఁ దిఱిమె,
- దర్పకున కర్పింపఁ దలఁప దెంతటి పెరిమె?
- యింతి పావురపురొద యేల వినె? దారజము
- వింతయే? విరహిణుల వెతఁ బెట్టు బేరజము;
- సురపొన్న క్రొన్ననల్ సొచ్చి నలుగడ వెదకు
- తఱగ దందుల తావితండంబు క్రొవ్వెదకు;
- నఱిమి ననుఁ జివురునకు నగునె కంటక మాడఁ?
- జుఱుకు మనె వేఱొక్కచోటఁ గంటక మాడఁ?
- గుందములు నీ కొసఁగఁ, గూర్చితిని గైశికము
- నిందులకు వెల యడుగ నేల? విడు వైశికము!
- చిఱుఁదేంట్ల కొసఁగె గుజ్జెనఁగూళ్ళు గొజ్జంగ,
- యెఱుఁగ కది పూ వంద నేల? యిటు రజ్జంగ?
- నెదిరింపఁ బోలు నీ వింతి! రతిపతిఁ దెగడఁ
- బొదలఁ జిగురులు తుదలఁ బూచి యున్నది పొగడ;
- పుడుకు మల్లన గందవొడికి నీ ప్రేంకణము
- దడయ కిటు నీకిత్తుఁ దగ రత్నకంకణము;
- నెరసి పోఁ జూచెదవు నిలునిలువుమా, కనము,
- గురియు తేనెల జీబుకొన్న దంతట వనము;
- కా దల్లయది ఫుల్లకంకేళి, పన్నిదము,
- మోదు, గోడిన నీదు ముత్యాలజన్నిదము;
- ఏటవా లైనయది యీ యరఁటిబాలెంత,
- చేటునకె యగు, చూలుచేఁ గలుగు మే లెంత?
- నెలఁత! యీ గేదంగి నీకబ్బె బుక్కాము,
- చిలుకు నీ పుప్పొళ్ళు చెంచెతల బుక్కాము;
- మితిలేని తేనె నామెత చేసె విరవాది,
- యితరలతికల మరిగి యేఁగు నది పరవాది;
- కలిగొట్లు ప్రాఁకువేడ్కలె నీకుఁ దఱచెదను,
- నలినాక్షి! కడిమిగండమున కే వెఱచెదను;
- గురువెంద నదె గిలుబుకొనియెఁ బయ్యెరదొంగ,
- విరులఁ గరికుంభకుచ! వెరఁజు మై యరఁ గ్రుంగ;
- మెరమెరని కొలనిదరి మీలంచు లకుముకులు
- మరగె నీకనుదోయి, మాయింపు చకచకలు;
- ఏకాంతమని తొలఁగె దెందు నీవటె వేఱు?
- చేకొనవె మున్నాడి చెలువ! యీ వటివేరు;
- అరిది యీ యేడాకులరఁటి నగుకప్పురము
- సరిరాదు దాని కల శశియొడలు కప్పురము;
- పాళ కల్లది పోఁకఁ బ్రాఁక బందము దెగియె.
- నాళి యది దిగజాఱునట్టి చందము నగియె;
- మలయపవనుని బిలిచె మావి బళి! యీ వేళ
- మలయు కోవెల పంచమస్వరం బను నీల;
- సులభమై దొరకె మంజులవాణి! చంపకము,
- చిలువానెఁ బూఁబొదలు, చేరి యిఁక వంపకుము;
- చనకుఁ డిఁక దవ్వులకు సఖులార! పువ్వులకు
- ననుచు నలరులు గోసి రతివ లల్లన డాసి. 84
జలక్రీడలు
- క. నాళీక మధూన్మత్త మ
- రాళీ ముఖరాళి సుఖకరం బగు కొలనం
- గేళీలాలసగతి డిగి
- యాళీనివహంబు లోల లాడెడు వేళన్. 85
- ఉ. వాడిన మోముఁదమ్మి తెలివాలిక కన్నులు విన్నఁబోవఁ దో
- నాడక నెన్నొసల్ కరమునం దిడి తీరనిషణ్ణ యై జలం
- బాడఁగఁ బిల్చువారి నొక హస్తపు మ్రొక్కున నాడుఁ డంచుఁ దాఁ
- జూడక చూచుచూడ్కి నలజోటి దెసల్ పరికింప నొక్కచోన్. 86
- మాలిని. రవిరుచిఁ ద్రసరేణు వ్రాతముల్ మించు వాత్యా
- నివహనిహతిలో నిందిందిరశ్రేణు లాడన్
- గువలయ ఘనకుల్యాకూల వల్లీవనీ సం
- భవము లగుచు మింటన్ బర్వు పుప్పొళ్ళలోనన్. 87
మాయా ప్రవర దర్శనము
- సీ. పసిఁడితోరముతోడి బాహు వల్లన నెత్తి, సారెకుఁ బొదలపైఁ జాఁచి చాఁచి
- బింబాధరంబు గంపింప నొయ్యన విపం, చీ స్వరంబున జట సెప్పి చెప్పి
- దిశల మార్గాన్వేషి దీర్ఘలోచన దీప్తి, గణముచేఁ దోరణకట్టి కట్టి
- కమనీయ తనుకాంతి కనకద్రవంబున, నారామరంగంబు నలికి యలికి
- తే. యానితంబ విలంబి కాలాహికల్ప
- ఘనకచగ్రంథి నచటిభృంగముల కసిత
- దీధితులు వడ్డికొసఁగుచు దేవపూజ
- విరులు చిదిమెడి కపటభూసురునిఁ గనియె. 88
- ఉ. కాంచి కలక్వణ త్కనక కాంచికయై యెదు రేఁగి యప్పు డ
- క్కాంచన కేతకీకుసుమగాత్రి వయస్యల డించి తన్నికుం
- జాంచలవీథిఁ దాఱుచు ఘనాంత చల చ్చపలాకృతిం గలం
- గాంచిన వస్తువుం దెలిసి గాంచిన యట్లనురక్తిఁ గాంచుచున్. 89
- ఉ. ఆ కమలాక్షి యింపున దృగంచల మించుక మూసి హర్షబా
- ష్పాకుల కోణ శోణ రుచు లగ్రమునం జనఁ జూచు చూపు తీ
- రై కనుపట్టెఁ దమ్మరస మంటుకొనన్ వెడవింటివాఁడు క్రో
- ధైక ధురీణతం గఱచి యేసిన సింగిణి కోలయో! యనన్. 90
- సీ. తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచినప్పుడ, పల్లవాధరగుండె జల్లు మనియె
- నట రెండు మూఁడంజ లరుగునప్పుడ కాళ్ళఁ, బంకజాక్షికిఁ దొట్రుపాటు గదిరె
- డాయంగఁ జనునప్పుడ ముఖాంబుజంబునఁ, గంబుకంధరకు దైన్యంబు దోఁచెఁ
- గదిసి నిల్చిన యప్డ కనుదోయి ఱెప్పల, లలనకు మిగులఁ జంచలత బెరసెఁ
- తే. గటకటా! యనునపుడ గద్గదిక వొడమెఁ
- జెఱఁగు వట్టినయపుడ లేఁజెమట గ్రమ్మె
- సొలసి మాటాడ నుంకింపఁ దలఁచి మోముఁ
- దేరగొనిఁ జూచునపుడ కన్నీరు వొడమె. 91
వరూధినీ కపట ప్రవర సంభాషణము
- క. పాటిత కరిదంత ద్యుతి
- పాటచ్చర గండఫలక భాగంబులపైఁ
- గాటుక కన్నీ రొలుకఁగ
- మాత వెడలఁ గ్రేటుకొనుచు మానిని పలికెన్. 92
- ఉ. ఏలర! యీ చలం బుడిగి యేలర! బాల రసాల మాలతీ
- జాలములో శశాంక కరజాలములో వలవంత నశ్రువుల్
- జాలుగ నాల్గుజాలు నిఁకఁజాలు భవం బమనంత కాఁకకున్
- బా లయి రాత్రి పంచశరు బారికిఁ జిక్కితి, నీకు దక్కితిన్. 93
- శా. రా, వైరాగ్యముఁ బూని నీవు కడు నిర్దాక్షిణ్య చిత్తంబునన్
- రావై తేఁ జవి గాని యిందులకు హోరాహోరిగాఁ బోరి యే
- లా వాలాయము సేయఁగా? బ్రదుకు నీ వాచారవంతుండవై
- చావో యెక్కుడొ నీ యెడం బొడము వాంఛన్ భూసురగ్రామణీ! 94
- క. కట్టిఁడితనమున కి ట్లొడి
- గట్టి మనసు ఱాయి సేసి కరఁగవు మఱి నీ
- పట్టినది విడువ విఁక ని
- న్నిట్టట్టన నేల మా యదృష్టం బుండన్? 95
వ. అనిన నక్కుహనా భూసురుండు. 96
- సీ. కొనసాఁగి కామినీ గోష్ఠిఁ బ్రౌఢములైన, యుదుటుఁజూపుల ఱెప్ప తుదల నాఁచి
- సంతసంబున ముఖాబ్జమునందుఁ జిఱునవ్వు, కందళింపక యుండ డిందుపఱచి
- పొంగారు మైఁ దోఁచు శృంగారచేష్టల, తమిఁ దెచ్చికోలు మౌగ్ధ్యమున డాఁచి
- పొడము రసావేశమున వచ్చు నర్మోక్తు, లొదవి నాలుకకు రాకుండఁ గ్రుక్కి
- తే. మస్తకము వాంచి యుసు రని మౌనముద్ర
- నేల బొటవ్రేల వ్రాయుచు నిలిచి కొంత
- సేపు వెడవెడ చింతించి శిర సొకింత
- యెత్తి సన్నంపు టెలుఁగుతో నిట్టు లనియె. 97
- శా. తల్లిం దండ్రియు నన్నుఁ గానని మనస్తాపంబునన్ బొక్కఁగా
- నిల్లా లార్తిఁ గృశింపఁగా సవన వహ్నిశ్రేణి చల్లారఁగా
- నిల్లున్ శూన్యత నొంది సొంపు చెడఁగా, నిచ్చోట నేఁ జిక్కి యో
- ఫుల్లాంభోరుహనేత్ర! యే సుఖమతిన్ భోగించెదన్ఁ జెప్పవే! 98
- ఉ. ఓ సరసీరుహాక్షి! వినవో రతిఁ గౌఁగిట నీవు చేర్చు నిం
- పా సురభర్తకైనఁ గలదా? వలదంచుఁ బెనంగ నేను స
- న్న్యాసినెఁ యొక్కటే తహతహన్ మన సొగ్గదు కేళిపై "ననా
- శ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్య" మన న్నెఱుంగవే? 99
- క. ఐనం గానిమ్ము భవ
- ద్దీనతకై వ్రతము విడిచితిం, బరులకు మే
- లైనం జాలు, శరీరం
- బైన నుపేక్షింపవలయు, నది యట్లుండెన్. 100
- క. తివురక యిం కొక్కటి విను
- కవయునెడన్ వలయుఁ గన్నుఁగవయును మూయన్
- భువి నిది యస్మద్దేశ
- వ్యవహారము; కన్ను దెఱువ నఘ మగుఁ దెఱవా! 101
- శా. ఈ మర్యాదకు నీ వొడంబడిన మే లీ భంగి గాదేని
- భూమింజేరఁగ నెట్లు నీ యొడలితోఁ బోవంగ లేనే కదా!
- యీ మందాకిని పొంత నీ మునులతో నీ వృక్షవాటంబులో
- భామా! యేఁ దపమాచరింతు విధి కబ్రహ్మణ్యమున్ బెట్టుచున్. 102
- తే. ఇంక నొక్కటి వినుము పూర్ణేందువదన!
- వ్రతము చెడ సౌఖ్యమైనను వలయుఁ గలుగ,
- వాంఛితము దీర నను నీవు వదలఁ జెల్ల
- దేను నిను సమ్మతిలఁ జేసి యేఁగు దనుక. 103
వ. ఇంత యేమిటి కంటేనిం జెప్పెద, నేను వైదేశికుండ, బంధుమిత్ర కళత్రంబులం బాసి దైవయోగంబున నింత దూరం బేఁగుదెంచినవాఁడ, మీఁద భవదర్థంబు ప్రార్థితుండనై వ్రతహోమాద్యనుష్ఠానంబులు విడువంగలవాఁడ నగుటం జేసి యంతరంగంబునఁ గలతెఱంగు తేటపడం బలుకవలసె నాకర్ణింపుము. 104
- ఉ. నీ చనుదోయి సంకుమద నిర్భరవాసన మేన నూన న
- య్యో! చిరసౌఖ్యముల్ గనుట యొండెఁ, దపంబొనరించి పాపముల్
- రాచుట యొండెఁగా, కిహపరంబుల కూరక దూరమై వయః
- శ్రీ చన, రెంటికిన్ జెడిన రేవఁడ నౌదునె? నీరజేక్షణా! 105
- క. అని యాస గలుగఁ బలికిన
- విని వేలుపు వెలఁది మోము వికసిల్లంగాఁ
- దనచేతి చెఱఁగు బిగియం
- బెనఁచుచుఁ దల వాంచి నగవు బెరయఁగఁ బలికెన్. 106
- శా. హా! నీ నిష్టురవృత్తి మాని కరుణైకాయత్తచిత్తంబునన్
- మానం జాల నటంచు నేఁడు శ్రవణానందంబుగాఁ బల్కుటన్
- సూనాస్త్రున్ వెలవెట్ట కేలితి సుఖార్ణోరాశిలోఁ గ్రుంకితిన్
- నా నోముల్ ఫలియించె నా వయసు ధన్యంబయ్యె విప్రోత్తమా! 107
వ. నీ వెట్లు చెప్పి తట్లు సేయంగలదానినని యతనినొడంబఱుచు సమయంబునఁ దోడి నెచ్చెలు లచ్చకోరాక్షిం గూడుకొని. 108
- సీ. అకట! నిర్దయబుద్ధి వని దూఱెఁ గడు రంభ, యాహా! వివేకి వౌ దనియె హరిణి
- చేఁదు మ్రింగెద వంచుఁ జికిలి నవ్వె ఘృతాచి, మాయలాఁడని తిట్టె మంజుఘోష
- న్యాయనిష్ఠురములఁ బ్రార్థించె నూర్వశి, జంకించె ర మ్మంచుఁ జంద్రరేఖ
- చెలి నేఁచి తని దిసంతులు కొట్టె మేనక, విడువు మాయ లటంచు నొడిమె హేమ
- తే. గొంట వనియెఁ దిలోత్తమ, గూర్మిఁ గొసరె
- ధాన్యమాలిని, పుంజికస్థల యదల్చె
- దివిజకామిను లీరీతిఁ దిరుగువాఱి
- గువ్వకోల్గొంచుఁ దమలోన నవ్వుకొంచు. 109
- క. ఆ కుహనాభూసురుఁ డపు
- డా కాంతల సరస సమ్మదాలాపములన్
- గైకొనుచు ముదితహృదయుం
- డై కేళీవనము వెడలి యరిగి కుఱఁగటన్. 110
లతా గృహాంతర సమాగమము
- సీ. మృగనాభినికరంపు బుగబుగల్ గలచోటఁ, జదలేటి తుంపురుల్ చెదరుచోట
- వకుళవాటీ గంధవహుఁడు పైకొనుచోటఁ, గర్పూరతరు ధూళి గప్పుచోటఁ
- బసమీఱు సెలయేఱు లిసుక వెట్టినచోటఁ, జిగురుమావుల సంజ నిగుడుచోట
- నవమాలికల తేనె నట్లుట్టి పడుచోట, మాణిక్యదీపముల్ మలయుచోటఁ
- తే. బ్రమదమునఁ దేఁటు లెలుఁగెట్టి పాడుచోట
- శారిక లనంగశాస్త్రముల్ చదువుచోటఁ
- గీర కలకంఠములు క్రొవ్వి కేరుచోటఁ
- బావురము లారజంబులు పలుకుచోట. 111
- తే. ఆ వరూధిని మణిమండితాలయంబుఁ
- గాంచి యనురాగమునఁ బ్రవేశించినంత
- వారి నిరువురఁ గూర్చి యవ్వనజగంధు
- లాత్మగృహముల కేఁగి రనంతరంబ. 112
- క. ఫుల్ల లవలీనవైలా
- వల్లిమతల్లికలతోడ వాసంతిక లు
- ద్యల్లీల నల్లిబిల్లిగ
- నల్లికొనిన యొక లతాగృహాంతరసీమన్. 113
- క. ఆ గంధర్వకుమారుఁడు
- నా గజగమనయుఁ బ్రఫుల్ల హల్లకతల్పా
- భోగంబున రహి మిగులఁగ
- భోగింపఁదొడంగి రాత్మఁ బొంగెడు కాంక్షన్. 114
వ. ఆ సమయంబున, 115
- సీ. సహసా నఖంపచ స్తన దత్త పరిరంభ, మామూల పరిచుంబితాధరోష్ఠ
- మతిశయప్రేమ కల్పిత దంత సంబాధ, మగణితగ్లాని శయ్యానిపాత
- మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట, మతిదీన వాక్సూచితాత్మవిరహ
- మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ, మానంద కృతహారవాననాబ్జ
- తే. మాక్రమక్షీణ నుతివర్ణ మానిమీలి
- తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట
- మాస్తిమిత భూషణారవ మావధూటి
- ప్రథమసురతంబు గంధర్వ పతిఁ గరంచె. 116
- క. అన్నునఁ గనుమూయుట రొద
- సన్నగిల్లుటఁ గౌఁగిలింత సడలుట నేర్పుల్
- సు న్నగుట వరూధిని రతి
- కన్నెఱికపు రతియుఁ బోలెఁ గడు నింపొసఁగెన్. 117
వరూధినియందు దౌహృద లక్షణములు దోఁచుట
- క. ఈ విధమున నయ్యిరువురు
- భావజతంత్రైకపరత బహుకాలము సౌ
- ఖ్యావహ లీలల నుండం
- గా వేలుపుముద్దరాలు గర్భముఁ దాల్చెన్. 118
- క. నడ జడనువడియె, నా రే
- ర్పడియెన్, జనుమొనలు నల్లవడియెన్, వడియన్
- బడియెఁ గడు నొడలు, పడఁతికి
- బడలికయును నిదుర యరుచి బహుళం బయ్యెన్. 119
- మ. పలుచంబాఱుఁటఁ గోమలస్మితరుచుల్ పైఁదోఁచె నా గౌరకాం
- తుల గండద్వితయంబు పొల్చెఁ, బ్రమదార్ణోరాశి ఖేల న్నవో
- త్కలికాభంగ పరంపరోపరి సముద్యత్పాండుడిండీర పం
- క్తులు నాఁ జిట్టుము లుల్లసిల్లెఁ దఱుచై తోడ్తోఁ గురంగాక్షికిన్. 120
- తే. నాకజలజాక్షి నిఱుపేద నడుము బలిసి
- యల్ల నల్లన వళిసీమ నాక్రమించెఁ
- బేర్చి దివసక్రమంబున బీద బలిసి
- బందికాఁ డైనఁ బొరువులు బ్రదుకు గనునె? 121
- క. పాటల సుగంధి పాటలు
- నాటలు లే కప్పు డొప్పె నలతఁ బథికో
- త్పాటన జయ పరిశాంత
- జ్యాటంకృతి చలన మదన చాపముఁ బోలెన్. 122
- సీ. మనసు కక్కుఱితి మెల్లన లేచి చేతులఁ, గాంతుని జబ్బుగాఁ గౌఁగిలించు
- నలసత మృద్గంధియైన కమ్మని నోర, నధరంబు నెడనెడ నాని కూర్కు
- మణితాది పవన ధారణశక్తి చాలమి, నొయ్యన నర్మోక్తి నుబ్బొనర్చుఁ
- గాంక్షిత క్రీడ కంగము పంపు సేయమి, నొడుగా నిట్టూర్పు లొలయఁ బొగలు
- తే. నిచ్చ యెఱిఁగిన రతికేళి మెచ్చి పొగడు
- నప్పు డక్కాంత రతి పరిహాసవేళ
- జీవితేశు సమేళింపుఁ జేఁత లుడుపుఁ
- బ్రార్థనాపూర్వ దీనసంభాషణముల. 123
గంధర్వుఁడు కల్లబొల్లి మాటలు సెప్పి చనుట
- క. అంత వియచ్చరుఁ డభిమత
- మంతయు సమకూఱుటయును, నచ్చర గర్భ
- శ్రాంత యగుటయును, గనుఁగొని
- యింతట నిచ్చోటు వాయ కేనిఁకనున్నన్. 124
- క. వంచన యెఱిఁగిన మఱి శపి
- యించునొ సురకాంత, చెప్ప కేఁగినఁ బ్రేమం
- బంచశర శరపరంపరఁ
- బంచత ప్రాపించి మీఁదఁ బాపం బిడునో! 125
వ. అని వితర్కించి యక్కపటవిప్రుఁ డెఱింగించి యనిపించుకొనియ పోవువాఁడై యప్పుడప్పువ్వుఁ బోఁడి డాయం బోయి బుజ్జనంబొప్ప నిట్లనియె. 126
- తే. ఎవ్వఁడే బాదలేప మొక్కింత నాదు
- పాదములఁ బూయ నింతేసి పనులు పుట్టె
- నమ్మహాయోగి బహుయోజనాధ్వగామి
- యీ గిరికి నేఁగుదెంచె నేఁ డేఁగి కంటి. 127
- క. అతఁడు మఱి తీర్థయాత్రా
- వ్రతవశమున వచ్చి మాపురంబు తెరువుగాఁ
- గతలుగ మా సంసార
- స్థితు లెల్లను జెప్పె, నేమి సెప్పుదు? నబలా! 128
- సీ. పై పరామరిక చొప్పడమిఁ బక్వము దప్పి, పండఁబాఱిన పొల మెండఁబాఱెఁ
- గట్టఁ గాపింప దక్షత లేమి నూరూర, బందెలఁ బడిపోయెఁ బశుగణంబు
- వంచనామతిఁ బ్రాడ్వివాకులై వటువు లొ, జ్జల కొప్పగించిరి చదువు లెల్లఁ
- గికురించి రిచ్చి పుచ్చుకొను చోటులవార, లాఁకకు లోనుగా కప్పు లీక
- తే. గ్రహణ సంక్రమణాదుల రాచనగరఁ
- గాసు వీసంబు వెడలమి గ్రాసమునకు
- నాధి వెట్టిరి క్షేత్రంబు లందుఁ గొన్ని
- లెస్స యుండునె గృహకర్త లేనిబ్రతుకు? 129
- క. అది గా కేనిట వచ్చిన
- యది మొదలుగఁ జింతచే నహర్నిశమును నా
- కెదురెదురె చూచు చిద్దఱు
- ముదుసళ్ళును బుత్త్ర మోహమున నగునార్తిన్. 130
- క. తడి కంట నెపుడుఁ దఱుఁగక
- కడి దఱుఁగఁగ వడియుఁ దఱిఁగి గాసిన్ బుడమిన్
- బడిన గనరాక మంచపుఁ
- దొడుగఱ లైరట్టె రుజలతో నే మందున్! 131
- క. కావున వారలఁ జూడం
- గా వేగమ చనఁగవలయుఁ గమలదళాక్షీ!
- నీ వెఱుఁగని ధర్మాధ
- ర్మావస్థితి గలదె? దీనికై యడలకుమీ! 132
- క. వఁడి గాఁచి కాఁచి యుండం
- గడవలనీ రినుము ద్రావు కైవడిఁ బైపైఁ
- బొడమెడు కోర్కులచేఁ బె
- ల్లుడికిన మది భోగముక్తి కూఱట గనునే? 133
- ఉ. కావున నెన్నడున్ దెగని కాంక్ష నెపం బొకఁ డెన్ని రోసి నేఁ
- బోవఁ దలంతు నేని వలపున్ ననుపున్ దగవున్ బ్రియంబునున్
- నీవలనన్ సమగ్రములు నిల్చిన సంపెఁగ పువ్వుఁదేనె క్రొ
- త్తావికిఁ దేఁటి చిక్కిన విధంబునఁ జిక్కనె? లోలలోచనా! 134
- ఉ. ఎవ్వఁడు మీఁ దెఱుంగక యథేచ్చ సుఖైక రతిం జరింపఁగా
- నవ్వల వంశహాని వ్రతహాని యశోధనహాని పుట్టుఁ దా
- నవ్వెడఁ గమ్మనుష్యపశు వయ్యవివేకి చెడున్ జగంబునన్
- నవ్వఁగఁ బాలు రౌరవమునం బడఁ బాలును నిందపాలునై. 135
- మ. అనినం జిత్తము జల్లనన్ సొరుగు నయ్యంభోజపత్రాక్షిలో
- చనగోళంబులఁ జిమ్మలై చిలుపలై జాలై తరంగంబులై
- చనుదోయిం గొనబౌ కురంగమద చర్చల్ జాఱిపో నొక్క యొ
- డ్డున బాష్పాంబుఝరంబు లుప్పతిలెఁ బోటుంబాటుగా నెంతయున్. 136
- క. అత్తఱి గంధర్వవిభుం
- డత్తామరసాక్షి వదన మక్కునఁ గృపతో
- నొత్తి మొగమెత్తి యశ్రులు
- మెత్తనఁ గొనగోరఁ బాఱ మీటుచుఁ బలికెన్. 137
- శా. ధీరస్వాంతవు వంత నీకుఁ దగునే? దివ్యాంగనల్ కోవిదల్
- గారే? యోగవియోగముల్ సతములే? కర్తవ్యముల్ సేయరే?
- పోరే రారె ప్రియంబు గల్గినజనుల్? పోరామి పోఁ బోవునే?
- పో రాకుండఁగ నేమి కాళ్ళు దెగెనే? ఫుల్లాంబుజాతేక్షణా! 138
- తే. మూలముట్టుగఁ దెల్పె నమ్మునివరుండు
- ప్రార్థితుం డయి నాకు నప్పరమ విద్య
- వచ్చుచును బోవు చుండెద వదల నిన్ను
- శుకకలాలాప! నమ్ము ద్రిశుద్ధిగ నను. 139
- గీ. అని వరూధిని నూరార్చి యచటు వాసి
- పోయెఁ దనయిచ్చ గంధర్వ పుంగవుండు
- తప్పరాదు ఋణానుబంధంబు తెగినఁ
- బ్రాణపదమైన వలపును బాసి చనదె! 140
వ. అనుటయున్ దరువాతి వృత్తాంతంబు గృపాయత్తం బగుచిత్తం బున నానతీయ వలయు నని యడుగుటయును. 141
ఆశ్వాసాంత పద్య గద్యములు
- శా. హిందూరాజ్య రమాధురంధర భుజాహిగ్రామణీ కంచుక
- త్కుందస్వహ్ఛ యశోగుళుచ్ఛ! యవన క్షోణీధవ స్థాపనా
- మందీభూత కృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
- బందీగ్రాహ విగాహితోతరక కుబ్ధాటీ సమాటీకనా! 142
- క. తిరుమల దేవీ చరణో
- దరలాక్షాకల్ప కల్పిత స్థల కమల
- స్ఫుర దిందీవర బంధుర
- హరిహయమణి మలయకూట హర్మ్యవిహారీ! 143
- ఉత్సాహ(సుగంధి). వర్ణనీయకీర్తివైభవా! ప్రభూతభూతిదృ
- క్కర్ణకుండలా! వితీర్ణి కర్ణ! దీర్ణహృద్భ్రమ
- ద్దుర్ణయారిమానహారి దుర్భరానకార్భటీ
- ఘూర్ణమాన కొండపల్లి కొండవీడుమండలా! 144
గద్యము.ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవర పురవంశోత్తంస శఠకోప తాపస ప్రసాదాసాదితచతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా మాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతం బైన స్వారోచిష మను సంభవం బను మహా ప్రబంధంబునందుఁ తృతీయాశ్వాసము.
చతుర్థాశ్వాసము
- . శ్రీ కృష్ణరాయ! గుణ ర
- త్నాకల్ప! కల్పకద్రుమాధిక దాన
- శ్రీకుతుకాగత లోకా
- లోకాంతర సకల సుకవి లోక స్తుత్యా! 1
వ. అవధరింపుము. జైమిని మునీంద్రునకుఁ బతంగపుంగవంబు లిట్లనియె. 2
వరూధిని పుత్రవతి యగుట
- సీ. మున్ను విప్రాకారమునఁ గూడుచో శంకఁ, గనుమూయఁ బనిచె నా ఖచరభర్త
- యవ్వరారోహయు నాసక్త గావున, నిచ్చలో నటు సేయ నియ్యకొనియె
- నా ప్రతిజ్ఞాపూర్తి యయ్యెఁ దనంత న, వ్వనితకు రతిపారవశ్యపటిమ
- నపుడు తత్ప్రవర దేహ సమిద్ధ శిఖ దీప్తి, శాంబరీ మహిమచే సంగ్రహించి
- తే. నట్టి గంధర్వమూర్తి సౌఖ్యానుభూతిఁ
- జలన మేదిన మానసాబ్జమున నిలువ
- వెలసెఁ దేజోమయం బైన వృద్ధి నట్టి
- మేటిగర్భంబు నెలలు తొమ్మిదియు నిండె. 3
వ. అనంతరంబ యొకానొక పుణ్య దివసంబున. 4
- శా. తేజం బబ్జభవాండగేహమునకున్ దీపాంకురచ్ఛాయయై
- రాజిల్లన్ గ్రహపంచకంబు రవిఁ జేరంబోని లగ్నంబునన్
- రాజీవాక్షి కుమారుఁ గాంచె సుమనోరాజన్యమాన్యున్ జనుల్
- జేజేవెట్టఁ బ్రసూనవర్ష మమరశ్రేణుల్ ప్రవర్షింపఁగన్. 5
- క. స్వరుచిస్ఫురణను శశిభా
- స్కర పావక తారకాప్రకాశము లెల్లన్
- విరళములు సేయ నతనికి
- స్వరోచి యనునామ మిడి రచటి మును లెల్లన్. 6
మౌనుల యొద్దికలో స్వరోచి పెరుఁగుట
- చ. మఱియు నతండు సంయమి సమాజ వినిర్మిత జాతకర్ముఁడై
- నెఱిఁ బరివర్ధితుండు నుపనీతుఁడునై వివిధాయుధంబులన్
- గఱకరియై రణస్థలుల గద్దఱియై నిగమార్థవేదియై
- నెఱతనకాఁడునై మెఱసె నిర్మల కాంతి విలాస రేఖలన్. 7
- స్రగ్ధర. గ్రుద్దున్ గోత్రాచలంబుల్ గులగుల లయి పో గోతముల్ గ్రుద్దులీలన్
- ఖద్దిన్ జెండాడు మ్రాఁకుల్ కవుఁగిటికొలఁదుల్ కత్తి నొక్కొక్క ఘాతన్
- బ్రోద్దామప్రౌఢి వాతాద్భుతగతిఁ బఱచున్ భూమి జవ్వాడఁగా ని
- ట్లద్దేవీ నందనుం డత్యనుపమ బలుఁడై యౌవనారంభవేళన్. 8
- క. వేదండము తొండము సరి
- కోదండముఁ దివియు నెడమఁ గుడి నిబిడజ్యా
- నాదము రోదసి నిండఁగ
- భేదించున్ గండశిలలఁ బృథుబాణములన్. 9
స్వరోచి యాటవికుల కేలిక యగుట
- క. అతఁడు మఱి తనకు మంథ
- క్షితిభృత్తటి విశ్వకర్మ చేసిన నగరిన్
- వితతాటవిక చమూ సే
- వితుఁడై సామ్రాజ్య మనుభవింప నొకతఱిన్. 10
- క. కరకా చిటపట రవ భీ
- కరమై పెళపెళ నినాద ఘనమై ఝంఝా
- మరు దుజ్ఘిత బిల మంద్ర
- స్వరమై యక్కొండ నొక్క వర్షము గురిసెన్. 11
- క. తెలతెల వేగిన నగ్గిరి
- జలజలఁ బ్రవహించు సెలల చప్పుళ్ళు శిఖా
- వల కుల కల కేకా కల
- కలములు గల తలపొలంబుఁ గనుఁగొనువేడ్కన్. 12
- ఆ. అన్నగాగ్ర మెక్కి యం దొక్క శశికాంత
- వేదిఁ గతిపయాప్త వేష్టితుండుఁ
- గుటజ విపిన పవన నట దలకభరుండు
- నగుచుఁ బ్రొద్దు జరుపు నవసరమున. 13
ఎఱుకు ఱేని మొఱ
- ఆ. ఒక్క యెఱుకుఱేఁడు నక్కకొమ్మును నిఱ్ఱి
- గోఱజంబు జున్నుఁ జాఱపప్పు
- బీలిగఱుల యంపకోలలు సెలవిండ్లుఁ
- గానుకిచ్చి కరయుగంబు మొగిచి. 14
వ. యుగ విగమ సమయ సముద్భూత జీమూత పటలంబునుం బోలెఁ గైలాసగిరినితంబ ప్రాంత కాంతారపర్యంతంబు నిరంతరంబై కాఱుకొన్న యొక్క గహనరేఖం గరాంగుళిం జూపి భూపతి కి ట్లనియె. 15
- క. అల్లదె కంటే? పొనపొన
- దెల్లని గట్టఱుత మబ్బుతేఱెడి పొలమం
- దెల్లెడఁ జూచిన ధరణీ
- వల్లభ! సీరాముసేన వాలుమెకంబుల్. 16
- సీ. కండూతికై రాయుఁ గర్కశం బగుతుంటిఁ, బీఁటవెట్టిన మ్రాను పెల్లగిల్లఁ
- జెవి దార్చి విను చీమ చిటుకన్న నొకసారి, సెలవి వెంపరలాడుఁ జిట్టలెల్లఁ
- జప్పరించు వెదుళ్ళు సట లుబ్బ దంష్ట్రాంగ్ని, చొంగపైఁ బడి చుంయి చుంయి మనఁగఁ
- జండ్రనిప్పులువోలెఁ దీండ్రించు కనుమించు, లెసఁగ నొండొంటిపై నెక్కఁబాఱు
- తే. వెట్టదినముల మడుఁగుల మట్టి కలఁప
- బుడబుడధ్వనివెడలు బుద్బుదములందుఁ
- జిలుపచిలుపని నేతుల జిడ్డు దేఱు
- నేమి చెప్పుదుఁ? గ్రొవ్విన యేకలములు. 17
- చ. బల మిఁక నేమి చెప్ప? విను పండువెదుళ్ళవలీల మోరత్రో
- పులఁ బడఁ జొప్ప వంచుకొమ పోలిక వంచి తదగ్రధాన్యముల్
- సెలవుల ఫేన ముట్టిపడ జిట్టలతోడనె చప్పరించు న
- ప్పొలము వరాహపోతములు భూవర! తొండము లేని యేనుఁగుల్. 18
- క. పొడిచిన కైదువునకుఁ జము
- రిడఁగా వల దగ్గికాఁక యించుక యిడినన్
- జెడుగఱ్ఱల గ్రుచ్చిన నం
- జుడు మంటలఁ దగిలి నెయ్యి జొటజొట వడియున్. 19
- తే. వలదు కుక్కల విడువంగ వలవ దేయ,
- నడచి మొలపిడియమ్మునఁ బొడువవచ్చుఁ
- బంకము గొరిజ దిగఁబడఁ బఱవలేవు
- మన్ను లివ్వేళ రేగటి మన్నులందు. 20
- క. పొడ చెదరి బోద చఱచిన
- యొడళ్ళతో నాల్గు రెండు నొకటియుఁ బ్రంగల్
- వెడలిన కొమ్ముల బరువున
- నడుగిడఁగా లేవు బలిసి యందలి దుప్పుల్. 21
- ఆ. చలము లొదవ ముళ్ళు గల మ్రాఁకుదీములఁ
- గెరలి తాఁకి కొమ్ము లురులఁ దగిలి
- వాని లేవ నీడ్చి కానకే కొనిపోవుఁ
- బోతరించి యిఱ్ఱిపోతు లచట. 22
- ఆ. కప్పువెట్టి వెన్ను కందమ్ము సమముగాఁ
- బొదలి జోళ్ళు గట్టి పోరుచుండి
- మలయుఁ గాని పోవు మానిసిఁ బొడగన్న
- నేమి చెప్ప? వాని యీసు లధిప! 23
- క. కట్టియఁ జేకొని డేగం
- బట్టి యుబుసుపోకఁ బొలము మట్టినఁ జాలున్
- దొట్టిన క్రొవ్వులు గలయవి
- చె ట్టడిచినఁ జేటెఁ డేమి చెప్పన్ బులుఁగుల్? 24
- తే. ఉడుము గరిమిడికొక్కు దందడియు వెల్ల
- యెలుక కల్లెల్క తఱుచును నేమి చెప్ప?
- నడవి నెల్లెడఁ జూచిన నవనినాథ!
- జల్లెడయుఁ బోలె లాఁగల నుల్లసిల్లు. 25
స్వరోచి మృగయా విహారము
- క. అనుటయు మృగయాకౌతుక
- మునఁ జిత్తము చెంగలింప భూధర శృంగం
- బుననుండి డిగ్గి నగరికి
- ననిమిషకాంతాకుమారుఁ డరిగి రయమునన్. 26
వ. నగరు సొచ్చి యచ్చటం గక్ష్యాంతరశాలాంతరాళంబుల నందంద తండతండంబులై వ్రేలునత్తెంబులం జము రంటు పలల ఖండంబుల మండితంబు లగు నిడుద వెదురుదండెంబుల బర్హి బర్హ నిబద్ధాగ్రంబులై కొమరారు దోరెపుఁద్రాళ్ళతోడం దిరుగుడుల వెడంగుపడి వడిదప్పునట్లు త్రాళ్ళం గట్టువడి పొట్ట లదరంగ నిక్కి పరిసెనంబుల వేయునవియును, నపహసితశార్దూలకుటిల నఖ కోటి పాటవంబులగు త్రోటిపుటంబులం జటకసరటాదిజంతు కళేబరంబులం జరణనఖరాంకురంబుల నిఱికి చీరుచుం గేరునవి యును, నాఁడునాఁటికిం బాటించి వేఁటకాం డ్రదనెఱింగి మేపు మేపుల చమత్కారంబుల నిరాకరించి వీఁకునం దిరిగి తిరిగి యీఁక దీర్చుకొనునవియును, బద నగ్గలించి కూయుచుం గడుపు నకనకంబడం గనుకట్టుతోడ మోములు మలంచుచుం బంజరస్థిత కీర శారికా పారావతాదుల పలుకు లాకర్ణించి యెగసి యెగసి నిజావస్థితతాదృగ్విధాధార వేణుయష్టులకుఁ జట్టుపలు చెదరం బ్రదక్షిణభ్రమణంబులఁ బరిభ్రమించి మగుడ నెట్టకేలకు మట్టు కొనునవియును, మేర మీఱం దిన్నయెరల నన్నుకొని యరగన్ను వెట్టి బోరకడం బొటమరింపం గూరుకుచుం గుతికిలంబడునవి యును నై పరఁగు పలుదెఱంగుల డేగమొత్తంబులను, గుత్తంబు లగుమిగులమెత్తని జలపోఁతతోలు పట్టెడలు మెడల నమరం బనుపార్చి కట్టుఁగంబంబులకుం దార్చి బంధించిన కుందనంపు గొలుసులు గల్లు గల్లు మనంగ నొడళ్లు జాడించికొనుచుం గొన సాగి సోగలై ముంగిసమోరలుంబోని మోరలు సారెసారెకు నెత్తి బయలు పసివట్టుచుఁ గట్టెదుటి వాజిశాలలం గట్టిన పొట్టేళ్ళకై యాదిగొని నీల్గి కాలుద్రవ్వి ఘనఘనాఘన ఘర్ఘర ధ్వాన సమ ధ్వనులు చెలంగ మ్రోఁగుచు నింగిఁ బ్రాఁకుచు నింగలంబు లుమియు నయనగోళంబుల నాభీలంబులై వివృతవదన గహ్వర విలంబి జిహ్వాపల్లవంబులకుం గ్రూరతర దంతకోణ కాంతికలాపంబులం గోరక స్తబక యోగంబు గల్పించుచు నల్పే తరగ్రస్త కీలాలపలలజాలగ్రాసంబులు నెన్నడుము సన్నఁదనంబున నట మిగుల డిగ్గి చన కునికిం గటితటంబులకంటెం దారె పుట పుట నయ్యె ననం దోరంబు లగుబోరలఁ గందంబుల నందం బులు గని బిరుదు లంకించి తమ్ము నుపలాలించు పరిపాలకుల సంస్తవంబులకుం జెవిదార్చె ననం గర్ణకిసలయంబులు వ్రాలం బడి వెండి గుండులుంబోలెఁ గన్నులపండువులై గండభైరవ పూజవారువంబు లన మెండుకొనియుండు జాగిలంబులను గాంచి యందునందును వేఁటకు నుఱవైనవాని నేర్పఱించి తెచ్చు టకు ననుచరుల నీవు నీ వని నియమించి తానును నాఖేటకోచిత పరిపాటి సన్నద్ధుం డయ్యె, నయ్యవసరంబున. 27
- సీ. పచ్చని హురుమంజి పనివాగె పక్కెర, పారసిపల్లంబు పట్టమయము
- రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి, తళుకు లకోరీల తరకసంబు
- మహి పసిండి పరుంజు మొహదా కెలంకున, ఠావు గుజ్జరిసేఁత కేవడంబు
- డాకెలంకున సిరాజీకరాచురకత్తి, కుఱఁగటఁ గ్రొవ్వాఁడి గొరకల పొది
- తే. పీలికుంచె తలాటంబుఁ బేరజంబు
- మణుల మొగముట్టు వన్ని సాహిణి యొకండు
- కర్త యెదుటికిఁ గొనివచ్చె గంధవాహ
- బాంధవంబగు నొక మహా సైంధవంబు. 28
- క. తెచ్చుటయు నిచ్చ మెచ్చి మ
- రుచ్చటుల కురంగ రయ నిరోధి స్యద గ
- ర్వోచ్చం బగు నత్తేజి సు
- హృచ్చక్రం బలర వేగ నెక్కి వెడలినన్. 29
- చ. జడలు మలంచి చొళ్ళెముగ సన్నపుఁ బాగ లడంగఁ జుట్టి చ
- ల్లడములు పూని మీఁదఁ బదిలంబుగఁ గట్టిన మట్టికాసెలం
- బిడియము లంట దోపి పృథు భీషణబాహుల సాళువంబుల
- న్దడవి కెరల్చుచుం జనిరి నాథునిమ్రోల నృపాలనందనుల్. 30
- సీ. ఇవి కంఠపాశంబు లింత డుస్సిన మీఁదఁ, బడి దిశాకరినైన గెడపఁ జాలు
- నివి మింటఁ బఱచు పక్షీంద్రుఁ జూపిన నీడ, బడి వాలునందాఁకఁ బఱవఁ జాలు
- నివి గాలి గనిన మూకవరాహదనుజేంద్రు, నైన జుట్టెంటిలో నాఁగఁ జాలు
- నివి కాటు కొల్పిన వృద్ధకూర్మమువీఁపుఁ, జిప్పైన నెఱచికై చింపఁ జాలు
- తే. ననఁగ ఘర్ఘర గళగర్త జనిత భూరి
- భూభృదురుబిల భరిత భౌభౌ భయంక
- రార్భటీ దీర్ణ దిగ్భిత్తు లగుచుఁ జెలఁగె
- సరిపెణలఁ బట్టి తెచ్చిన జాగిలములు. 31
- చ. పులియఁడు బూచిగాఁ డసురపోతులరా జనుమంతిగాఁడు చెం
- గలువ సివంగి భైరవుఁడు గత్తెర సంపఁగి వెండిగుండు మ
- ల్లెలగుది వాయువేగి చిటిలింగఁడు సాళ్వఁడు వత్సనాభి యే
- కలములమిత్తి గబ్బి యనఁగా గలవాని గ్రహించి యుద్ధతిన్. 32
- ఉ. కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లును విండ్లగౌసెనల్
- చుట్టి నొసళ్ళపై నిడిన జుంజుఱుఁబల్లసిగల్ కటీతటిం
- బెట్టిన మోటకత్తులును మేనులఁ గార్కొనుకప్పు లేర్చి చేఁ
- బట్టిన వేఁటయమ్ములును బాగగు వాగురికుల్ మహాధ్వనిన్. 33
- సీ. సట లెత్తుకొని యొత్తు కిటినైన మోటాస, పడి యేయఁ బొడుతు నీ పాద మాన
- కలగుండు వడఁ జెండు కరినైనఁ జెవిపట్టి, బలిమిమైఁ దెత్తు నీ పాద మాన
- సెల నెప్పుకొని రొప్పు పులినైనఁ బీడించి, పడవైతుఁ జొచ్చి నీ పాద మాన
- తెరఁదూఱి వెఱఁబాఱు గురుపోతుపై నైనఁ, బడియెక్కి పొడుతు నీ పాద మాన
- తే. యితర దుర్బల మృగపంక్తు లేమి లెక్క?
- కండగరువంపు మాటలు గావు సుమ్ము
- చూడు మ మ్మని పంతంబు లాడుకొనుచు
- నవ్వరూధినిసుతుఁ గొల్చు యరిగి రపుడు. 34
- ఆ. మువ్వ గదల నత్తెములనుండి యెగురుచుఁ
- బదను మీఱ నెరల వెదకు డేగ
- పదువు వట్టి దండపాణులై నడచిరి
- విభునిగెడల డేగ వేఁటకాండ్రు. 35
- ఆ. గూనివీఁపు లదర గొణఁగి తిట్టుచు నేకుఁ
- గఱచినట్టి కుక్క గండ్లనంగ
- మూతి నరపమీసముల బోయ ముదుసళ్లు
- పంది వలలు మోచి పఱచి రపుడు. 36
వ. ఇట్లరిగి యమ్మహారణ్యంబు సొచ్చి విచ్చలవిడి నచ్చటం బచ్చిక బయళ్ళ మచ్చిక లచ్చుపడం దటిచ్చటులం బగు లోచన ప్రభా పటలంబు దిక్తటంబులం బర్వఁ దాఱుమాఱుపడ నిడికొనిన మొగంబులతో నేణీజిహ్వాపల్లవోల్లిహ్యమానాంగంబు లగు సారంగంబుల ఖురళికారంగంబు లనం గనుపట్టు చెలికపట్టు లును, బిట్టెసంగు నాఁకటం దట్టువడి పొట్టకై పుట్ట కూటికిం జీమలకుం జెదలునకు నెలుంగులు గులగులం బుట్టలు నిశిత నిజ నఖర కులిశ కోటులం గోరాడ నాదండలఁ గాచుకొని యుండి వెడలి చను విషవిస్ఫురద్భుజంగంబుల నల్గడం గబళించి గెంటకుండ దంటు చప్పరించు గతిం జప్పరించుచు నొండొంటికిం బేరెంబులు వాఱి కుప్పించి తప్పించుకొను దుప్పుల ఖురజ రజశ్ఛటల నెసక మెసంగు మసకమసకల మఱుంగుపడియుండు గండోపలంబులును, బరిహసిత సితేతర పాషాణపాటవంబు లగు విషాణపరిఘంబు లొండొంటిం దాఁకి కఠిల్లు పెఠిల్లు మనం బోరు కారుపోతుల కోలాహలంబులం బ్రతిశబ్దంబు లీను కోనలును, మదమొదవ నెదపదనునం బొదలు పెట్టలకుం జుట్టంబులై చిల్లర సలుగులం బిల్లలం జుల్లరంబుల సాగనిచ్చి గమికి వెనుకయై మలయుచుం బిఱుందం దిరుగు చిఱు గున్నలకు వెన్నాడు తోడేళ్ళ సివంగులం దిరిగి తిరిగి మొత్తి పోనొత్తి చరియించి నేకచరంబుల ఘుర్ఘురధ్వానంబుల ఘూర్ణ మానంబు లగు పరిగె పక్కె పలుమేరు రేఁగు వేము పులుగుడు గురివెంద యీఁదు గేదంగి మోదు గౌరు కోరింద కనుము కానుగు మొదలగు పొదలం బొడు వగు నానా విపిన పాదప కలాపంబు లును, మాటిమాటికి మానిసికాటు మరగి తెరువులు గాచికాచి డగ్గుత్తిక పడం దిను పెద్ద పొలవలనం బుటపుటనై త్రుప్పుళ్లు డుల్లి త్రుళ్లి గంతులిడు గబ్బి బెబ్బులుల నలఁగుడుల దొడ్లజనంబులు మంత్రించి పొరక దిగిచిన నీరు మే పుడిగి గిరులు గ్రక్కదల వాపోవుచుం దిరిగి తిరిగి వాకట్టు విడిచినప్పుడు దప్పికై పాఱి సెలయేటిటెంకులం బాఱమ్ములు ఱొమ్ము కెలంకులంగాఁడ గాండ్రు గాండ్రు మని రొప్పి నొప్పి కుప్పరంబుగా వియత్తలంబునకు విల్లెత్తుపొడ వెగసి నెత్తురులు గ్రక్కుచుఁ గూలు క్రోల్పులుల ఘర్ఘరధ్వనుల గుండియ లవిసి కలగుండు వడు కారండవంబుల పక్షపుట పటాత్కారంబుల బోరుకలంగు సెలయేటి టెంకులును, మేఁతవెంబడిం బొలము పల్లంబులం దిరిగి తిరిగి పెంట్రికలు వెట్టు పెంటపట్టునకు వచ్చి యచ్చట గ్రుచ్చి కానరాకుండ మునుమున్న మృగయుండు బిసయొడ్డి సంఘటించిన కాలి బోనులం బడి బెగడక యద్దారు వీడ్చుకొని యీరములఁ దఱి యంబడి యవ్వలికై వెడలి చనలేక గెడసి తన్నుకొను మన్ను మెకంబుల యాక్రందనంబులం గ్రందుకొను విషమ ప్రదేశంబులును, జిఱుత గండ్లగమిచేత దైవికంబున డాప్రక్క మీఁదు వడ దాఁటువడి యవి గొంతుక్రొన్నెత్తురులె క్రోలి విడిచి చన మార్మెడలు వడి మశకవనదంశమ్ములు మూఁగ మాఁగంబాఱిన కొండగొఱియ ముఱుగుడు బొందులకు సందడించు కంకగృధ్రా వళుల మొల్లంబుల ముసుంగువడు పల్లంబులును, మేయుతఱి వీఁ పెక్కి ఱేఁ చొకటి మూఁపురంబు గఱచి కరచి యెఱచి పడ వైవం దోడి యొక రెండు మూఁడు వెనుకముందఱ నందంద కాళ్ళం బెనంగుచు నత్తునుక లేచి యేఱి తినఁ గాలెడలిన యెడ మండుతద్వేదనకుం గాక మట్ట లెత్తుకొని యొత్తుగల పొదరుటడవులు చొఱంబాఱు పిడికడితి కదుపు నురవడికి విఱిగి పడిన విటపి విటపంబులం దడుకు వొడిచినగతి నొందు నెడలును, బదులుపదులు నూఱులు నూఱులు వేలువేలు గుములుగట్టి దట్టం బగు నెయ్యంబున వెదురుబియ్యంబు లొండొంటి కొసంగఁ గరి వరకరేణువులు వంప ముంపుచెడి యిట్టట్టువడి తిట్టలగు జిట్టల సంకటంబు లగు డొంకల నీక్షించి హర్షించి, యెక్కుడుఁ దమి నొక్కయెడ నడుగు వెడలనిటెంకిఁ గని వాఱుగవులునకు మెకము దిగ దని యెన్ని; మన్ను దూర్పెత్తించి గాలి పరికించి దిగువ దెస దొడ్డివల పన్ని యెగువ పొలిమేర బారాది యగు దూరం బేఁగఁ బోఁగువాఱించి యత్త్రాట వల మోవం దెర లెత్తి యెత్తిన నత్తెరఁ దుత్తుమురుగాఁ జించుకొని పాఱినం బోనీక బారిసమరుటకు వలచుట్టునుం జెట్టు దండగొని నిలువ నలువుగల పుళిందులఁ గొందఱ నిలిపి, యమ్మంది పిఱుంద జాగిలంబుల తోడ వాగురికుల నిలువ నియమించి తెరకు లోనగువాని నందుఁ బడంగొట్టించియు గట్టువెంట దట్టంబుగాఁ బ్రజ నెక్కించి మఱి కలయ గహనతలంబున నెల్లం బెల్లుగా విల్లువేఁటకు నేటుదప్పని మేటివిలుకాండ్ర మృగములు వెలువడుటకు హరిచ్ఛదచ్ఛటా వృతశిరఃకటిధనుష్కోటులై కొట్టికానిం జూపెట్టుకొని యెదురు మాటులు గాకుండ నుండి చెదరి పొరదెరువులం బఱవకుండ నీరముల సందుసందులం దమతమకట్టిన మోటకత్తుల నొండొండ ఖండితంబు లగు మండగల కంపమండలు ద్రోచి మునుములం గనుమ లొనరించుకొనం బంచి, తాను నొక్కొక్కయెడఁ బాద చారియు, నొక్కొక్కయెడఁ దురగాధిరూఢుండును నై యెల్లెడల మెలంగుచుం గూఁత లెగయఁ బణవ మృదంగ దుందుభి ప్రముఖ తూర్యంబులు గొట్టించియు గాహళులు పట్టించియు నగ్నియంత్రములు ముట్టించియు రొద మిన్ను ముట్టం జోపు వెట్టించిన. 37
- మ. చకితై ణాహుతిదాన మావళితపుచ్ఛ స్వల్ప గచ్ఛత్తర
- క్షుక మద్రిగ్రహయాళుభల్లుకము వక్షోభాగ నిక్షిప్త డిం
- భక వల్గత్ప్లవగీకదంబము హ్రదాంభః ప్రోత్థిత క్రోడనా
- యక మాభీల ముఖద్విపిస్థపుటితం బయ్యెన్ వనం బత్తఱిన్. 38
- క. నెల వెడలియు నెఱి సడలియుఁ
- జల ముడిగియు నిదుర సెడియు జంట లెడసియున్
- గలహము లడఁగియుఁ బఱచెం
- బులి కిరి కరి మన్ను దున్న మొదలగు మెకముల్. 39
- ఉ. అత్తఱి వేఁపికాండ్రు యమునాంబుతరంగ పరంపరాకృతిన్
- ముత్తర మైన సూకరసముత్కరముం గని మోటుకాండ్రు వి
- ల్లెత్తకమున్న రాజుమది కెక్కెడునట్లుగ దీని మిత్తికిం
- బుత్త మతంచుఁ బట్టెడలు బోరన డుయ్య భయంకరార్భటిన్. 40
- క. జాగిలములు మొఱసడములుఁ
- జాగెఁ గలసి చాపముక్త శరగతి, నం దా
- జాగిలము లెదిరెఁ బందుల
- కై, గోథాదికము గాలి కడరె నితరముల్. 41
- సీ. ఎగుచుకూఁతలు ముట్టె యెత్తి బి ట్టాలించి, గమికిఁ గన్నాకయి గాలి యరయు
- వడిఁ గుక్క లంటంగ వచ్చిన మెడ ద్రిప్పి, ఘుర్ఘురించుచు బయల్ కొమ్ముఁ జిమ్ముఁ
- దారసించిన చోట దారునఁ జొరఁ బాఱి, యొకటి రెంటిని దొబ్బ లురల నడుచుఁ
- బాలచేరులు వట్టి తూలింప బలిమి నీ, డ్చుకొని డొంకలఁ దూఱి చుట్లఁ బెట్టు
- తే. నీఁటె పోటులఁ బడి ప్రేవు లీఁదులాడఁ
- బోయి పోలేక దగ దొట్టి పొదలు సొచ్చి
- బెండువడియును జొఱనీదు పీఁటవెట్టి
- చూపులనె యేర్చుఁ బ్రజ నొక్క సూకరంబు. 42
- క. అట్టియెడ నొక వరాహము
- బిట్టడిచిన మెఱసెఁ గుక్క ప్రేవులు దంష్ట్రం
- జుట్టుకొని రొంపిఁ గలఁపఁగ
- నిట్టలముగఁ దగిలినట్టి యెఱ్ఱలు వోలెన్. 43
- మ. హరిణం బొక్కటి కుక్కతండముఁ బుళిందానీకముం ద్రోచి యు
- ర్వర్ అఁ గా లూఁదక దాఁట నేటలవికిన్ వాహంబు నడ్డంబు నూఁ
- కి రసావల్లభుఁ డేసె భల్లమును నింగిం గాళ్ళు జోడించుచో
- గొరిజల్ నాలుఁగుఁ ద్రెవ్వ సేన వొగడెం గోదండ పాండిత్యమున్. 44
- క. పఱచు నొక కడితిఁ బతి ముకుఁ
- జెఱమలకై యేయఁ జిప్ప చినుఁగఁగ నది యు
- క్కఱఁ గాఁడి డుస్సి పాఱిన
- నఱిముఱిఁ జాపరువు వాఱి యల్లటు వడియెన్. 45
- మ. గవిలో బెబ్బులి డాఁగి గ్రుడ్లు మెఱమంగాఁ గాంచి రా జేసె నే
- య వడిన్ బాణము వెంటనే నిగిడి పైక ట్లేచి రా నేసె రెం
- డవకాండబుఁ దదస్త్రముం గొనక డాయన్ వచ్చి కౌక్షేయక
- ప్రవిభిన్నం బయి నేలఁ గూలెఁ బవిధారాభిన్న శైలాకృతిన్. 46
- తే. క్రొవ్వి నడగొండ కైవడి గునుకు నొక్క
- యొంటిగాని మహీనాథుఁ డొదిఁగి యేయ
- గొరక మే నుచ్చి ధరఁ గాఁడ శిరము విసరె
- లే దసృక్పాన మనుచుఁ దెల్పెడు ననంగ. 47
- తే. ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాఁచి
- న ట్టరిగి టెంకిఁ గని వీఁకఁ బట్టుటయును
- మృగయు లందఱుఁ జని వెల్వరించి నిశిత
- కాండములఁ జెండి రొక పెద్ద కారుపోతు. 48
- ఉ. ఆ సమయంబునం జకితమై మెక మెవ్వని మీఁదఁ బాఱె వాఁ
- డేసినయమ్ము వమ్మయి మహిం బడ కొక్కటి కొండ చాలి వీ
- తాసులఁ జేయ మెచ్చి వసుధాధిపముఖ్యుఁడు మోట్ల నున్న బా
- ణాసనభృత్పుళిందులకు నర్థి నొసంగె నభీప్సితార్థముల్ఁ. 49
- క. వలఁ బాఱినవానిని భటు
- లలుఁగుల పాలాడి, రధిపు కై పట్టిరి బె
- బ్బులి మహిష మెలుఁగు కిటి దోఁ
- డెలు మొదలగువానిఁ గొన్నిటిని వేఁటకరుల్. 50
- తే. మున్ను జాగిలములఁ గూడి చన్నయట్టి
- యుడుపకుక్కలు కుందేళ్ళ నుందురువుల
- నుడుముల గ్రహింపఁ బుట్టల కడలఁ బొదల
- గిరుల చరియలఁ బసివట్టి తిరుగుచోట. 51
- చ. బరవస మొప్పఁ గాలితడఁబాటు మెయిం గవిఁదూఱి యొక్కకు
- ర్కురము తమంబులో వెరఁజి కోఱలచేఁ గబళించి పొట్టపెం
- జెర నుడు మంచుఁ దెచ్చి కని చేవ దొఱంగక ద్రుంచివైచెఁ ద
- ద్గురుబిరుద ప్రమాదములకుం బతి మోదవిషాదశాలి గాన్. 52
- క. ఒడ లుబ్బ నిక్కి ముందఱి
- యడుగులు ధర నూఁది చిందు నలబలములకున్
- జడియ కొక గబ్బిగం డె
- క్కుడుఁగడిమిం దివిచెఁ గ్రుంగి కొమ్ములయుడుమున్. 53
- తే. కంపతొడు గీడ్చిన ట్లేఁదు గానఁ జన్న
- తెరు వెఱుంగుచు నొకఁ డేఁగి పరువుతోన
- పడి యడఁగి యుండఁగాఁ బటపటన ముండ్లు
- గాలిఁ గదలుట గని పంట్రకోలఁ బొడిచె. 54
వ. అత్తఱిం దత్తఱంబున మొత్తంబయి చోపుడుఁగోలలు గొని కెలంకుల పొలంబులం బులుఁగులం జోపుచు డేగవేఁటకాండ్రు వేఱుపడి వేఁటాడం దొడంగి రందు. 55
- ఉ. లీలఁ బుళిందుఁ డొక్కఁడు కళిందసుతోర్మి సరోజినీదళాం
- దోళిత కోకరేఖఁ దనతోరపు నల్లని దీర్ఘ బాహుపై
- హాలహలంబపోలె విడి యత్తెమునం దల యెత్తి చూచు బల్
- సాళువమున్ వడిం జను శశంబుపయిన్ విడిచెన్ మహోద్ధతిన్. 56
- క. మొలదట్టిచెఱఁగుఁ జెక్కుచు
- బలుదిట్ట కిరాతుఁ డొకఁడు పటు వగుముష్టిన్
- సెలకట్టెఁ బట్టి వేఱొక
- సెలకట్టెం గొట్టి వైచెఁ జెమరుంగాకిన్. 57
- సీ. పెనుదవ్వు దగ దొట్టఁ జని రెట్ట వడఁ గొట్టె, నుడువీథి బెళగువ్వ నొక్క యణుజు
- ఱెక్కతాఁకున స్రుక్క నిక్కి ప్రక్కలు నొక్కె, నుఱక కల్లేటి నొక్కోరణంబు
- పొదఁ దూఱు నొకమేటి పూరేటి వెలికిఁ బోఁ, దోలి కైకొనె నొక్క తోఁచిగాఁడు
- తను నేలుదొర చిత్తమున మెచ్చఁ దీతువుఁ, జని పట్టె బి ట్టొక్క జాలెడేగ
- తే. విజ్జువిజ్జునఁ దన్నంగ విడువ కెలమిఁ
- గఱకుటంఘ్రుల నిఱికించి గజ్జె గదలఁ
- గఱికి నెఱినెఱి కోలెమ్ముకయును విఱుగ
- విఱిచె వడిఁ గైజు నొక పెద్ద వేసడంబు. 58
- క. నింగికయి కుంచెయెత్తి వె
- సం గో! యని యార్వఁ బక్ష సంహతిగాడ్పుల్
- ఱింగని మ్రోయఁ గుజాగ్రపుఁ
- గొంగల నొక లగుడు డిగ్గి కొట్టె నిలఁబడన్. 59
వ. ఇ ట్లాఖేటఖేలనంబున వివిధ మృగ విహగ వధం బాచరించి చాలించి, యంచెలంచెలం బంచతాపతిత చమర సృమర కిరి హరిణ రురు మహిష వృషదంశక గోధికా శశ పిశిత ఖండంబు లొండొండ యువ్వెత్తుగా నాకుఁబొత్తరలం గట్టియు గుదులు గుట్టియుఁ జిక్కంబుల నించియుఁ గావడుల నుంచియు సవరించి, దిగదిగన విసరి బగబగన మండు చిదుఁగు సొదమంటల కడ్డంబు వట్టి, మీసంబులు సూఁడిచూఁడి వాఁడులగు కత్తులం దిత్తులొలిచి కుత్తుకలు గోసి శితముఖంబులగు నఖంబులం బెకలించి విపుల వపు రపహసిత మహాశైలంబు లగు శార్దూలంబుల బొందుల నందంద పడవైచి, యంతంతఁ గాంతారంబున దంతురంబుగాఁ బడిన దంతావళంబుల దంతంబులు గైకొనియుఁ దత్కుంభ నిర్గత మౌక్తికంబు లేఱికొనియు, గోఱజంబుం జమరవాలంబుల బర్హిబర్హంబులం బరిగ్రహించియు మరలి, యత్తఱిఁ గడింది నెత్తురుం బ్రొద్దగుట వెఱచఱవం జఱవ నేఁదు పెనుముండ్లఁ బండ్ల సరియలు నెఱియలువాఱి బోరనం గాఱు ధారాళ రుధిరా సారపూరంబు నాకి నాకి నాలుకలు దిగవైచి యేచిన మహాతపోష్ణంబునం దృష్ణ వొడమి దగ నిగుడ వగ రడరి యొడలం దొడలను మెడలను బెడిదంపు నిడుదకోఱల సలుగు లడిచినయెడలం బొడబొడను వెడలెడు నుడుకునెత్తుటన్ బడలి తూలుకౌలేయ కమ్ముల యంగమ్ము లార్ద్రకర్పటంబులం గప్పి, దప్పి నిగుడ నప్పొలంబు పశ్చిమపు దండ నుండు వెండికొండ బండలఁ జండకర కర హిండనంబునం బాండుప్రభలు నిండి పఱచు తఱచు సెలయేఱుల సూరెలంగాఱుకొను భూరుహ నికాయంబుల డాయం జని తద్ఘనచ్ఛాయల నిలిచి, యచ్చటంగ్రొచ్చి గరువు నేలల గుంట లొనరించి లోన నుమ్మగిలి గబ్బు వలవక కమ్మ తావులు గల నావురాకులు పఱచి యెఱచిలో మే లేఱి కారిజముం గందనకాయ క్రొవ్వు మొదలగు మిగుల మెత్తని పలలభిత్తంబు లందుఁ గ్రందుకొనం గ్రుక్కి, యెక్కువ తక్కువలు గాకుండఁ గండ గలతింత్రిణీ శలాటు సంఘాతంబు లామీఁద నెఱయం బచరించి, యెసరుగాఁ దేట లగు వేఁడినల్లలు గుమ్మరించి, లవణ కణ సంచయంబు నించి, లావుగాఁ గావు గప్పి, యుపరి ప్రదేశంబులఁ గారెనుపపెంటపట్ల నీరాఱు నేఱుఁ బిడుకల దాళ్ళిడి, నెల్లికొయ్యలు ద్రచ్చి నుచ్చు లంటించినం బెచ్చుపెరుఁగు చిచ్చులా త్రంపులం దవిలించి, చిముడ నుడికిన వెలువరించి, యుప్పు వెప్పునుం గల యప్పిశితఖండంబులు గనగనని నిప్పులం జమురు చిప్పిలం గాల్చిన కమ్మకఱకుట్లం జట్రాతిపయిఁ గాట్రేనికిం గుడుపువెట్టి, పిదపఁ బాళ్ళవెంబడిం బంచుకొని తారు నుపయోగించి, తద్దేవతా ప్రీతికై తలలుఁ దోఁకలు డొక్కలు నచటి విటపి విటపంబుల వ్రేలం గట్టి, శిశిర మధుర సలిలమ్ములు ద్రావి వాగురికులు విశ్రమింప, నిలింపాంగనాసుతుండును సహ సమాగత చతుర వలల కృత పలల ఫల మూలాది శుచిమధుర మృగయోచితా హారంబులం దృప్తి వహించి పరిజనారచిత పల్లవాసనా సీనుండై గండూషితపుండరీక మధు రసాసారంబు లగు నిర్ఝరా నిలకిశోరంబు లొలయ నలయికలు దేఱియున్న సమయంబున. 60
అపశకునములు - శుభశకునములు
- మత్త కోకిల. నిండెఁ గావిరి దిక్తటంబుల నింగిఁ గుండలి చండరు
- ఙ్మండలిం గనుఁగొంచు మ్రోసెను మాలకాకులమూఁక ల
- య్యండ నిల్చి యదల్చె నప్డు శివాళి యూళలఁ బద్మగ
- ర్భాండభాండము ధూళిధూసర మయ్యె నుద్ధతవాత్యలన్. 61
- క. ఆ కొఱగాములఁ గనుఁగొని
- శాకునికుం డొకఁడు లేచి సంభ్రమ మొదవన్
- జ్యాకలిత శరాసనుఁడై
- వీఁకను సైనికులఁ దిట్టి విభుతో ననియెన్. 62
- క. తఱచుగ మెకములఁ బొరిగొను
- మఱపున వచ్చితిమి, దవ్వు మనపొల మిట, కి
- త్తఱి నగునిమిత్తములు నృప!
- కొఱగా, విదె మనకుఁ బెద్ద గొడవగు ననినన్. 63
- మ. అతఁ డాస్ఫాలితసజ్య కార్ముకుఁడు వాహారూఢుఁడుం బార్శ్వసం
- భృతతూణాహృత చండకాండుఁడు దిశాప్రేంఖత్కటాక్షాంచల
- ద్యుతిజాలుండును నై పుళిందభట సందోహంబుతోడన్ మహో
- ద్ధతి నుండన్ జయలాభసూచక నిమిత్తంబుల్ మెయిందోఁచినన్. 64
విపన్నయగు మనోరమకు స్వరోచి యభయ మొసఁగుట
వ. ప్రాణరక్షాసంశయంబగు మహారణక్షోభం బొక్కటి గలుగు, మీఁద నెట్టకేలకు మితి వెట్టరాని జయ మంగళంబు లగునని యంతరంగంబున నిశ్చయించి యూఱడిలు సమయంబున. 65
- క. ఆ విపినాంతరమున హా!
- హా! వనిత ననాథ నబల నార్త విపన్నం
- గావరె! యీ పుణ్యమునం
- బోవరె! యని పలుకు నాఁడు మొఱ వినఁబడియెన్. 66
- క. ఆమొఱ వేమఱుఁ జెవి నిడి
- భూమండలభర్త కరుణ పొడమఁగ నయ్యో!
- యేమానిని కెవ్వనిచే
- నే మాయెనొ? యనుచు నచటు నీక్షించుతఱిన్. 67
- శా. మట్టెల్ మ్రోయఁగ, గబ్బిచన్నుఁగవ కంపం బంద, వేణీభరం
- బట్టిట్టై కటిఁ జిమ్మచీఁకటులు గా, నశ్రువ్రజం బోడిక
- ల్గట్టం జూపులు చిమ్మరేఁగి దివి రోలంబాళిఁ గల్పింపఁగా
- మిట్టాడంగ నరుండు లేనియడవిన్ మీనాక్షి దీనాకృతిన్. 68
- క. ఒక్కతె భయశోకంబుల
- వెక్కుచు మెయిఁగల విలాస విభ్రమలక్ష్ముల్
- దక్కుటయును నొక యొఱపై
- నెక్కొన ధరణీశునెదుట నిలిచి వినీతిన్. 69
- క. పలుచని వాతెఱ మెఱుఁగునఁ
- బలు మెఱుఁగులు సందడింపఁ బాపటపై నం
- జలిఁ జేర్చి జళుకుఁజూపులఁ
- బలుకులఁ బులకండ మొలుకఁ బలికెం గలఁకన్. 70
- శా. ఓ రాజన్యమహేంద్ర! యో మణిగణ ప్రోతాసివాతాశన
- ప్రారజ్యత్కటిచక్ర! యో ముఖరశార్ఙ్గ క్రూరబాహార్గళా!
- యో రుక్మాచలకల్ప! యో కవచిత వ్యూఢాంగ! కావంగదే
- యో రాహుత్తశిరోమణీ! నిరవధి ప్రోద్యత్ప్రతాపారణీ! 71
- క. అనినఁ దలంపున నింపిన
- యనుకంప నిలింప చంపకామోదసుతుం
- డనునయ మొప్పఁగ నోడకు
- మని నిజవృత్తాంత మడుగ నది యిట్లనియెన్. 72
మనోరమా - విభావసీ - కళావతులకు జీర్ణముని శాపము
- సీ. విసుమానములు గాఁగ వసతోడఁ బెనవెట్టి, నెట్టెంబుగాఁ బ్రేవుఁ జుట్టినాఁడు
- బండికందెన చాయ బైసిమాలిన మేన, మెదడు గందపు రొంపి మెత్తినాఁడు
- కునఖంపు డాచేతి పునుకకప్పెర నిండఁ, బ్రాణికోటుల నల్లఁ బట్టినాఁడు
- కొకిబికి వేసంబు గూని మూఁపులమీఁద, మూఁడు పంగల యీఁటె మోపినాఁడు
- తే. నిట్టతా డనఁ బొడవుచే నిక్కినాఁడు
- నిడుదకోఱల మిడిగ్రుడ్ల నెగడినాఁడు
- నరవరోత్తమ! నేఁడు మూన్నాళ్ళనుండి
- యుసుఱు గొన వెంటఁ దిరిగెడు నసుర యొకఁడు. 73
- క. ఏయెడ ననదలమొఱ వా
- లాయము వినవలయు దుర్బలస్య బలం రా
- జా యన వినవే? ధరణీ
- నాయకులకు నార్తరక్షణంబులె క్రతువుల్. 74
- క. మరుదశ్వపుత్త్రి కిందీ
- వరాక్ష గంధర్వరాజువలనఁ బొడమితిన్
- నరవర! వెలసితిఁ గళలం
- దు రమించుటఁ జేసి భువి మనోరమ యనఁగన్. 75
- శా. రారాపిళ్ళ భుజాంగదంబుల మణుల్ రాలంగ విద్యాధరుల్
- గారా మొప్పఁగ నెత్తికొండ్రు నను, నంకస్థాయినిం జేయఁగా
- వారిన్ వీడ్కొని సింహపీఠికన్ జలత్వం బొందు మాతండ్రి మం
- జీరం బించుక ఘల్లు మన్న, నవి దాఁ జెప్పంగ నిం కేటికిన్? 76
- తే. దేవ! పారర్షి పట్టి కళావతియును
- నల్ల మందార విద్యాధరాత్మజన్మ
- యగు విభావసియును నాకుఁ బ్రాణసఖులు
- వారు నేనును నొకనాఁడు గారవమున. 77
- సీ. నెత్తమ్ము లేకొండ నెత్తమ్ములం దాడు, విద్యాధరీకోటి విటులతోడ
- నెచటిగాడ్పులఁ బుట్టు విచికిలామోదంబు, శబర కాంతల గుట్టు సళ్ళఁబెట్టు
- నెన్నగేంద్రపుఁ జఱుల్ మిన్నంది పెన్నంది, కోరాడుఁ దనగుబ్బకొమ్ములొడ్డి
- యెం దుండు గురివెంద పందిళ్ళ పూఁదేనె, జడి యిందుశిలలందు జాలువాఱు
- తే. నట్టి కలధౌతశిఖరిఁ బుష్పాపచయము
- సేయువేడుకఁ బొదరిండ్ల చాయలందుఁ
- దిరుగుచుండి యొకానొక దెసఁ దృణంబు
- దళముగా వాత మొలచిన బిలమునందు. 78
- ఉ. ఊసరవెల్లి చందమున నొక్కట బీఱనరాలు దేఱఁగా
- మీసలు గడ్డముం జడలు మే నుదరంబును వీనులున్ జరా
- ధూసరమైన రోమతతితోఁ బెనఁగంబడి దూది రాశిగాఁ
- జేసినరీతి నున్న యొక జీర్ణమునిం గని కౌతుకంబునన్. 79
- ఆ. ఇతని వదన కుహర మెద్ది? నేత్రద్వయం
- బెద్ది? కర్ణయుగళ మెద్ది? యనుచు
- బూచివోలె నున్న వాచంయముని మోము
- బాల్య చాపలమునఁ బట్టుటయును. 80
- క. ధ్యాన స్తిమితుం డగు న
- మ్మౌని మదీయాంగుళీ విమర్శనములచే
- మే నెఱిఁగి తొంటి యనుసం
- ధానము చెడి కన్ను దెఱచి దారుణ ఫణితిన్. 81
- ఉ. ఓసి దురాత్మురాల! గృహ మొల్లక సర్వసుఖంబులున్ నిరా
- యాసమునం దొఱంగి మిహిరాంశు మరుచ్ఛద నీర నీరస
- గ్రాసము దేహధారకముగా గుహలం దప మాచరించు మ
- మ్మీసరణిన్ స్పృశించి నగ నేమి ఫలం బొనఁగూడెఁ జెప్పుమా? 82
- క. తిమిరంపు వయసు గుబ్బల
- కొమరాలవు, నీకుఁ దగిన గోవాళ్ళ మహిన్
- నెమకి నగరాదె? ముదిసిన
- మముఁ జెనకిన నేమి కలదు? మద మేమిటికిన్? 83
- క. ముసురుకొను జరభరంబున
- నసురుసు రై యున్న మమ్ము నడకించితి వి
- ట్లుసురు మనఁ బట్టువడు మొక
- యసురకు నీ వనుచుఁ బలికె నాగ్రహ మెసఁగన్. 84
- క. జననాథ! యేమి చెప్పుదుఁ?
- గనలుచు నవ్వగ్గు తపసి కటము లదరఁగాఁ
- దనచేతి నాగబెత్తముఁ
- గొని పసరముఁ గొట్టినట్టు గొట్టె నదయుఁడై. 85
- క. కొట్టువడి యటకు మునుపే
- తిట్టుం బడి యేడ్చు నాదు దెసఁ గని మదిలోఁ
- గట్టలుక వొడమి నాసఖు
- లి ట్టనిరి మునీంద్రుతోడ నెత్తిన పెలుచన్. 86
- ఉ. ఓయి దయావిహీనమతి! యూరక యీ పసిబిడ్డఁ గొట్టఁగాఁ
- జేయెటు లాడె? నీకు నిది చేసిన దేమి? వృథా శపింతురే?
- బోయవె? యాఁడుఁదోడునను బుట్టవె? శాపనిమిత్తమే తపం?
- బీయెడ నున్న శాంతిపరులేమనువా రిఁక నీ చరిత్రకున్? 87
- క. పాము కడు ముదిసి కడపట
- గా మగుచందమున వార్ధకంబునఁ గ్రోధం
- బేమియు మానక మండెడు
- నా ముని మునియే? తలంప నదియుం దపమే? 88
- క. పరుల యపరాధగతులకుఁ
- గెరలక తనుఁ బొగడుచోటఁ గీ డాడెడుచోఁ
- బరితోషము రోషము నెదఁ
- జొరనీని తపస్వి సుమ్ము సుకృతి ధరిత్రిన్. 89
- తే. ఒండొకఁడవైన నిపుడ నీ పిండి యిడమె?
- బ్రాహ్మణుఁడ వౌట మాచేత బ్రదుకు గంటి
- తడవఁ బనిలేదు నిన్ను గౌతముని గోవ
- వనుచు వాదించి విడిచిన నాగ్రహించి. 90
- క. ముసలి శపియించె నపు డ
- య్యసితాబ్జేక్షణల రాజయక్ష్మ క్షోభం
- బెసఁగ నశియింప నగు న
- ద్దెసఁ బాఱుఁడు సుగుడి గామి తెల్లమియ కదా! 91
- క. ఆ రుజ యప్పుడ యయ్యం
- భోరుహ లోచనలఁ బొందె భూవర! నన్నున్
- వారత్రయముననుండియు
- దారుణగతి నొక్కయసుర తఱిమెడు వెంటన్. 92
మనోరమ స్వరోచికి అస్త్రహృదయ విద్య నొసఁగుట
- సీ. ఇచ్చెద నీ కస్త్ర హృదయంబు నివ్విద్య, నరనాథ? మున్ను పినాకపాణి
- యగు రుద్రుఁ డిచ్చె స్వాయంభువ మనువున, కతఁ డిచ్చె మఱి వసిష్ఠాఖ్యమునికి
- నతఁడిచ్చెఁ గరుణఁ జిత్రాయుధుం డను పేరఁ, దనరు మదీయ మాతామహునకు
- నతఁ డిచ్చెఁ బెండ్లి యౌనపు డరణంబుగా, మా తండ్రి కతఁ డిచ్చె మమత నాకు
- తే. సకలరిపునాశకము యశస్కరము నైన
- దీని వేవేగ నాచేఁ బ్రతిగ్రహించి
- యడఁపుమా దైత్యు వీరు వా రనఁగ వలవ
- దనఘ! సద్విద్య యెందున్నఁ గొనఁగవలయు. 93
- క. అనుటయు శుచియై నిలిచిన
- జననాథునకుం బ్రయోగ సంహారంబుల్
- వనిత రహస్యంబుగఁ జె
- ప్పిన నాతఁడు నెఱిఁగె నంత భీషణభంగిన్. 94
రక్కసునితో స్వరోచి ఘోరసమరము
- మహాస్రగ్ధర. గళగర్తక్రోడ నిర్యత్కహకహ నినదోద్గాఢ హాసంబు భూభృ
- ద్బిలముల్ మ్రోయింపఁ గాదంబినిగతిని బొగల్వెంప మిన్నెల్లమైగాఁ
- జలితాస్య క్రూరదంత క్షత రదవసన క్షార కీలాల వేల్ల
- జ్జ్వలన జ్వాలాభ జిహ్వాంచలుఁ డగుచు గదన్ జాళెముల్ ద్రిప్పుకొంచున్. 95
- ఉ. దానవుఁ డద్ధరారమణుఁ దాఁకె నుదగ్ర పదాగ్ర ఘట్టన
- గ్లాని సపాటమై యచటి కాన ఘరట్ట విఘట్టితాకృతిం
- బూని చెడన్ గిరీశ గళ మూల హలాహల కాలకాంతితో
- మేనఱికంబు లాడు తన మేటి త్రిశూలముఁ బూని యుద్ధతిన్. 96
- తే. నింగి నొరయు రాకాసి మన్నీని మేని
- నీడఁ జీఁకటిగొనె నవనీతలంబు,
- చంద్రికలు గాంచె నట్టహాసముల వెడలు
- నిశితదంష్ట్రలచే నవనీతలంబు. 97
- పంచచామరము. పలాశి డాసి రాజుఁ జూచి పల్కె నోరి! నోరి కీ
- పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దోఁచి తౌ
- బలా! బలాలితోడఁ బాలఁ బట్టి బిట్టు చుట్టి నిన్
- హళాహళిన్ హలాహలాభ యౌ బుభుక్షఁ దీర్చెదన్. 98
- మహాస్రగ్ధర. అని బాహాస్ఫోట రావాహత పతగకులం బవ్వనీశాఖి శాఖా
- జనిత వ్యాకీర్ణ జీర్ణ చ్ఛదముల కరణిం జల్లనన్ రాల భూషా
- ర్చి నుదీర్ణాలాత చక్రాకృతిగ జిఱజిఱన్ ద్రిప్పి వైచెన్ గదన్ వై
- చినఁ దేజిన్ రాజు గెంటించెఁ దొలఁగ నది యచ్చెంత కాంతార మేర్చెన్. 99
- పృథ్వి. గదాహతికి నాత్మఁ గొంకక యెదిర్చి రాఁగా ని దౌఁ
- గదా యనుచుఁ ద్రిప్పి రాక్షసుఁడు వైచె గాఢ భ్రమీ
- నద త్కనక కింకిణీ నటన జాగ్ర దుగ్రార్భటీ
- వదావద మహాగుహా వలభియైన శూలంబునున్. 100
- శా. ఆ శూలం బవనీశమౌళి కులిశాహంకార హుంకారి కృ
- న్నైశిత్యం బభినుత్య మై నెగడు బాణశ్రేణిఁ జెండాడి వే
- కాశ శ్వేత గరుత్పరంపరల నాకాశంబు దుగ్ధాబ్ధి సం
- కాశం బై వెలుఁగన్ శరావళులచేఁ గప్పెం గకుప్పంక్తులన్. 101
- క. అవి యాతని పై తోలును
- నవియింపఁగ లేక మిడిసి యల్లటు వడఁ జూ
- చి వనేచరు లేచిన వెఱఁ
- దవిలిన మతి నద్దిరయ్య దయ్యం బనుచున్. 102
- సీ. పక్కుపక్కున నంఘ్రి పాశముల్ వెసఁ ద్రెంచి, డేగ తండముల మింటికిని విడిచి
- గళగళ ధ్వనులతోఁ గంఠశృంఖల లూడ్చి, సుడివడఁ గుక్కల నడవిఁ గలిపి
- గుప్పు గుప్పున మోచికొనియున్న వలలతోఁ, బలలంపుఁ బొత్తరల్ పాఱవైచి
- కంగుకంగున నేలఁ గై దప్పుగాఁ బడు, వేఁటమ్ము లేఱక దాఁటిదాఁటి
- తే. తిరిగి చూచుచు దట్లెగఁదీసికొనుచు
- దగలు దొట్టి యథాయథ లగుచు విఱిగి
- యొకఁడు వోయినత్రోవ వే ఱొకఁడు వోక
- చెట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచు లపుడు. 103
- క. ప్రోవుఁ దలపోసి నిలువక
- పాపాత్మకమై కిరాత బల మటు పాఱన్
- భూపతి యయ్యింతి హయ
- స్థాపితఁగాఁ జేసి పలికెఁ దన్ముఖ్యులకున్. 104
- ఉ. కైదువు సున్న, పూజ్యములు కంకటఖేట శిరస్స్థలత్రముల్
- లే దరదంబు, తత్తడి హుళక్కి, సహాయము సర్వమంగళం
- బీ దనుజుండు చిక్కె, భయమేటికి? లుబ్ధకులార! యాత్మకుం
- బీదతనంబు మేలె? మఱి మృత్యువు డాఁగెడిచోట లేదొకో? 105
- ఆ. నీడఁ గడవఁ బాఱ నేలకు వెలి గాఁగ
- నడుగు వెట్టి తిరుగ నాత్మ మొఱఁగి
- యొకటిఁ దలఁప నరుల కొదవిన నొదవ దే
- కరణి మృత్యుదేవిఁ గన్నుఁబ్రామ. 106
- క. చావుఁ దలపోసి మానవుఁ
- డేవగ దుష్కీర్తి వొరయకే దినములు పొం
- దై వెడలునట్లు నడవఁగఁ
- దైవం బటమీఁద మేలు తాన ఘటించున్. 107
- సీ. బుద్ధీంద్రియ క్షోభములకుఁ బెట్టని కోట, విపదంబురాశి దుర్వికృతి కోడ
- ఖల దురాలాప మార్గణ వజ్రకవచంబు, రణ మహీస్థలికి శ్రీరామ రక్ష
- శాత్రవ దుర్గర్వ సంస్తంభ నౌషధి, మొనయు చింతాశ్రేణి మూఁకవిప్పు
- యోగాదిసంసిద్ధు లొనఁగూర్చు పెన్నిధి, తూలు నేకాకుల తోడునీడ
- తే. సకల సుగుణ ప్రధానంబు సకల కార్య
- జాల సాఫల్యకరణైక సాధనంబు
- ధైర్యగుణ, మట్టి ధైర్యంబు దక్కి పోరఁ
- దత్తఱింతురె! యకట! మీ తరమువారు? 108
- క. అని తెలిపి తిరుగుఁ డనుటయు
- మనమున లజ్జించి యెఱుకు మన్నీ లిఁక నీ
- జనపతితోడిద లోకం
- బని తమతమ మొనలు ద్రిప్పి రవియును దిరిగెన్. 109
వ. ఇట్లు తిరిగి యుక్కెక్కి రక్కసుండెక్క డెక్కడ నని యక్కౌట బలంబు లగుడంబులుఁ గటారు లీఁటెలుఁ బందీఁటెలు విండ్లు గండ్రగొడ్డండ్లుఁ జిల్లకోలలుఁ బంట్రకోలలు మెఱయ రయ సముద్ధూత ధూళి ధూసరిత ధారాధర పథంబగుచు నొక్కపరియ చీమపరి యనం గవిసె నందు. 110
- మ. శరసంధానముతోనె కొన్ని యడుగుల్ జౌజవ్వనన్ బాఱి య
- ద్ధరణిం గాల్కొని ద్రోణముల్ దివియు దోర్దండంబులం జేఁది యే
- సిరి బోయల్ దిను మంచు నార్చి పరఁగం జిట్టాసలన్ డాయుచున్
- గొరవంకల్ మొఱవెట్టినట్లు గుణముల్ ఘోషింప రోషింపుచున్. 111
- తే. ఆ శరావళి నమ్మనుజాశనుండు
- లీల మృగదంశకము మశకాళి నొడిసి
- చప్పరించు విధంబున శాతదీర్ఘ
- దంష్ట్రికలఁ జప్పరించి రౌద్రమునఁ గెరలి. 112
- సీ. గళితశృంఖల మైన గంధనాగమువోలెఁ, బ్రజలపైఁ బేరెముల్ వాఱి పాఱి
- కలశాబ్ధి మథియించు కైటభాంతకులీల, జవ మొప్పఁ జేతులు సాఁచిచాఁచి
- కన లూను కీనాశ కాసరమ్మునుబోలెఁ, గమిచి తట్టువగుంపుఁ జమరి చమరి
- యమృతాపహరణార్థ మరుగు పక్షిస్వామి, గతిఁ బుళిందశ్రేణిఁ గమిచి కమిచి
- తే. సెలవులు బిగించి నేత్రదంష్ట్రికలు మెఱయ
- నిడుదమొగ మెత్తి మీసల నెత్తు రొలుకఁ
- బటబటఁ గపాలపంక్తులఁ బగులఁ గొఱికి
- బలమునెల్లను గడియలోపలన మ్రింగె. 113
- క. ఆ సమయంబున గీర్వా
- ణీసుతుఁడ య్యింతినొక్క నికట నికుంజా
- వాసమ్మున నిడి క్రమ్మఱి
- వే సురరిపుఁ దాఁకెఁ దురగ వేగము మెఱయన్. 114
వ. ఇట్లు తలపడి యమ్మనుజ దనుజులు బీరంబులు దోరంబులుగాఁ బోరుతఱి భూరమణుండు క్రుద్ధుండై సమిద్ధరణి బద్ధపరంపర యగు నంపఱం బెంపఱం జంపరాదు నిలింపారాతినని వితర్కించి, కించిత్తును గొంచక కాంచనద్రవకంచుకితంబును దరణి ఖరకిరణ కాండచండంబును నయి యాఖండల దోర్దండ సముజ్జృంభిత వజ్రాయుధ చకచకం బకబక నవ్వు వజ్రభేదియలుంగు వెలుంగ మత్తారులకు నుత్తలంబిడు నత్తలంబును బద్మరాగమణిచూడంబగు కేడెంబునుంగొని వేడెంబునం దురంగంబుఁ బఱపితెఱపి గని తఱటుచేసి యొరసిచన నుఱికించి కఱకుటరిబరిఁ బఱియవడం బొడిచి కడచి నిలిచినం, బెలుచనం బరిగోలపోటున నాటోపించు మత్త కరివృత్తి నెత్తు రొలుక నక్తంచరుం డుదంచితగతి సవ్యదిశ కొత్తి తఱుమ నపసవ్యగతిన్ జాళెంబున హయంబుఁ బోని చ్చుచు నచ్చరకొడుకు తిరిగితిరిగి సింగిణి నేయుచుం జుట్టుకొనిరా, మనుజాశియు నిట్లట్ల వెనుక వెనుక కడుగిడుచు నడ్డంబుగా నడవి కడ కొత్తికొని నడచి యొడుదొడు కగుడు బెడిదంపు నడక నడరి కడకాళ్ళ కొడియం జిక్కె రక్కసునకుం దుక్ఖారంబను నాలోన నడిదంబునం బుడమిపతి పెడవిసరు విసరి యసురవరు కరాం గుళంబులు దెగనడిచె, నడిచిన సుడివడక మడమలం దాటించిన ఘోటకంబు వెగ్గలంబుగ మ్రొగ్గియు నగ్గలిక చెడక మోఁకరించు కొని కొన్ని యడుగులు సని సేకరించుకొని కంచుమించుగం బఱచుట గగనచరుల వెఱఁగువఱిచె, నట్లు పఱచినం గందంబుఁ జఱచి మొగంబు దుడిచి ప్రస్తుతులఁ గుస్తరించి యతిరభస ఫూత్కార ఘోరారావంబుతో ఘోణారంధ్రనిశ్శ్వాస గంధవాహ ప్రవాహంబు వెడలు వాహంబు దగ మట్టువడ నిట్టట్టు మట్టించుచు నాస్వరోచి నిశాచరు నుద్యోగంబు చూచికొనవలసి నిలిచి, యంతన యతం డొక్క తరువుఁ గరయుగళి నిఱియంబట్టి పెల్లగింప మల్లాడు నాలోనన గల్లునం గింకిణులు మొరయ మెఱుంగు మెఱసినగతి మరల హరిం బఱపియొకటి రెండు మూఁడు గొరకల నెఱఁకులు గాఁగ గుబ్బకొలందికిం దిగవైచి మ్రాను విడిపించి యెలయించుకొని బయలువెడలించి, దోషాచరుండు పాషాణమ్ముల కెపుడెపుడు వంగె నపుడపు డెల్లం దురంగంబు నటం దోలి గంటి యిడి వెంటంబడుటయు గెంటించి లేదు బంతి యన్నయ ట్లల్లంత నుండ వాగె సడలించి పగతుపై నిగిడి వాగెఁ గుదియింప ముంగాళ్లు గగనంబున రా మగిడించి యందె చప్పుడుం గింకిణీ రవంబును నురుమ గీసినగతిం దేఁటి మ్రోసిన క్రియ నాదాఱక యే దిక్కుఁ జూచిన నాదిక్కుననే వినంబడ నెక్కడఁ జూచినన్ దానయై, నీడ యేర్పడక పార్శ్వంబులం గట్టుకెంబట్టు లాలసరి సమకట్టు ఱెక్కలుగా యాతుధానుం డనుకొండచిలువ నొడియ నేలపఱపుగా నాడు గరుడుం డనం బాయుచు డాయుచు, దవ్వులం బొలసి కుఱంగటఁ దోఁచి, కుఱంగట నని చూడ దవ్వులం బొరసి, దవ్వు చేరువ లనిర్ధార్యంబులుగా మెలంగు దేజికాశ్వంబు మెలంపుచు వింటనుం బంట్రకోలల నడిదంబున నత్తలంబున నేసియు వ్రేసియు నడిచియుం గడపలం గానక మిడిసి మృతుండునుం గాని దానవునిం జూచి వేసరి రోసంబున. 115
పావకాస్త్రము ప్రయోగింప రాక్షసుఁడు గంధర్వుఁ డగుట
- క. భూపతి పావకబాణం
- బేపున సంధించి తివిచి యేసిన మెయిఁ గీ
- లాపటలి పొదువ నతఁడా
- రూపం బెడఁబాసి ఖేచరులు వెఱఁగందన్. 116
- లయవిభాతి. ధగధగనిదేహరుచి నిగనిగని కుందనపుఁ
- దగడుఁ దెగడం, జిగురు జిగి నెగుచుమోవిన్
- నగవు నిగుడం, గురుల పొగరు మగుడన్, నయన
- యుగళి వెలిదామరల మగలమగలై డా
- లెగయ, మృగనాభి భుగభుగ లెసఁగఁ, జామరలు
- మగువ లిడ, మౌళిమణి మిగులఁగ వెలుంగం
- దెగలు గలహారముల జిగి చెలఁగఁగాఁ, గొదమ
- మొగులఁ దగు యానమున గగనచరుఁ డయ్యెన్. 117
- క. నవనవ సౌరభముల నె
- క్కువ కువలయవర్ష మపుడు కురిసెన్ మొరసెన్
- రవరవ మురజ రవంబులు
- దివి దివిష జ్జలజముఖులు తెలిసి నటింపన్. 118
వ. అనిన విని తరువాతి వృత్తాంతంబు వినుటకుం దివుటమై మదీయ మానసంబు కౌతుకాధీనంబయ్యెడు వినిపింపుఁడని యడుగుటయును. 119
ఆశ్వాసాంత పద్య గద్యములు
- శా. శ్లాఘాలంఘన జాంఘి కోజ్జ్వల గుణాలంకార! ఘీంకార హే
- షా ఘోషోద్భట ధాటికా గజఘటాశ్వ క్షుణ్ణ విశ్వంభరా
- మోఘీభూత భుజంగ భోగభర! సంఫుల్లాబ్జపత్రేక్షణా!
- ద్రాఘీయః ప్రతిభావిచక్షణ! త్రయీ ధర్మైక సంరక్షణా! 120
- క. బహువీర హనన మిళ దఘ
- వహన భ్రమకృ త్కళంక వర్గోగ్రాసి
- గ్రహిళ భుజయుగళ! గజప
- త్యహిప హరణ తార్క్ష్య! సజ్జనావన దక్షా! 121
- పృథ్వి. సుధీ మధురవా క్సుధా సుముఖ! నాగమాంబా సుతా!
- మధు ప్రసవసాయక స్మయ విరామ రమ్యాకృతీ!
- దధీచ విధుకామ ధుగ్ధనద దుగ్ధసింధు ప్రథా
- వధీరణ పరాయణోజ్జ్వల వదాన్యతాలంకృతా! 122
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతో ముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోప తాపస ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయా మాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా ప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము
పంచమాశ్వాసము
- శ్రీనందన సౌందర్య! సు
- ధీనందన! వితరణావధీరిత బలిరా
- డ్భానుజ! పరరాజస్వ
- ర్భాను భుజాహీంద్ర! కృష్ణరాయ నరేంద్రా! 1
వ. అవధరింపుము. జైమిని మునీంద్ర చూడారత్నంబునకు నీడోద్భవంబు లి ట్లనియె. 2
గంధర్వుఁడైన యిందీవరాక్షుని శాప వృత్తాంతము
- తే. అపుడు గంధర్వపతి మహి కవతరించి
- రాజు విస్మయమున హయరాజు డిగ్గ
- నక్కు సేర్చి ముదంబుతో ననియె దంత
- కిరణములు హారకాంతులు సరసమాడ. 3
- సీ. భద్రమా నీకు నీ బాహాభృతక్షితిఁ, బ్రజలకు? లెస్సలా రాచవారు?
- ధన్యుండ నైతి నీ దర్శనంబునఁ జేసి, నా దుష్కృతము లెల్ల నాశమొందె,
- నీ జగత్త్రయి నన్ను నిందీవరాక్షాఖ్యఁ, గీర్తించు నప్సరో గీతసరణి,
- గారాపు మీ తల్లికడవాఁడఁ గాని నే, గణుతింపఁ గడవాఁడఁ గాఁ జుమయ్య!
- తే. పెండ్లి కొడుకవు మాకు, నీ బిసరుహాక్షి
- కూర్మినందన, మొక మౌని ఘోర శాప
- వికృతి మానిసిదిండి నై యకట! దీని
- ప్రాణముల కల్గఁ దలఁచితిఁ బాపబుద్ధి. 4
- క. అనునెడ వచ్చి మనోరమ
- జనకుని పాదముల కెఱఁగ సస్నేహమతిం
- గనుఁగవ నీ రొలుకఁగ నం
- దన మూర్ధాఘ్రాణ మతఁడు దయఁ గావించెన్. 5
- ఆ. అపుడు విస్మితాత్ముఁడై వరూధినిసుతుఁ
- డేమి కారణమున నేతపస్వి
- యిట్టి శాప మిచ్చె? నెఱిఁగింపు విన వేడు
- కయ్యె ననఘ! యనిన నాతఁడనియె. 6
- మ. కలఁ డుల్లోకయశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్
- నలనాభాహ్వయుఁ, డేఁ దదీయతనయుండన్ బ్రహ్మమిత్రుండు శి
- ష్యులకుం గంటను వత్తిఁ బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ
- ద్దులఁ జెప్పన్ వినుచుండి మానసమునందు దజ్జిఘృక్షారతిన్. 7
- తే. మౌనివరుఁ జేరి భక్తి నమస్కరించి
- చెప్పవే నాకు నీ విద్య శిష్యకోటి
- తోడఁ గూడంగ నేఁ గృతార్థుండ నగుదు
- ననుచుఁ బ్రార్థింప ననుఁ జూచి యపహసించి. 8
- క. నటవిట గాయక గణికా
- కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
- గటు వీ శాస్త్రము వల ది
- చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్? 9
- తే. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
- యించుకించుక మీవంటి యెఱుక గలుగు
- పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
- నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు. 10
- క. ధన రాజ్య రమా మదమునఁ
- గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
- టెను నేరము గలదే? ననుఁ
- గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్. 11
- క. అచటన్ ద్వేష్టి గతాయు
- శ్చ చికిత్సక మను నయోక్తి చర్చను నుచ్చా
- వచ వచనంబులఁ గోపము
- ప్రచురము గానీక మౌనిపతి కి ట్లంటిన్. 12
- తే. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
- బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
- కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
- వెజ్జుఁదన మేల? యని మది లజ్జవొడమి. 13
- శా. కంటే బ్రాహ్మణుఁ డెన్ని కాఱు లఱచెన్ గర్వించి? వీరెల్ల నా
- కంటెన్ బాత్రులె విద్య? కెట్లు నిది నేఁ గై కొందునంచున్ మది
- న్గెంటెంపుంజల ముప్పతిల్లఁ గపటాంతేవాసి నై శాంబరిన్
- గొంటుంజందము మాఱ శిష్యులగెడం గూర్చుండి చర్చారతిన్. 14
- తే. కాయ బాల గ్రహోర్ధ్వాంగకములు నాల్గు
- శల్య దంష్ట్రా జరా వృష సంజ్ఞ నాల్గు
- నైనయష్టాంగకము ఠావు లారఁ గల్గు
- వైద్య మెనిమిది నెలల సర్వమును నేర్చి. 15
- క. ఇరుమూఁడు రుచుల దోషపు
- విరసత మానన్ జ్వరాది వృష్యాంతం బై
- పరఁగు చికిత్సయుఁ గని శాం
- బరిఁ బాసి తపస్వితోడ మదమున నంటిన్. 16
- శా. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్
- గండ్రల్గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
- దీండ్రల్ గల్గినవారి కేకరణినేనిన్ విద్య రా కుండునే?
- గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా! 17
- మ. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
- పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
- బన నూర్పుల్ నిగుడన్ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్
- చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్. 18
వ. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి. 19
- శా. నా యజ్ఞానము సైఁచి సంయమివరేణ్యా! కావవే రాక్షసుం
- డై యే నెట్లు భజించువాఁడ దురితంబయ్యో! నృమాసంబు కూ
- డై యే నెట్లు భరించువాఁడ నుదరం, బార్ద్రాంతరంగుండ వై
- యోయయ్యా! దయసేయవే యవధి, యే నోపంగదే హింసకున్. 20
- చ. అనినఁ బ్రసన్నుఁడై ముని కరాబ్జములన్ నను నెత్తి వత్స! మ
- త్సునిశిత శాప శూల హతి స్రుక్కితిగా యిఁకఁ గొన్నినాళ్ళపైఁ
- దనయను మ్రింగఁ బోయి యొక ధన్యుని దివ్యశరార్చిఁ బ్రేలి వే
- కనియెదు భద్ర మన్నఁ దురగంబుపయిం బడి ప్రొద్దుగ్రుంకఁగన్. 21
- క. సన్నపుఁదలయేరున మయి
- యన్నుకొనుచు నాము దిన్న యట్లై రాఁగా
- ఖిన్నుఁడ నై పురి కేఁగితిఁ
- దిన్నఁదనం బుడిగి కొన్ని దివియలు వెలుఁగన్? 22
- క. అంపఁ దగువారిఁ గసరుచు
- నంపి నగరు సొచ్చి వెలఁదు లారతు లీఁగా
- నిం పఱఁ గశాభిహతులం
- జంపించితి వారి నన్నిశామధ్యమునన్. 23
- సీ. అభ్రమండలి మోచునందాఁక నూరక, పెరిఁగిన ట్లౌ మేను నరవరేణ్య!
- యవధి భూధరసాను వందాఁక నూరక, పఱచినట్లౌ మేను పార్థివేంద్ర!
- యబ్జభూ భువనంబు నందాఁక నూరక, యెగసినట్లౌ మేను జగదధీశ!
- యహిలోకతలమంటునందాఁక నూరక, పడిన యట్లౌ మేను ప్రభువతంస!
- తే. యఖిలజగములు మ్రింగునం తాఁకలియును
- నబ్ధు లేడును జెడఁ గ్రోలునంత తృషయు
- నచలచాలనణచ మైన యదటుఁ గలిగె
- నసురభావంబు ననుఁ జెందు నవసరమున. 24
- క. రక్కసుఁడ నై నెపం బిడి
- యొక్కొక యపరాధమునకు నొక్కొక్కఁడు గా
- బొక్కఁగ లోకము పురపురఁ
- బొక్కఁగఁ బాడయ్యె నంతిపురముం బురమున్. 25
- తే. ఊరు పా డైనఁ గెళవుల యూళ్ళ కుఱికి
- మెసవ దొరఁకొంటిఁ బ్రజ మారి మసఁగినట్లు
- తీఱెఁ గతిపయదినముల దేశమెల్ల
- మల్లె వట్టిన చేని క్రమంబు గాఁగ. 26
వ. ఇవ్విధంబున విధివిధానంబున యాతుధానుండనై ధారాధరోత్సేధంబును నతి నిశిత రోమసంబాధంబును ధూమ సమధామంబును ధృతాంత్రదామంబును జలిత కపాలకుండలంబును జ్వలిత సిత దంష్ట్రామండలంబును నాగాయుత త్రాణంబును మస్తకోత్తుంగ ఘోణంబునునై యనవరత హింసానురూపంబగు రూపంబుఁదాల్చి] శకటాంగభంగికమ్ములై యింగలమ్ము లొలుకు నపాంగమ్ములం బిశంగమ్ము లగుచుఁ బశ్యజ్జనానుమోచనమ్ము లగులోచనమ్ములు వెలుంగ బభ్రుకేశమ్ములు దూల సకలభూత భయంకర మ్మగు పటిమ నిచటియుటజమ్ముల కుఱికి జటి యనక వటు వనక యతి యనక వ్రతి యనక గృహి యనక సతి యనక శిశు వనక భక్షించి భక్షించి కుక్షింభరిత్వంబునం బ్రవర్తిల్లితి నది యట్లుండె వినుము. తారలకు వర్షధారలకు నిసుమునకుఁ గసవునకు లెక్క గలిగినం గలుగుఁ గాని మదీయజఠరానల జీర్ణ జంతుసంతానంబు నకు లెక్కయిడ న క్కమలగర్భుండును సమర్థుండుగాఁ డిట్టి కృత్రిమ దనుజభావావిష్టుండ నగు నా దౌష్ట్యంబు సవసవగాఁ దెలిసి ముదురకయ మున్న మత్కళత్రంబులం బుట్టినింటివా రుత్సవావ లోకన వ్యాజంబున ననిపించుకొని చని నిజగృహంబుల నునిచి రక్షించుకొని యుండి, రప్పు డే నశనంబు కానక, కానక కన్న యిక్కన్నియం గైలాసకాననంబునం గుసుమంబులు గోయు దానిం గని కనికరం బుడిగి కడుపుఁ జిచ్చునకు మ్రింగం దఱుముకొనివచ్చి యిచ్చోట భవదీయ దర్శనంబున వృజినరుజ వలన విముక్తుండనై నిజప్రకృతిం బొంది కృతార్థుండ నైతి. 27
ఆయుర్వేద విద్యను బొంది, తన తనయను బెండ్లియాడుమని స్వరోచిని గోరుట
- క. ఈ ఉపకారమునకుఁ బ్రతి
- సేయఁగ శక్యంబె జంభజిన్నిభ! శఫరా
- త్యాయతలోచన యైన మ
- దీయాత్మజ నీకు నిత్తు దేవీమణిగన్. 28
- క. ఆయుర్వేదముఁ గైకొని
- యీ యింతిం బెండ్లియాడు మెలమి రమా నా
- రాయణ పరిణయ గేయ వి
- గాయన గంధర్వ మైన కవ్వపుఁగొండన్. 29
- లయగ్రాహి. అన్నగముపై జరఠ పన్నగపతిస్ఫట ల
- న న్నెగసి కోటతుదల న్నెగడుకొమ్మల్
- మి న్నగల రాయ రుచిఁ జెన్నగు విమానముల
- పన్నుగడ పన్నుగఁ బ్రభిన్న గజఘోట
- చ్ఛన్న గహనాపణముల న్నిగనిగద్యుతి ర
- వి న్నగుమణి ప్రకర మున్న గరిమం బే
- రెన్నఁగల యంగడుల వన్నె గని సంపదల
- మన్నగరి యొప్పు బలభిన్నగరి ఠేవన్. 30
- తే. అని నిజోదంత మావంత యైన దాఁప
- కంతయును జెప్ప నద్భుతం బంతరంగ
- మంతయును నిండ హర్షించె నా స్వరోచి,
- యంత రవి యేఁగెఁ బశ్చిమాశాంతమునకు. 31
సాయంసంధ్యా వర్ణనము
- మ. వికసిల్లం బ్రజ చక్రపాలనము గావించెం, గరవ్యాపృతిం
- గకుబంతంబుల నాక్రమించెఁ, బొసఁగంగా నేర్చె వర్ణాళిఁ, గాం
- తికిఁ బాపెం బెఱరాజకోటిఁ, దుది శాంతిం బొందె, దైవంబు సేఁ
- తకుఁ దాపం బిఁక నేలనంగ నినుఁడస్తప్రాప్తుఁ డయ్యెంగడున్. 32
- తే. అసురవరుఁడైన యిందీవరాక్షుమేన
- నంటుకొన్న స్వరోచిబాణాగ్ని వోలె
- నంతఁ గనుపట్టె శుకతుండ కాంతిఁ దెగడి
- సాంధ్య రాగంబు పశ్చిమాచలమునందు. 33
- క. తలచూపె నప్పు డఖిలా
- శల దట్టపు టిరులు చిలువ జవరాలు నభ
- స్స్థల మండపకోపరి సీ
- మల నిడిన సితాండపటలి మాడ్కిం జుక్కల్. 34
- ఆ. సాంధ్యనటన చండ చండీశ పద హతిఁ
- దరణిచక్ర మొరగి శరధిఁ గ్రుంగ
- దోరగల్లువడియె భూ రథేతర భాగ
- చక్రమనఁగ నపుడు శశియుఁ దోఁచె. 35
- క. తమ మను కాలాహి ప్రపం
- చము నెరగొని యోషధీశ సద్యఃకృత దం
- డమున మగుడంగఁ గ్రక్కెడు
- క్రమమున నొయ్యొయ్య విచ్చి కడలకుఁ దొలఁగెన్. 36
వ. అనంతరంబ క్రమ క్రమంబున. 37
- సీ. కలయ వెల్లువగట్టి జలజలఁ బ్రవహించు, శశికాంతవాంత నిర్ఝరముజలము
- మలయానిలముచే దుమారంబు రేఁగు సౌ, గంధికంబు రజంబు కఱకుదుమ్ము
- నిండార విరిసిన బొండుమల్లెల నుండి, వడియు మరందంబు గుడరసంబు
- తొలఁకి మింటికిఁ బొంగు దుగ్ధపాథోరాశి, కరడులమీఁది మీఁగడల మెఱుఁగు
- తే. తనకు రసవర్గములుగా సుధాకరుండు
- సారె సారెకుఁ గరములు సాఁచి చాఁచి
- యచ్చ తెలుపుగ నపుడు బ్రహ్మాండ మండ
- పంబు వెన్నెల సన్నసున్నంబు సేసె. 38
వ. ఆ సమయంబునం బరిశ్రాంతుం డగునమ్మహీకాంతుం డొక్క శశికాంత శిలా మండపంబున దట్టంబుగాఁ బఱచిన చిగురుపఱపుల గంధర్వరాజునుం దానును సుఖాసీనుం డై యిష్టకథాగోష్ఠి నా రాత్రి గడిపె నంత. 39
- సీ. తనుఁ బాసి శశి దవ్వు చనిన నెవ్వగఁ బోలెఁ, దొలిదిక్కు జవరాలు వెలుకఁ బాఱెఁ
- బ్రథమాద్రిసభయందుఁ బఱిచిన కెంబట్టు, జముకాణ మనఁగ రాగము జనించె
- ధవుఁ గూర్మి కొసరుచున్నవి వోలె ముఖరాశి, వనరుహాస్యములఁ బద్మినులు తెఱచె
- భానూష్మభీతి మున్పడిన చుక్కలభంగి, దొరలె వేకువగాలిఁ దరుల మంచు
- తే. కాలగుణయుక్తి మింటి చక్కటికి నెగయ
- వాసవునిపట్టి పొడవుగా వైచి యాడు
- గచ్చు చమరిన దారు చక్రంపు బిళ్ళ
- వోలె నొయ్యనఁ బ్రాచి లేఁ బ్రొద్దు పొడిచె. 40
ఇందీవరాక్షుఁడు నిజనగరి కరుగుట
- క. ఈ గతి నత్తఱిఁ దెలతెల
- వేఁగిన గంధర్వపతికి వేగుట విని తా
- రాగమున కేఁగి కాంచిరి
- రాగమ్మునఁ గొలిచి మను పురాతన ఖచరుల్. 41
- ఉ. కాంచినఁ బొంగి వా రొసఁగు కానుక లర్థిఁ బరిగ్రహించి మ
- న్నించి పురప్రయాణ రతి నిక్క నరేంద్రుఁడు మున్నుగాఁ దటి
- చ్చంచలవాహమై మణుల చాయల దిక్కు లలంకరించి హొ
- న్నంచు రథంబు చాఁగు! బళి! యంచు నకీబులు మ్రోయ నెక్కినన్. 42
- క. నందనయు నుచితరత్న
- స్యందనమునఁ జనియె నర్థి జనకునిబడి న
- య్యిందీవరాక్షుఁ డీ గతి
- మందరమున కెగయ గగన మార్గమునందున్. 43
- సీ. మండిగాలిడి దంత శుండాగ్ర హతిఁ జించి, జలధరాంభముఁ గరుల్ చల్లులాడ
- నహిమాంశు హయ హేష లాలించి చెవి వంచి, కెరలి వాజులు బయల్ గొరిజఁ ద్రవ్వ
- ధ్వజ వాతహతి నాఱ వైద్యుతాగ్నులఁ జూఁడి, పగలు దివ్వెలవారు పంజు లెత్తఁ
- బెటులు చప్పుడు లాత్మ భీరు స్వయంగ్రాహ, పరిరంభ సుఖము ఖేచరుల కొసఁగఁ
- తే. జామరప్రభ గగన గంగా మరాళ
- చకచక భ్రమ మొదవింపశంకరాద్రి
- కాననముమోచి మందరాగంబుదాఁకఁ
- బౌఁజువెట్టిరి తన్మూల బలము దొరలు. 44
- క. కుంజర శతాంగ హయ భట
- రంజితమై పై రజఃపరంపర లలమన్
- మంజుల కాంతిఁ గసీసపు
- మాంజిష్ఠముఁ బోలె గగన మండప మమరెన్. 45
- తే. సొరిది నీ రీతి దివిఁ దోడు సూపినట్టి
- దొరలు గొలువంగ ఖచరేంద్రుఁ డరిగి యరిగి
- మింట గ్రహరాజు తనసగమింట వెలుఁగు
- మంథగిరిఁ గాంచి పలికె నమ్మనుజపతికి. 46
మందరగిరి వర్ణనము
- సీ. జరఠ కచ్ఛపరాజు చరమాంగ గృహమేధి, భోగివేష్టన రేఖఁ బొలుచు జాణ
- కులములోఁ దరితీపు గలిగి మించినమేటి, మైనాకు నొరసిన మావటీఁడు
- తొలువేలుపుల వేలుపులపనుల్ గొనుఱేఁడు, కడలిరాయల లోఁతు గన్నగబ్బి
- సురరాజునకుఁ బాండుకరిఁ జేర్చు మరకాఁడు, కల్పకంబుల పంట కమ్మతీఁడు
- తే. గంటె! మథిత సుధా ధౌత కటక జాత
- చంపకవన ప్రకంపనాకంప విసర
- దఖర ముఖరవ మధుకర ముఖర శిఖర
- నందరస మందిరం బగు మందరంబు. 47
- శా. వైకుంఠాంగద హేమ మాతత వలద్వాతాశనాకృష్ట రే
- ఖాకారంబులఁ జుట్టు నంటి మొలనూలై మేటియొడ్డాణమై
- శ్రీకారప్రభఁ గంఠియై శిఖరిరాట్సింహోల్లసత్పట్టమై
- యీ కొండం గనుఁ గొంటె! మాయ దిపుడున్ హేరాళపుం గాంతులన్. 48
- తే. వేదవేదాంతముల వేధ వెదికి కనని
- పద్మలోచను శ్రీపాద పంకరుహము
- లబ్జరేఖాంకితము లవే యచలవంశ
- వల్లభుని మేఖలాసీమ నెల్ల మెఱయు. 49
- ఉ. నాలుకబంతి వ్రేలఁబడి నంజునఁ దోఁగి తమాలపల్లవ
- శ్రీల హసింప నుబ్బి కనుఁ గ్రేవల జేవుఱు పుక్కిలింపఁగా
- వాలిక మేనిపీఁ చెగయ వాడిన మాల్యమువోలె నాదిమ
- వ్యాళము దీనిపగ్గ మయినట్టి యవస్థఁ దలంతు నెప్పుడున్. 50
- చ. బిలముఖ పంక్తి నీ ధరణిభృత్పతి వారిధి నిర్భరభ్రమిన్
- దలముగ మున్ను ద్రావిన సుధారస ధార గుణంబునం జుమీ
- పలితవికార దూర నిరపాయ సుఖస్థితిఁ గాంచె నాఁగఁ గో
- మల విచలచ్ఛిరోరుహ తమాల వినీలిమ రేఖ యొప్పెడిన్. 51
- చ. జడధి మథింపఁ జిక్కి సుధ సౌరభ మానుటఁ జావు దక్కి ఱా
- పడఁకులనుండి దుగ్ధభవ పాండిమ బొందుల నందమొంద నిం
- దడవి మెకాలతోఁ గదుపులై చరియించును మేఁతకై బయ
- ల్వెడలి ఢులీ కుళీర శకులీ మకరీముఖ వారి జంతువుల్. 52
మనోరమా స్వరోచుల వివాహ వైభవము
- మ. అనుచుం జందనపంక పంకిల తలంబై కేతు రుద్ధాతపా
- ధ్వనిరుష్ణం బయి మంచకోపరి కుటీ వాటీ నట న్నర్తకీ
- జన మై యౌవత సర్వతః కలిత వీక్షా తోరణ స్రఙ్నిబం
- ధన మై యొప్పుపురంబు సొచ్చి భవనద్వార ప్రఘాణంబునన్. 53
- క. మంతుల బాంధవభటసా
- మంతుల నాశ్రితుల నిలిపి మహికాంతునిశా
- కాంతమణి కాంతికందళ
- కాంతం బగు నొక్క దొరనగర విడియించెన్. 54
వ. విడియించి యనంతరంబ యంతఃపుర కాంతాకరాంత తంతన్యమాన మణిభాజన నీరాజనమంగళంబు లంగీకరించి, ప్రియాంగనల సంభావించి, మగుడ నాస్థాన మండపంబున కేతెంచి మతంగ మంకి మంకణ మందపాల మరీచి మాండవ్య మార్కండేయాది మహామునుల రావించి, లగ్నంబు నిశ్చయించి, గగనచర జంఘాల కరప్రేషిత లేఖతరులేఖాముఖంబులఁ జిత్రరథ చిత్రాయుధ చిత్ర సేనాదులగు గంధర్వులను వరాహకర్ణ గజకర్ణ సుకేతు మాణిభద్ర ప్రముఖ యక్షులను రేవంత ప్రముఖ గుహ్యకులను మందార ముఖ్య విద్యాధరులను బిలిపించి, వినయపూర్వకంబుగా విత్తాధిపతికి విజ్ఞాపన పత్రిక లిఖియించి నిజప్రధానులం బంచి నలకూబరు రావించె నంత. 55
- క. పసువుల నలుఁగిడి రైదువ
- బిసరుహలోచనలు పెండ్లి పెద్దల యాజ్ఞన్
- వసుధాధ్యక్ష బుభుక్షున
- కసితాకలభరకుఁ బేరఁటాం డ్రొగిఁ బాడన్. 56
- ఉ. మజ్జన మాడె రాజు కృశమధ్యమ లింపున వంప గుంపులై
- గొజ్జెఁగనీటి వెల్లువలు గోవ జవాజుల నిగ్గుఁ జూపఁ జం
- చజ్జరఠాహి కంచుకము చాయ మడుంగుల నొత్తెఁ జెమ్మనీ
- రుజ్జగిలన్ వహించె మెయి నూఁదినఁ బాఱు దుకూలచేలముల్. 57
- చ. గరువున కొత్తఁ జెంగలువ కచ్చు ఘటించినమౌళిఁ జుట్టెఁ జెం
- దిరికచెఱంగునం బసిఁడితీఁగెలు నించిన జిల్గుపాగ బం
- భరసభ వాసనాపవనపారణఁ దేల నలందెఁ గస్తురిన్
- మరకతమౌక్తికాదిమణి మండనమండితుఁ డయ్యెనయ్యెడన్. 58
- మ. కదిసెన్ లగ్నమటంచు మంత్రులు దొరల్ గంధర్వరాజాజ్ఞ ను
- న్మదవేదండ ఘటా భటాశ్వ రథ సేనా జైత్రవాదిత్ర సం
- పద మీఱం జనుదెంచి కాంచిముదమొప్పం జేసి రారూఢుఁగాఁ
- గదళీకాంచనకక్ష్యలన్ మెఱయు లేఖస్వామి చౌదంతిపైన్. 59
- ఉ. అత్తఱిఁ బట్టణంబు వికచాంబురుహాక్షులు కౌతుకంబునం
- జిత్తము లుల్లసిల్లఁ గయిసేసి గృహాంగన సౌధ మాలికల్
- హత్తి నరేంద్రవీథిఁ జతురంగబలంబులుఁ గొల్వఁగా మరు
- న్మత్తగజంబుపైఁ జను కుమార శిరోమణిఁ జూచి రుబ్బునన్. 60
- ఉ. అంచెలు గట్టి కాలి తొడుపై చననివు గదమ్మ ప్రోదిరా
- యంచ లివేటి సంగడము లయ్యెను? దయ్యమ! యేటివేడ్క నా
- కంచుఁ బదంబునన్ మొరయు నందియ యూడఁగఁ దన్నిపోయి వీ
- క్షించె లతాంగి యోర్తు మురజిన్నిభు సాగరమేఖలావిభున్. 61
- చ. అలపులపల్లవుం డొకఁడు వట్టిచలంబున నేఁప దీనయై
- యలుకలు తీర్చితీర్చి యొక యచ్చర వచ్చి నృపాలు నన్నగ
- ర్వెలువడి చూచెఁ గాముకుఁడు వెంటనె రా నపుడాత్తఘర్మయై
- వెలవెలఁబాఱె దన్ముఖము వెల్వెలఁబాఱె విటాననాబ్జమున్. 62
- చ. చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై
- నిలువున నాడుచుండి ధరణీపతిఁ జూడఁ దలంచి యంచునన్
- నిలిచి రహిం గనుంగొనుచు నెయ్యమునం దనువల్లి యుబ్బి కం
- చెల తెగిపడ్డఁ గేతనము చీరచెఱంగున మూసెఁ జన్నులన్. 63
- ఉ. కీరమనోజ్ఞవాణి యొక కిన్నర కిన్నెర మీటి మీటి యొ
- య్యారపులీల నేఁగి వసుధాధిపుఁ గన్గొనె జిల్గుపయ్యెదన్
- హారముఁ జక్కఁ బెట్టెడు కుచాహితహస్తముపైఁడిగోళ్ళు హిం
- సారతి సేయు దర్పకుని సంపెఁగముల్కులుఁబోలె మించఁగన్. 64
- చ. పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ గానదు, ఘర్మవారిచేఁ
- గరఁగి స్రవించుచిత్రకము గాన, దనాదృత వీటి పాటలా
- ధరమున సున్న మంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
- భరణము గొన్నఁ గాన దొక బాల నృపాలుని జూచి నివ్వెఱన్. 65
- చ. అలికులవేణి యొక్కతె రతాంతమునం దనయంగవల్లికం
- బులకలు చొక్కు లేఁజెమరుఁ బుట్టఁగ నేఁగి నరేంద్రుఁ జూడ నా
- పులకలు చొక్కు లేఁజెమరుఁ బోవక యట్టుల యుండె నట్టి దౌఁ
- జెలు వగువానిఁ గన్గొనిన చెల్వకుఁ జూపుల కావె కూటముల్? 66
- చ. అలరులబంతి జృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళిపై
- కలకలఁ ద్రోయుచుం దరఁగ లౌ ప్రమదాశ్రులు గోట మీటుచుం
- జెలి భుజపీఠి నొత్తగిలి చిల్కను దువ్వుచు వాలుఁగన్నుఁ గ్రే
- వల కుదధార చేర నొక వారవిలాసిని చూచె రాసుతున్. 67
- చ. జిలుఁగులఁ బెట్టుచుం దొడలఁ జెంద్రికపావడ యంట మైతడిం
- బెళపెళ లేనిచీరఁ గటి బింకపుఁజన్నులఁ జేర్చికొంచు వే
- జలకము లాడియాడి యొక చాన కరస్థితకేశ యై నృపు
- న్వెలువడి చూచె లోఁబడితి నీ కని బాసకు నిల్చెనో యనన్. 68
- మ. ఒకనేత్రాంబుజ మొక్కగల్ల మొకచన్నొయ్యారపున్లీల వీ
- థికిఁ దోఁపన్ దలుపోరఁగా నొక పురంధ్రీరత్న మీక్షించె రా
- జకిశోరంబుఁ దదీయలై వెలయుభాషాలక్ష్ములం జూచి త్ర్యం
- బకభాగంబు మొఱంగి మైత్రికి శివాభాగంబ యేతెంచెనాన్. 69
- మ. కలయన్ గూర్మిఁ జెమర్చునంగముల లగ్నంబైన సన్నంపుమం
- జుల కౌశేయమునందు మించు కమల స్తోమంబుచేఁ జూచె నొ
- క్కలతాతన్వి చెలంగి పొంగు మతికాంక్షల్ దీఱ మే నెల్లఁ గ
- న్నులుగావించి కుమారుజవ్వనము చెన్నున్జూచుచందంబునన్. 70
వ. ఇత్తెఱంగునం గరంగు నంతరంగంబులు గల కురంగాక్షుల యపాంగంబులం దుఱంగలించు సితేతర తరళతర దృగ్రోచుల నభంగ శృంగారరసవీచుల చాలునం బోలెఁ బొదువంబడి యాలంబిత చీనాంబర ప్రాలంబమాలికాచిత్రమ్ములగు నాతపత్త్రమ్ములు మెఱయఁ, బత్త్రమ్ముల డిగ్గి దుర్గాధిపతు లే మేమ యని త్రోపు త్రోపాడుచు వీచు వీచోపు లచ్చమ్ము లగు కౌముదీగుచ్ఛమ్ముల సంతరింప, నంతిక వైజయంతికలం గ్రాలువలువలం బొలయు చిఱుగరువలిం దూలు నీలాలకల యలక లుభయపార్శ్వస ముత్తుంగ మత్తమాతంగ మద సౌరభ సంగిభృంగ సంఘంబుల నెలయింప, నింపారుకలపంబు లబ్బాటునం బేటులెత్తి యొండొరుల యొత్తిడిన్ బొడిపొడియై యెగయు విసృమరపరాగపూరంబు చదల నెల్లెడ నుల్లెడ గట్టిన ట్టమర, దట్టదట్టమ్ముగ సాగు నాగరుల వాగారవమ్ములు నిగుడ, నెడవడక పొగడు పొగడికల కల కలమ్ములును, బుంఖానుపుంఖ శంఖభేరీపటహకాహళవేణు వీణాది వాదనధ్వానంబును, గల మధురకిన్నరీ క్వాణంబుల రాణంద్రాణఁ జెఱుచు విన్నాణంపుఁ గొల్పు టెలుంగులును, వేల్పు గాణలు పాడు లక్ష్మీనారాయణుల కల్యాణంపుఁబాటలం దీటుకొను తిన్నని రవంబులుం గలిసి బలిసికొను కోలాహలమ్ము లిమ్ముగ సందడుల నెడ గలుగం జడియు వేత్రహస్తుల ప్రశస్తతర సాహోనినాదంబు సంబంధించి పెంపొలయ నత్యంత కాంతంబయి నిరంతరగతిం గ్రంతనడవ, నడదివియలై మకుటార విందరాగంబులు వెలుంగ నలుగడల సామంత సందోహంబు క్రందుకొన మందమందగమనంబునం జను బృందారకవేదండంబు పై నుద్దండ తనుచ్ఛాయా కలాపంబు జంబేటి జంబాల కదంబకంబు డంబు విడంబింపఁ దిన్నని రవంబునం గలసి బలసిన కోలాహలంబు హంసాది విహంగమ హృదయంగమ రావంబును బెడంగువడ నడచు క్రంత నత్యంత దర్శనీయంబులై మెఱయు మంగళ ద్రవ్యంబుల నెడనెడఁ దీండ్రించు పుండ్రేక్షు దండంబులకడలఁ గడలుకొను పసరుటాకులడాలు శైవాలంబు, నందందక్రందుగా మండు చేదివియలు చెందొవలునుం గాఁ బార్శ్వద్వయ సముత్తుంగ మణిసౌధ వీథికారోదోఽంతరాళంబున గంధగజఘటా ఘనాఘనకాంతికధూళి మాగధ ప్రవాహంబునం గూలంకషంబగు నృపతిపథ యమునాహ్రదంబు గగన గంగావ గాహనాభ్యాసంబున నిండుకొనిపోవు నదియునుం బోలెఁ దనరఁ దన సముద్దామ తేజోభరంబునన్ జడిసిన మేరుగిరిమోరులుం బోలెఁ దీరుగలభుజంబులం దాఱుమాఱుగా నిడిన తారతారంపుఁ బంచసరంబులు దోరంతరహారంబులుఁ గేయూరహీరంబులుఁ గర కంకణ కురువిందకందళంబులుఁ గటికనకమేఖలాఘటితం బగుచేరు కరాచురీ మరకతంపుఁబిడిమెఱుంగులుం దఱిసి వెన్నెల క్రొన్నురువుల బోరన న్నగు నరపడుగు జిలుఁగుకంచుకంబున మించి వెలుపలం దోఁప మంచు గవిసిన రోహణమహీధరంబునుం బోలె రాజభవనాంగణంబుఁ జేర వచ్చె నంత నక్కడ. 71
- క. కాంతా కదంబకిసలయ
- కాంత కరావర్జ్యమాన కనక ఘటీని
- ర్వాంత సుగంధి జలంబుల
- నింతి జలకమాడి జిలుఁగు లిడి తడి యొత్తెన్. 72
- చ. తళుకు దుకూలశాటిఁ గటిఁ దాల్చి పటీర మలంది హారకుం
- డల మణిపారిహార్య రశనా కటకాంగుళిముద్రికాది భూ
- షలు తొడి పారిజాతవికసత్ప్రసవావళిఁ బూని యొయ్య న
- వ్వెలఁది వివాహవేది కలివేణులు దేఁ జనుదెంచె సిగ్గునన్. 73
- తే. ఇట గృహద్వారసీమకు నేఁగుదెంచు
- నా కుమారున కిందీవరాక్షుఁ డెదురు
- సని మరుత్కరి డిగ్గి వందన మొనర్చు
- నతని దీవించి హితమంత్రియుతము గాఁగ. 74
వ. భూసురాశీర్వాదనాదంబులు రోదసి నిండ నభ్యంతర గృహంబునకుం దోడ్కొని పోవునప్పు డప్పుడమిఱేఁ డెడనెడం బుణ్యాంగన లొసంగు నీరాజనోపచారమ్ము లాదరించుచుఁ గక్ష్యాంతరద్వార దేశంబుల మంగళార్థంబుగా నిడినపూర్ణ కలశ ముకురాది పదార్థంబులఁ గనుంగొనుచుఁ దోరణ స్తంభాయమానరంభా తరు కిసలయోత్తాలతాళవృంతానిలంబులఁ గుంతలంబులు చలియింప మంథరగతిఁ గింపురుష వృషభుం డగు గంధర్వరాజప్రధానుం డొసంగు కైదండ గొని యల్లనల్లన నడచి పురోహిత బ్రాహ్మణ బంధుపురంధ్రీసందోహనీరంధ్రం బయి వైవాహిక క్రియారంభ సంభార సంభ్రమద్రంభాది మరుద్రంభోరువుల కలికి నునుసోగ పలుకుల కలకలంబునం గొలగొల మను కౌతుకాగారంబు సొత్తించి. 75
- చ. ప్రభలు నభోవిటంకమున భానుమరీచులఁ బ్రోదిసేయఁగౌ
- స్తుభనిభ నూత్నరత్న పరిశోభిత మై గరుడాశ్మ వేది రు
- గ్విభవము పొల్పగుంజవిక విద్రుమపాద సువర్ణ పీఠిపైఁ
- బ్రభుత దలిర్ప మామ పనుపన్ వసియించె నుదంచితస్థితిన్. 76
- క. విధియుతముగ ఖచరుఁ దవ
- న్యధినాథున కొసఁగె బసిఁడిహరివాణమునన్
- మధుర మఖభుగ్గవీ దధి
- మధురస సంపర్క మయిన మధుపర్కంబున్. 77
- తే. అంచితాకృతి సాక్షాత్కరించినట్టి
- రమకుఁ బ్రతివచ్చు సుర మనోరమ మనోర
- మ యనుదాని ననుంగు జామాతఁ గైట
- భారి సరిఁగాగ నర్చించి దారవోసె. 78
- క. తదనంతరంబ హర్షము
- పొదలు మదిన్ మెట్టుఁబ్రాల పుట్టికలయెడం
- గదియం బట్టిన పెందెరఁ
- గదియించిరి బంధుజనులు కన్యావరులన్. 79
- ఉ. అప్పుడు తూర్యముల్ మొరయ నమ్మిథునమ్ము విలోకనస్పృహం
- దెప్పలఁదేల వంపఁబడు తెల్లని చీరతెరం గ్రమంబునం
- గొప్పు మొగంబు నఱ్ఱుఁ జనుఁ గొండలుఁ దోఁప లతాంగిపోలెఁ జె
- ల్వుప్పతిలన్ సుధారసపయోనిధి పెందెరఁ బుట్టు నిందిరన్. 80
- చ. కటకరవంబు బోరుకలఁగన్ రమణుల్ తెరచీర వంచినం
- దటుకున రాజుమో మెదుటఁ దారసమైన లతాంగి నేత్రముల్
- చటులత లజ్జఁ దల్లడిలె జాలరిచే వలఁ బాసి ధాత్రిపై
- నటు నిటు మిట్టిమిట్టి పడు నంబుచరంబులఁ బోలె నత్తఱిన్. 81
- మ. అవనీశ త్రిదశేంద్రు చూపుబరి కన్యా గండపాళిద్వయీ
- నవలావణ్యరసంబుఁ గొల్లగొని యంతం జెంత ఫాలంపురా
- జు విలోకించి చలించి కై కొనిన యా సొమ్మెల్ల ఘర్మాంబుకై
- తవ మొప్పన్ వెసడించి తూఱెఁ గబరీతాపింఛ కుంజాంతమున్. 82
- ఆ. రాజుచూడ్కి కపుడు రాజీవముఖిచూడ్కు
- లెదురుకొనియె లజ్జఁ గొదికి కొదికి
- జడిసి జడిసి జహ్ను సంభవాంభోవేణి
- కెదురు లెక్కు మీల కొదమ లనఁగ. 83
- మ. తనుమధ్యత్రివళుల్ నటింప నిలమీఁదన్ మట్టియల్ మోవఁగాఁ
- గనుపాపల్ పయిఱెప్పలం గదియ నుత్కంఠాగ్రయై నిక్కి నా
- థునిమౌళిం దలఁబ్రాలు వోసె నవలా దోర్మూలకూలంకష
- స్తనవిస్ఫూర్తికి సందిదండల ధళల్ సాహోనినాదం బిడన్. 84
- చ. ముడివడుకంకణ ప్రభల ముత్తెపుసేసలు దోయిలించి యె
- త్తెడుతఱి బాహుమూలకుచదీప్తులపైఁ బతిదృష్టి పర్వినం
- బొడమిన లజ్జఁ బాణియుగమున్ వెస వంచియె మౌళిమీఁదికై
- పొడవునఁ జల్లె లేనగవు పొల్తుక ఱెప్పల నప్పళించుచున్. 85
- క. సకల క్ష్మాపతి యిడఁ గొ
- మ్మ కచంబులనుండి రాలె మౌక్తికములు సా
- త్త్విక జనిత గండ ఘర్మాం
- బు కదంబాసార గరిమఁ బునరుక్తములై. 86
- క. పతి సతిపై నిడు ముక్తా
- వితతి పడం దొడఁగె వడి భవిష్యత్పురుషా
- యిత నిర్దయ రతి రభస
- చ్యుత సిత కబరీ ప్రసూన సూచక మగుచున్. 87
- శ. కట్టెన్ మంగళసూత్రమున్ శరధి శంఖ శ్రీలకున్ బొమ్మలం
- గట్టం జాలెడు కంఠపీఠి నిఖిల క్ష్మాభర్త శోణద్యుతుల్
- దట్టంబై నఖకోరకోత్కరము తద్గ్రైవేయ హైమ స్ఫుర
- త్పట్ట స్థాపిత పద్మరాగముల పంతంబుల్ విడంబింపఁగాన్. 88
- క. అట్టియెడఁ బెండ్లిపనులన్
- దిట్ట లగు పురంధ్రు లచట నిలిపిరి వహ్నిం
- బెట్టిరి మణిపీఠి సురీ
- పట్టముపైఁ బఱచి రందుఁ బతియును సతియున్. 89
- క. ఆశు ద్విజ హుత హరిత శ
- మీ శాఖా శకల నినద మేదుర విశదా
- భీశు జ్వాలా జాల హు
- తాశ క్రోడమున వేల్చి రాహుతు లెలమిన్. 90
- తే. తోయజామోద లాజలు దోయిలించి,
- ప్రమదమున వేల్వ నొకకొన్ని చెమటనంట
- వ్రేళ్ళు గనుపట్టెఁ గెంజాయ వీతిహోత్త్రు
- నాలుకలు సాటిరాకున్న నవ్వెననఁగ. 91
- తే. స్తనగుళుచ్ఛ వధూ దేహదాడిమీ ల
- తామతల్లికపై హోమ ధూమ మడరె
- భర్త కభిమత రతిమహా ఫలవిపాక
- మగుటఁ గోరి ఘటించుదోహద మనంగ. 92
- మ. జగతీనాథవతంస మానతశిరస్సమ్మేళనన్ నెయ్యపుం
- జగడంబుల్ ప్రియమొప్ప మాన్పెడుతఱిం జంచత్కిరీటాగ్ర ర
- త్నగణ స్పర్శసహంబు గావలసియో నాఁ గోర్కి దైవాఱ న
- మ్మగువం బాదతలంబు వట్టి సనెకల్ మట్టించె మోదంబునన్. 93
- క. కడునవ్వించుచుఁ జెఱఁగులు
- ముడివెట్టన్ బేరఁటాండ్రు ముదిత కనుబొమల్
- ముడివెట్టె నాలిసిగ్గున
- ముడివెట్టెన్ నారి చెఱకు మోసున మరుఁడున్. 94
- సీ. పరిణమించిరి ధరామరపురంధ్రీహస్త, ఘటిత చేలాంచల గ్రంథికలనఁ
- బరిపూర్ణనిష్ఠఁ గొల్చిరి ప్రదక్షిణపూర్వ, వినతి నాలుకలార్చు వేఁడివేల్పు
- వీక్షించి రుడువీథి నక్షీణ సుస్థితి, స్థాయిఁ దోషిత రమాధవుని ధ్రువునిఁ
- బరిణయప్రాప్త సప్తర్షి ప్రియాప్రేక్ష్య, సాక్షా దరుంధతీ సతి కెరఁగిరి
- తే. సకల సంయమిగణ నమస్కరణ కృత్య
- మాచరించి తదీయ హస్తాభిమంత్రి
- తాక్షితలు మౌళిఁ దాల్చి రత్యాదరమున
- దంపతులు బంధుకోటి కుత్సవ మెలర్ప. 95
దేవతలు కట్నములు చదివించుట
- ఉ. కూరిమి మంత్రితోడ నలకూబరుఁ డేకత మాడి పెద్ద బం
- గారపుఁ గోర గల్పవనికాజని కాంతములైన చీరలున్
- హార విభూషణావళియు నమ్మిథునంబునకుం బ్రియంబుతో
- నారదమౌనిచేత నదనం జదివించెఁ గుబేరుపేరుగాన్. 96
- క. కలిమి మెఱయంగ మఱియుం
- గల బాంధవులొసఁగి రపుడు కాంచన మణి భూ
- షలుఁ జీరలు నరపతికిం
- బొలఁతికి నుడుగరలు ముదము పొదలఁగ నంతన్. 97
- సీ. పొగడపూవంటి కంపుల మదాంబువులును, మధువర్ణ దంతశంబములు మెఱయ
- భీకర స్వర చారు బృంహితంబులు ఘనాం, గారకగ్రహ కాంతి కన్నులమర
- నిలఁ జుట్టువడు తొండముల మించు పూర్వాంగ, మెత్తరంబై పిఱుం దత్తమిల్లఁ
- గటము లుత్కటములై నిటలముల్ బటువులై, సిబ్బెంపు మొగముల నుబ్బుమీఱ
- తే. స్వర్ణ కక్ష్యాంకుశ ప్రాస శరధి శార్ఙ్గ
- ఖేట కుథ ఘంటకాద్యలంకృతులఁ జెలువ
- మెసఁగు గంభీరవేది భద్రేభ శతము
- నల్లునకు నిచ్చె గంధర్వ వల్లభుండు. 98
- శా. ఉర్వీజానికి మామ యిచ్చె శిఖిపింఛోద్భాసివర్ణంబుచే
- నర్వాచీనఘనాళి రోహితసహస్రాకీర్ణగా మింటఁ బూ
- షార్వస్తోమముఁ జిత్రయానముల నూటాడించు గాంధర్వగం
- ధర్వవ్యూహము దీప్తిచండమణికాండస్వర్ణసన్నాహమున్. 99
- క. తళతళని తరణి మెఱుఁగులఁ
- దలతల మను మణుల మెఱసి తలఁచినచోటన్
- నిలుచు విమానము ఖేచర
- కుల తిలకుఁడు కూర్మి పెండ్లికొడుకున కొసఁగెన్. 100
వ. మఱియు రజత మహారజత శయ్యాసన భాజన డోలా కలాచికా ఘట కటాహ వీటికాపేటికాది గృహోపకరణంబులును, మరకత కురువింద పురుషరత్న పురందరమణి మౌక్తికాది మహారత్న ఘటిత కటక తులాకోటి కంఠి కాంగ దైకావళీ కాంచి కోర్మి కాది కలాప కలాపంబులును, విచిత్ర పేశల కౌశేయ చీనాంబర ధట్టంబులం బెట్టినట్టి తెట్టియలును, నమూల్యాగరు మృగమద సంకుమద కుంకుమ పటీర కర్పూర హిమాంబు పూరంబులు దట్టుపునుంగు నగరుసత్తును మంచిగందవొడి చాఁ దుదయ భాస్కరంబు లోనుగాఁగల పరిమళ ద్రవ్య సంభార పరం పరలును, జవ్వనంపుఁ గ్రొవ్వున నివ్వటిల్లి మవ్వంపువాతెఱలు వివ్వ నవ్వు నునుసోగ వెన్నెలలంగలసి పిసాళించు చంచల దృగంచల ప్రభలం బచారించి, మెఱుంగుఁ జన్నులఁ గన్నెతమ్మి మొగ్గల వన్నె నటమటించి, పెన్నెఱుల మెఱుంగుఁదుమ్మెదవన్నెఁ దటమటించి, నెన్నడుముల విన్నువెన్నుదన్ని, బటువుమిగిలి విటనికాయంబు రాయిడింబడి పుట పుటనైన కూలంకషచాటువులమాటకారి తనంబు మెఱసి నాగరికపుఁ బనుల గరగరికల గళరవచ్ఛలాలాపా చరణంబుల రవణంబుల మిసమిసలఁ బస గలిగి మేలిమైన కులుకుల రసికజనంబుల మనంబుల మరులుకొలుపం జాలి సురు చిరాభరణ భూషితంబగు పరిచారికా సహస్రంబును గూఁతునకు నరణంబుగా నిచ్చి మఱియును. 101
- సీ. అవన తాంగుష్ఠాగ్ర హార్య నిర్య ద్రత్న, ఖని ఘనాంతరిత శృంగాటకములు
- ముద ముదావహదివ్య మైరేయ ధౌరేయ, గోత్రభి ద్విటపి నిష్కుట యుతములు
- మహిళాకదంబ డింభ గ్రాహ్య గృహచరన్, మృగనాభి సౌరభ్య నిర్భరములు
- ప్రఖరాఖు నఖర ధారా విదీర్ణోద్గీర్ణ, సౌవర్ణమృత్కీర్ణ జాంగలములు
- తే. కోక కలహంస ముఖరితాబ్జాకరములు
- సిద్ధ చారణ గంధర్వ సేవితములు
- మందర ద్రోణిఁ గొన్ని గ్రామములు కూర్మి
- తనయ పసువున కొసఁగె గంధర్వవిభుఁడు. 102
- తే. పౌరయాత్రిక సుర సిద్ధ చారణాహి
- యక్ష గంధర్వ సాధ్య విద్యాధరులను
- నిజపురంబుల కనిచె నిందీవరాక్షుఁ
- డుడుగర లొసంగి విభవంబు గడలుకొనఁగ. 103
వ. అనిన విని జైమినిమునీంద్రుండు మీఁదటి వృత్తాంతం బానతీయ వలయు నని యడుగుటయును. 104
ఆశ్వాసాంత పద్య గద్యములు
- మ. అతులక్షాంతిగభీర! భీరహితచిత్తాంభోజ! భోజక్షమా
- పతివిద్యాపరిపాక! పాకరిపుశుంభద్భోగ! భోగాశిప
- త్రితరస్స్ఫూర్త్యనుభావ! భావభరిత శ్రీకాంత! కాంతారపా
- తితకాళింగకులేశ! లేశతరవృత్తి క్షీణవైరివ్రజా! 105
- క. నాగాంబాసుత! జితకద
- నాగత మదనాగ సంగమానూప గృహా
- భోగా! భోగ పురందర!
- భోగీంద్ర శయాన పురుష పూజా ప్రవణా! 106
- మాలిని. సరభస జయసరభస జయధాటీ చండ వేదండకోటీ
- కరవమథు హిమానీ కంపితాశా వధూటీ
- పరమహిత హసంతీ భావ భాగ్భూరితేజః
- పరుష దహనకీలా ప్రస్ఫుర చ్ఛక్రవాళా! 107
గద్యము. ఇది శ్రీమదాంధ్ర కవితా పితామహ సర్వతోముఖాంక, పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర, నందవరపుర వంశోత్తంస, శఠకోప తాపస ప్రసాద సమాసాదిత చతుర్విధ కవితామతల్లికాల్లసాని చొక్కయామాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిషమనుసంభవం బను మహా ప్రబంధంబునందుఁ బంచమాశ్వాసము.
షష్ఠాశ్వాసము
షష్ఠాశ్వాసము
- శ్రీకృష్ణరాయ మనుజేం
- ద్రా! కాంతాపంచబాణ! నరసింహ ధరి
- త్రీకాంత గర్భ వార్నిధి
- రాకాహిమధామ! కర్పర దళ విరామా! 1
వ. అవధరింపుము. శకుంతంబు లబ్బాదరాయణాంతేవాసి కిట్లనియె. నంత నొక్కనాఁడు. 2
మనోరమా స్వరోచుల ప్రథమ రాత్రి
- సీ. పాండురప్రభఁ గ్రిందువడిన చీఁకటివోలె- జిగి నొప్పు నీలంపు జగతి మెఱసి
- యౌన్నత్యమున మ్రింగినట్టి నింగులు గ్రక్కు- కరణి ధూపము గవాక్షముల వెడల
- ధారుణీసతి సుగంధద్రవ్యములు దాఁచు- నరలపేటికవోలెఁ బరిమళముల
- నెలవు లై చెలువారు నిలువుల విలసిల్లి- కొణిగఁ బారావత కులము వదరఁ
- తే. బసిఁడినీట లిఖించిన ప్రతిమ లమర-నీఁగ వాలిన నందంద యెలుఁగు లొసఁగు
- నట్టి సకినలమంచము లాదిగాఁగ-మెఱయు పరికరముల నొప్పు మేడమీఁద. 3
- క. రమణునికడ కనుప మనో
- రమకున్ మజ్జనము దీర్చి రవరవ కచపిం
- ఛమునకుఁ గాలాగురుధూ
- పము వెట్టి జవాది నంటు వాపి నిపుణతన్. 4
- సీ. చెంగల్వపూదండ సేర్చి పెందుఱుముపై- ఘనసారమున సూసకము ఘటించి
- పన్నీటితోఁ గదంబము సేసి మృగనాభిఁ- బూసి కుంకుమ సేస బొట్టు తీర్చి
- విశదముక్తాదామ రశనఁ జందురకావి- వలిపపు వలువపై నలవరించి
- యఱుత వెన్నెలగాయు హార మొక్కటి వెట్టి- మణుల సొమ్ములు మేన మట్టుపఱిచి
- తే. కన్నుఁగవ గెల్చి డాకాలఁ గట్టె ననఁగ-ఘల్లుఘల్లునఁ బెండెంబు గండుమీలు
- గదల నల్లన నడపించి పొదివి తెచ్చె-నెచ్చెలుల పిండు యువతి నా నృపతికడకు. 5
- క. తెచ్చుటయుఁ గేళిభవనముఁ
- జొచ్చెనొ చొరదో యనంగ సుదతుల నీడం
- జొచ్చి పయిఁ గొప్పు దోఁపఁగ
- నచ్చేడియ తలుపుదండ నల్లన నిలిచెన్. 6
- క. తదనంతరంబ బోటులు
- చదురుల నగవులను బ్రొద్దు జరిగినఁ గేళీ
- సదనము నొక్కొక్క పని నెప
- మొదవఁగ వెడలుటయుఁ జిత్త మువ్విళ్ళూరన్. 7
- సీ. దట్టంబు నీ కట్టినట్టి చెంగావికి- బాగు గా దని కేలఁ బయఁట నిమిరె
- గోరంటొ? గోళ్ళనిక్కువపుఁగెంపో యని- చెయి పట్టి నయమున సెజ్జ సేర్చె
- నగరుధూపముచేత నయ్యో తనూవల్లి- సెక సోఁకెనని యెదఁ జెయ్యివెట్టె
- మృగనాభికా మకరికలఁ గప్రము మించె- నని మూరుకొనుచుఁ జుంబన మొనర్చె
- తే. హారమణు లిటు సూపు నా యఱుత నున్న-హారమణులకుఁ గాంతి నీ డౌనొ? కావొ?
- యనుచు నక్కునఁ గదియించు నా నెపమునఁ-గంపమును బొందు సతిమేను గౌఁగిలించె. 8
వ. అట్లు కవియం దమకించి త్రస్తరులఁ గుస్తరింప నింపు గలిగియుమునుమున్న మనంబునం బొడమి యుండు నడలప్పుడు తలంపునం బాఱిన సమర్థుండగు నతనిచే నది తీర్పించుకొనం గల యదియై నవోఢ గావున మాటలం దేటపడం జెప్ప శంకించి స్త్రీ స్వభావంబునం దొరఁగు కన్నీరు కంకణక్రేంకృతులు మీఱ గోరఁబాఱ మీటుచు నూరకయున్నం గనుంగొని యవనిపతిపుంగవుం డంతరంగంబునం జెంగలించు గౌతుకాంకురంబు కరఁగువడ వెఱఁగుపడి యుద్వేగ సమన్వితుండై సంభ్రమించుచుఁ జెక్కుటద్దంబులు నొక్కి కురులు చక్కం ద్రోయుచుం "దోయజాక్షి! యక్షయానంద సంధాయకం బగు నిట్టి క్రీడాసమయంబున వగపునకుం గారణంబేమి? నా యెడం గల్ల యేమేనియుం బాటిల్లదుగదా! యెవ్వరే మప్రియంబు గావించి రెఱింగింపు వారిన్ దండించెద, నేమి సాధింప వలయుఁ జెప్పుమది వేధచే నున్న సాధించెద మదీయంబులగు నర్థజీవితంబులు భవదధీనంబు, లుమ్మలిక యింత యేటి" కనుటయు నబ్బోటి గ్రేఁటుచు నిట్లనియె. 9
చెలికత్తెల దుస్థితికి మనోరమ పరితాపము9
- ఉ. అక్కట! నా యెడన్ మిగుల నక్కఱ గల్గి చరించు నెచ్చెలుల్
- చిక్కి మునీంద్ర శాపహతిఁ జెందిన దుర్దమ రోగబాధలం
- బొక్కుచు నున్నవారు వన భూములఁ, దద్దశ మాన్పవేని నా
- కెక్కడి సౌఖ్య? మన్నఁ దరళేక్షణఁ జూచి స్వరోచి యిట్లనున్. 10
- క. పరితాప మింక నేటికి?
- హరిణాక్షి! మదీయ సంచితాయుర్వేద
- స్ఫురణమునఁ బరిహరించెద
- నరు దనఁగ భవత్సఖీజనామయ భరమున్. 11
- క. నా వెనుక రమ్ము, నీ సఖు
- లే వనమున నున్నవార? లిపుడ చికిత్సం
- గావింతు ననుచు రయమున
- నా వనితఁయు దాను నచటి కరిగి యొకయెడన్. 12
స్వరోచి విభావసీ కళావతుల రాజయక్ష్మను నివారించుట
- ఉ. ఆ రజనీశబింబ రుచిరాస్యలఁ గాంచి తదామయవ్యథా
- భారము మాన్పఁగాఁ దమి నృపాలుఁడు తత్కల ధౌత గోత్రకాం
- తారపదంబునం దుపచితం బగు మందును దత్క్రియోచితా
- హారము నెమ్మి నిచ్చుచు ననామయధన్యలఁ జేసి పన్నెగాన్. 13
- శా. ఆ దివ్యౌషధరాజిచేఁ దమమహా వ్యాధివ్యథల్ దీఱినన్
- మోదంబంది లతాంగు లంబుజకులంబున్ నవ్వుకందోయితో
- సౌదామి న్యభిరామ దేహరుచితో సంపూర్ణ చంద్రానన
- శ్రీదర్పోన్నతితోఁ జెలంగి సురనారీసూనుఁ గీర్తించుచున్. 14
- క. మా కుపకార మొనర్చితి
- నీకుం బ్రతిసేయ నెట్లు నేరుతు? మైనన్
- లోకోత్తర! మా వలనను
- జేకొనుకార్యములు గలవు చెప్పెద మెలమిన్. 15
తనవలన మృగపక్షి భాషాజ్ఞానము నెఱిగిఁ, తన్ను వివాహ మాడుమని విభావసి కోరుట
- క. మును మాదగు వృత్తాంతము
- వినిపింపఁగ వలయు నీకు విశ్రుతముగ భూ
- వినుత! విను మనుచు నం దొక
- వనజేక్షణ పలికె మధుర వాగ్జితశుకియై. 16
- తే. అనఘ! మందార విద్యాధరాత్మభవను
- నను విభావని యండ్రు గంధర్వవరులు
- తెలిసియుండుదు నిమ్మహీతలమునందుఁ
- బరఁగు మృగపక్షిజాతుల భాషలెల్ల. 17
- క. అమ్మేటివిద్య నాచే
- నిమ్ముగ నంతయు నెఱింగి నృప! నన్ను వివా
- హ మ్మగు మనవుడు రెండవ
- కొమ్మ మదిం బ్రేమ గడలుకొన నిట్లనియెన్. 18
- ఆ. పారుఁ దనఁగ బరఁగు బ్రహ్మర్షి మా తండ్రి
- యతఁడు విద్య లెల్ల నభ్యసించి
- తపము నిచ్చఁ జేయఁ దలపోసి కీర భృం
- గాళి రమ్యమైన యాశ్రమమున. 19
- మ. ఫలమూలచ్ఛదనాంబు భుక్తిఁ బవనాభ్యాసక్రియాయుక్తి ని
- ర్దళితాంతర్గత శాత్రవ ప్రకర జాగ్రద్గర్వ సర్వస్వుఁడై
- చలికిన్ వానకు నెండకున్ మన మనుత్సాహంబు గానీక కం
- దళితానందమునన్ ముకుంద చరణ ధ్యానావధానంబునన్. 20
- క. అంగుష్ఠము నిల మోపి ప
- తంగునిపైఁ జూపు సాఁచి ధగధగ లర్చి
- స్తుంగత నింగులు నాకెడు
- నింగలములు నాల్గుదెసల నిడుకొని కడఁకన్. 21
- క. సుర గరుడ యక్ష రాక్షస
- నర కిన్నర సిద్ధ సాధ్య నాగోత్కర మి
- ట్లరు దనఁగఁ దపమొనర్చెం
- బురుహూతుఁడు దాననాత్మఁ బొడమిన భీతిన్. 22
- క. తనయొద్దఁ బుంజికస్థల
- యను నచ్చర లేమ యున్న నమ్మునికడకుం
- జనుమని యనిపినఁ బతి శా
- సనమున వని కేఁగుదెంచె సంభ్రమలీలన్. 23
- చ. చిలుకలు ముద్దుఁ బల్కులకుఁ జేరఁగ రా నెఱివేణి కాంతికిన్
- మలయుచుఁ బై పయిన్ మధుపమాలిక వాయక సంచరింపఁగా
- నలస విలాస యానమున నమ్మునిపాలికి వచ్చె వేల్పుఁదొ
- య్యలి నునుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యనన్. 24
వ. ఆ సమయంబున. 25
- చ. అనువగు సుళ్ళ నొప్పు మలయానిలవాహము నెక్కి తేంట్ల న
- ల్లిన నిడువాగెఁ బూని లవలీ నవవల్లిక లెమ్మెసొమ్ములై
- పనుపడఁ జెట్లు వట్టి మను ప్రాఁతదళమ్ములతోడఁ దోలె నా
- మనిదొర మంచురాజు మడిమంచగఁ గోయిలగంట మ్రోయఁగన్. 26
- సీ. సొన దేఱి పొటమరించి నెఱెవాసినయట్టి-యాకురాలుపు గండ్లయందుఁ దొఱఁగి
- యతిబాల కీరచ్ఛదాంకురాకృతిఁ బొల్చి-కరవీర కోరక గతిఁ గ్రమమున
- నరుణంపు మొగ్గలై యర విచ్చి పికిలి యీఁ-కల దండలట్లు గుంపు లయి పిదప
- రేఖ లేర్పడఁగ వర్ధిలి వెడల్పయి రెమ్మ-పసరువాఱుచు నిక్కఁ బసరు కప్పు
- తే. పూఁటపూఁటకు నెక్కఁ గప్పునకుఁ దగిన-మెఱుఁగు నానాఁటికిని మీఁద గిఱిగొనంగ
- సోగయై యాకు వాలంగ జొంప మగుచుఁ-జిగురు దళుకొత్తెఁ దరులతా శ్రేణులందు. 27
- క. హిందోళంబునఁ బాడిరి
- బృందారకసతులు విరహి బృందార్తిగఁ ద్రేఁ
- చెం దేఁటులు వాసంతిక
- విందునఁ బికశిశువు దాది వెడలం దోలెన్. 28
- సీ. చలిగాలి బొండు మల్లెల పరాగము రేఁచి-నిబిడంబు సేసె వెన్నెలరసంబు
- వెన్నెలరస ముబ్బి వెడలించె దీర్ఘికా-మంద సౌగంధిక మధునదంబు
- మధునదం బెగఁబోసె మాకందమాలికా-క్రీడానుషంగి భృంగీరవంబు
- భృంగీరవం బహంకృతిఁ దీఁగె సాగించెఁ-బ్రోషిత భర్తృకా రోదనముల
- తే. విపినవీథుల వీతెంచెఁ గుపిత మదన-సమదభుజ నత సుమ ధనుష్టాంకృతములు
- సరస మధుపాన నిధువనోత్సవ విలీన-యువతి యువకోటి కోరికల్ చివురు లొత్త. 29
- క. అత్తఱి మురిపపునడఁ జెలి
- కత్తియగమి గొలువ మృదుల కలభాషలఁ ద
- ళ్కొత్తెడు వెడనగవులతోఁ
- జిత్తభవుం డార్వ ననలు చిదుము నెపమునన్. 30
- చ. అలకని జీబులోఁ గుసుమ మద్దినపావడ దోఁపఁ గొప్పు చెం
- గలువలవల్పుఁ జన్నుఁగవ కస్తూరితావియుఁ ద్రస్తరింప నం
- దెలరొద మీఱఁ బెన్నిధిగతిన్ వ్రతికిం బొడకట్టె వేల్పుఁ దొ
- య్యలి చిఱుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యనన్. 31
- తే. అత్తెఱంగున నదిరిపా టారజంపు
- వన్నెఁ బొడకట్టి తాఁ బాడు సన్నరవళి
- పాట లళిఝంకృతిశ్రుతిఁ బాదుకొనఁగఁ
- జూడకయ చూచు చూపుతో సుడియుటయును. 32
- చ. తలకొని దాని తమ్ములపుఁ దావియు మోవియుఁ గౌను మేను న
- గ్గలపుమెఱంగు లీను తెలిగన్నులుఁ జన్నులు భృంగమాలిక
- న్గెలిచిన యారుతీరుఁ దగు నెన్నడలుం దొడలున్ వివేకముం
- గలఁపఁగఁ గాంచి పంచశర కాండ విఖండిత ధైర్యసారుఁడై. 33
- క. మేను గరుపాఱఁ దమి న
- మ్మౌని జపముఁ దపముఁ దన్ను మఱచి యనంగ
- గ్లానిఁ బడి కదిసి వడఁకుచు
- హీనస్వర మెసఁగఁ బ్రోవవే న న్ననుచున్. 34
- తే. చెయ్యి పట్టినమాత్రాన శిరసు వంచి
- యవశచందానఁ బైవ్రాలు నవ్వధూటిఁ
- బర్ణశాలాంతరముఁ జేర్చి బ్రాహ్మణుండు
- కెరలు కోర్కులఁ గందర్ప కేళిఁ దేలె. 35
- క. తప మంతయుఁ బొలివోవఁగ
- నపు డన్నియు నుజ్జగించి యయ్యంగనతోఁ
- దపసి మనోజ క్రీడా
- విపులైశ్వర్యంబు లనుభవించుచు నుండెన్. 36
- క. ఈ రీతిఁ గొంతకాలం
- బారామ మహా మహీధరారణ్యములం
- దా రామ వలలఁ దగిలి వి
- హారము సలుపంగ గర్భమై తఱి యగుడున్. 37
- క. అంత ననుఁగాంచి యది విపి
- నాంతరమునఁ బాఱవైచి యరిగెఁ, గృపార్ద్ర
- స్వాంతుఁ డగు సంయమీంద్రుఁడుఁ
- జింతింపకపోయె నేమి చెప్పుదు నధిపా! 38
వ. అట్లు వైచి చనుటయు నాఁకటం గటకటం బడుచుండి తీండ్రించు శశిమండలంబున వెడలు శిశిరకిరణప్రణాళికామిళదమృతరసగ్రాసంబునం జేసి కొన్ని పూఁటలం బుటపుటనైన నన్నుంగనుంగొని మునీంద్రుండు ప్రియం బంది నిజాశ్రమంబునకుం గొని చని శశి కళా సంవర్ధిత నగుటంజేసి నాకుం గళావతి యను నామం బిడి పెనుచుచుండ నేనును జనక సేవాపరతం బ్రవర్తిల్లు చుండునంత. 39
- ఉ. ఆ సమయంబునం బొగులు చాఁకటిపెల్లున నంతకంతకున్
- గాసిలి పైపయిన్ వదన గహ్వర మెండఁగ నేడ్చి యేడ్చి యే
- మాసయుఁ గాన కంతఁ దుహినాంశుఁడు దోఁచినఁ దత్కళారస
- గ్రాసవిధిన్ శరీర మమరంగ భజించితి దైవికంబునన్. 40
- సీ. ఏ నవ్విధంబున మేను వెంచుచు నుండ-నా చంద మంతయు నాత్మ నెఱిఁగి
- కడు సంభ్రమమున నక్కడకు నేతెంచి యిం-పెసఁగ మైనిండిన కసటు దుడిచి
- తనయురంబునఁ జేర్చుకొని పోయి యాశ్రమ-స్థలమున నిజపర్ణశాల నునిచి
- విధుకళాంశాహార విధి వసించితిఁ గాన-నాకుఁ గళావతీ నామ మొసఁగి
- తే. నయము మీఱంగఁ బెనుప నానాఁటఁ బెరిఁగి-శైశవము మాని యౌవనోత్సవముఁ జెంది
- జనకునేమైన నడుగుచు సంతతంబు-నోపి శుశ్రూషచేయుచు నున్నచోట. 41
- క. ఎవ్వరు చూచినఁ జూపులఁ
- జివ్వకుఁ బద నడఁగి నడచు సిగ్గున నొఱపై
- రవ్వకు మొదలగు పాపపు
- జవ్వన మెదిరించె జిగి యెసఁగ నా మేనన్. 42
- శా. ఆ వేళం బొడగాంచి ఖేచరుఁ డొకం డాసక్తి దేవాసిసం
- జ్ఞావంతుండు సభాంధవుం డగుచు నిశ్శంకన్ ననున్ వేఁడువాఁ
- డై వాచంయముఁ డగ్ని కార్యనిరతుండై యున్నచోఁ బర్ణశా
- లావాసంబున కేఁగుదెంచి నిజభావాకాంక్ష సూచించినన్. 43
- సీ. శిఖిపించదళ పరిష్కృతములై సేమంతి, విరుల తీరగు శిరో వేష్టనములు
- నెఱగంటిచూడ్కిఁ దాయెతుల బాహులు వంచి, నారాజు లల్లార్చు నారజములుఁ
- గాదంబరీ గంధగర్భంబులై వల్చు, ఘనసార మిళ దాస్య గంధములును
- దరహాసములఁ దోఁచు తాంబూల సేవాంధ, కారితాధర రద క్షతుల యొఱపుఁ
- తే. జిగులుగందంపుఁ బూఁతలు జిహ్వికలకు-ననుపు నెఱవాది బంటు పంతపుఁ బదరులు
- ఘన మగు జుగుప్స వెనుప నజ్జనముఁ జూచి-ఋషి మనంబునఁ గడు నసహ్యించుకొనుచు. 44
- శా. ఆహా! ధన్యుఁడ గడు నైతి, మ ద్విమలవంశాచార విద్యా తప
- శ్శ్రీ హోమాదులు నేఁడుగా తుది ఫలించెన్, నాగవాసంబు మ
- ద్గేహక్షోణికి బిడ్డ వేఁడుటకు నేతేఁ గాంచుటన్ బ్రాహ్మ్య మిం
- కోహో! చాలుఁ బొకాలిపోయెదరొ! పోరో! నోటిక్రొవ్వేటికిన్? 45
- క. మీ తరమువార లేతఱి
- నేతరితనమునఁ దపస్వి గృహకన్యకలన్
- వీత భయ వృత్తి వేఁడిరొ
- కో! తముఁ దర్కింప కౌర! క్రొవ్వు లటంచున్. 46
- క. వసుధేశ! ముక్కు డుస్సిన
- పసరము క్రియఁ గెరలి తిట్టెఁ బక్కున ఋషి వా
- రుసురు మని వెడలిపోయిరి
- ముసలి గదా! పుట్టినిల్లు ముఖ్యోష్ణతకున్. 47
వ. అట్టి యెడం దన మనోరథంబు విఫలం బగుటకుఁ గ్రోధాంధుండై న న్నభిలషించు గంధర్వుం డిట్లనియె. 48
- శా. నీ వైశిష్ట్యము తిట్టులన్ మెఱయునే నీకంటె నేఁ దక్కువే?
- యీవేఁ గన్యక నీవు గాక మఱి మద్వృత్తాన్వయాచారముల్
- నీవా పేర్కొనుపాటివాఁడ? విలఁ గానీ నిల్తుగా కేమి? పో
- పో విప్రాధమ! నిన్నుఁ బోల నిఁక నల్పుల్ లేరు దంభవ్రతా! 49
- తే. అనుచుఁ బగ చాటి పోయి, నాఁడర్థరాత్ర
- సమయమున శస్త్రనిహతి మజ్జనకుఁ జంపె
- నట్ల యగుఁ గాక పుడమిఁ గామాంధచిత్తుఁ
- డెవ్వరి వధింపఁ? డెటు సేయఁ? డేమి గాఁడు? 50
- తే. అపుడు మెడఁగోయ ముని రోఁజు టాలకించి
- మేలుకొని దివ్వె యిడి సంభ్రమించి యేడ్చు
- నన్నుఁ బొదివిరి పొరుగిండ్ల నున్న తపసు
- లా దురాచారుఁడును బాఱె నటకు మునుప. 51
వ. అంతం దెలతెల వేగుటయుఁ బ్రభాతసమయంబున. 52
- క. ధారాళ క్షత జోక్షిత
- ఘోర జరా ధవళి తోరు కూర్చముగఁ గరా
- చూరిని మెడ తెగి యుటజా
- గారంబునఁ బడిన మూఁడుగాళ్ళ ముసలికిన్. 53
- ఆ. అగ్ని యిచ్చి యకట! యాబాల్యముగ నన్నుఁ
- బెనిచెఁ దల్లి వైచి చనిన పిదపఁ
- దానె తల్లిమాఱు నై నెమ్మి నట్టి మ
- జ్జనకుఁ డీల్గె నేటి మనికి? యనుచు. 54
- క. వందురి వగలన్ దేహము
- పొం దెడలఁగ జూచు నన్నుఁ బొడగని దివిఁ దా
- నెందుల కేఁగుచునో గిరి
- నందన దిగి వచ్చి కరుణ నా కిట్లనియెన్. 55
- మ. అతిసౌందర్యనిశాంత మీతను వలభ్యం బిట్లు శోకాతురా
- న్విత వై దీనిఁ దొఱంగఁగా దగునె తన్వీ! చాలు నీసాహసం
- బతిలోకుండు స్వరోచి నీకుఁ బతి యౌ నారాజుఁ జేపట్టి య
- ప్రతిమశ్రీవిభవంబుఁ గాంచెదవు నాపల్కొండుగా నేర్చునే? 56
- స్వరోచి కళావతినుండి పద్మినీ విద్యను గొనుట
- క. విను మదియుఁ గాక పద్మిని
- యనఁ బరఁగిన విద్య నేఁ బ్రియంబున నిత్తున్
- గొను నీవు తత్ప్రసాదం
- బున నీకు నభీష్టసౌఖ్యములు సిద్ధించున్. 57
వ. అని రహస్యంబుగా నవ్విద్య నాకు నుపదేశించి ముక్కంటి వాల్గంటి మింటిచొప్పునం జనియె. నేనును దద్వచనామృతా స్వాదనంబ యూఁతగాఁ బ్రాణంబులు వట్టుకొని యున్నదాన. నా స్వరోచి నీవ కాఁ దలంచెద, వంచనాలాపంబు లుడిగి య ప్పద్మినీ విద్యారత్నంబుతోఁ గూడ నన్నుం బరిగ్రహింపు మనిన నంగీకరించి య మ్మహీవిభుండు. 58
విభావసీ కళావతులకుఁ బెండ్లి యగుట
- క. ఏకాగ్రత నవ్విద్యలు
- గైకొని పుణ్యాహపూర్వకంబుగ గుణ ర
- త్నాకరుఁ డయ్యిద్దఱ న
- స్తోకోన్నతిఁ బెండ్లియయ్యె సుముహూర్తమునన్. 59
- ఉ. ఆ సమయంబునన్ మొరసె నభ్రపథంబున దేవదుంధుభుల్
- సేసలు చల్లి రచ్చరలు సిద్ధనికాయము చేరి సన్నుతుల్
- సేసెఁ బ్రసూనవృష్టి గురిసెన్ జన రంజన కారి వాసనో
- ల్లాసములై చెలంగె శుభలక్షణ దక్షిణ గంధవాహముల్. 60
- క. ఈ విధమున నుద్వాహం
- బై వేలుపువెలఁదిపట్టి యంచిత మతి న
- ప్పూవుంబోఁడులు మూవుర
- తో వివిధ విహార సంగతులఁ దత్పరుఁడై. 61
స్వరోచి భోగపరత, హంసీచక్రవాకుల విమర్శ
- సీ. గంగాతరంగిణీ రంగత్తరంగ శీ, కర శీత సైకతోత్కరములందు
- మందార మాకంద మకరంద తుందిలేం, దిందిరానందకృన్నందనములఁ
- గాంత నిశాకాంత కాంత వితర్దికా, క్రాంత భూభృద్బృంద కందరముల
- మసృణ బిసాహార మాంసల హంసికా, సంసదాసార కాసార తటులఁ
- తే. దమక తమక ప్రియుం డని తమక మెసఁగఁ-బడఁతు లుప్పొంగఁ గ్రీడించెఁ పద్మినీ ప్ర
- భావ ఘటితాన్నపాన భూషా విశేష-మాల్య వస్త్రానులేప సామగ్రిఁ జెంది. 62
- మ. అరవిందాక్షులుఁ దాను నిట్లభిమత వ్యాపారముల్ సల్పుచున్
- ధరణీశుం డొకచోటఁ గాంచె లఘు శీత స్వచ్ఛ వాఃపూరమున్
- వర కీరవ్రజ చంచు పాటిత తట వ్యాకీర్ణ మందార కే
- సర మాకంద వినిస్సరత్ఫల రసాసారంబుఁ గాసారమున్. 63
- క. కని తత్తటస్థలంబున
- ననుమతి విహరించె సవిధ హరిహయ వర నం
- దన నందన హరిచందన
- వన పవనార్భక వినోద వశగతుఁ డగుచున్. 64
- ఉ. అందొక యంచలేమ గహనానిల సంచల దూర్మి మాలికా
- మంద విహార సౌఖ్యమున మత్తిలి దవ్వుల నున్న చక్రవా
- కిం దగఁ జేరఁ బిల్చి పరికించితె! యెంతతపం బొనర్చి రీ
- యిందునిభాస్యలుం బతియు నేకమతిం గవగూడి యుండఁగాన్. 65
- క. మెలఁతకుఁ బతిపై నైనను
- మెలఁతుకపైఁ బతికి నైన మేలగు టెందుం
- గలయది మెలఁతకుఁ బతికిన్
- వలపు సమం బగుట జన్మవాసన చెలియా! 66
- ఉ. కావున వీరియందు నధికం బగు కూరిమి గల్గియుండు నీ
- భూవలయాధినాథునకుఁ బొల్పుగ నీవిభునందు నగ్గలం
- బీ వనజాయతాక్షులకు నిచ్చఁ బ్రియం బది గానఁ బూవునుం
- దావియుఁ బోలెఁ జాలఁ బ్రమదం బొనరించిరి నాకు నెచ్చెలీ! 67
వ. అని పలుకు నమ్మరాళలోలనయన పలుకు లాలంబుచేసి చక్రవాకి యిట్లనియె. 68
- చ. ముదమున నిమ్మహీశుఁ డొక ముద్దియ చూడఁగ, నొక్కకాంతతో
- సదమదమై కడంగి రతి సల్పుట తెల్లమిగా నెఱింగియున్
- మది వివరించి రోయ కభిమానము దక్కిన వీరి కూరుముల్
- వదలక పెద్ద సేసెదవు వందిగతిం, దగ వీ విచారముల్. 69
- చ. పలువురయందు నొక్కనికి బ్రాఁతియు నొక్కనియందుఁ జూడ న
- గ్గల మగు ప్రేమ పల్వురకుఁ గల్గుట యద్భుత, మట్లుగాన ని
- వ్వెలఁదులయందుఁ గూర్మి పస వీనికి నేమియు లేదు వీనియం
- దలవడఁ గల్గదీ జలరుహాక్షులకుం బ్రియ మెవ్విధంబునన్. 70
- క. మనుజేశుఁడు కొలిచిన పరి
- జనములతో నిష్టగోష్ఠి సలిపెడిచో నె
- ట్లనురాగ మట్ల కూరిమి
- వనితలు పెక్కండ్రయం దవశ్యము పతికిన్. 71
- క. ఈ నెలఁత లీమహీశు న
- హీనగతిం దగిలిరేని నితఁ డొక లేమం
- దా నెలమిఁ గూడునెడ నే
- మానిని ప్రాణేశుమీఁది మమత మెలంగున్? 72
- క. కావున దాసీనికరము
- కైవసమై సంచరించు క్రమమున విద్యా
- ప్రావీణ్యవైభవోన్నతి
- చే వచ్చిన వారి వీరిఁ జెప్పకు మింకన్. 73
- ఆ. తగులు నెవ్వఁడొక్క తరుణికి నొకనికి
- మెలఁత వలచు నదియ మే లనంగ
- వచ్చుఁ గాని పెక్కు వనితలపైఁ గూర్మి
- గలుగు ననుట బొంకు గాదె తరుణి! 74
- చక్రవాకి విమర్శ విని స్వరోచి సిగ్గుపడుట
- చ. పలుకులు వేయు నేమిటికి? భాగ్య సమన్విత నేన మద్విభుం
- డిలఁ గలధన్యుఁడంచు నెలుఁగెత్తి వరూధినిపట్టి ముందటం
- బలుకు రథాంగమానవతి పల్కు లతం డిల జంతు మండలీ
- విలస దశేషభాషలఁ బ్రవీణుఁడు గాన నెఱింగి సిగ్గునన్. 75
- క. తల వాంచి యుస్సురని మదిఁ
- దలపోయుచు మానరాని తమకంబున నా
- నెలఁతలతో నూఱేఁడులు
- విలసితగతి సౌఖ్య మనుభవించుచు నెలమిన్. 76
హరిణము స్వరోచిని గర్హించుట
- శా. కాంచెన్ భూవిభుఁ డొక్కనాఁడు కనకాఖర్వ ప్రభా మంజులా
- స్యాంచన్మేచకరత్న విభ్రమ సనాథానూన దృగ్రోచులన్
- మించుం బ్రాయపు లేటిపిండు తనుఁ గూర్మిం జుట్టిరాఁ దద్వనో
- దంచద్భూమిఁ జరించు నొక్కహరిణోత్తంసంబు నింపారఁగాన్. 77
- క. కని సతులకుఁ జూపెడు తఱి
- ఘనముగఁ దమచెవుల వాలుఁ గన్నులు సోలన్
- మొనసెలవి యెత్తి ప్రియునా
- ననమున్ మూర్కొనుచు నఱ్ఱు నాకెడువేళన్. 78
- శా. హుంకారం బొనరించి వే తలఁగు డోహో! నేను స్వారోచినే
- పంకేజాక్షులతోడ నెల్లప్పుడు దర్పస్ఫూర్తిఁ గ్రీడింప? ల
- జ్జాంకూరం బడఁగించినారు తలపోయన్ నాకు రోఁతయ్యె మీ
- రింకన్ బోయి వరింపుఁ డొక్కరుని భోగేచ్ఛన్ నివారించితిన్. 79
చ. బరువన కింతులం దనకుఁ బల్వుర గూర్చుట భోగవాంఛఁగా కరయఁగ నొండు గాదు ధన మన్న ధ్రువంబుగ నంగనాజనో త్కరసముపార్జితం బటులు గావున వీనికి లే దిహంబునుం బరమును నన్ను నట్ల పఱుపం బనిలే దిది చెప్ప నేటికిన్. 80
- క. వీని విధంబున వనితా
- ధీనుఁడ నై పెంపు దక్కి తిరుగుచు నుండం
- గా నే వెఱ్ఱినె! తమకము
- మాని చనుం డన్న నవియు మసలక చనియెన్. 81
- స్వరోచికి వైరాగ్యోదయము
- క. ఈ కరణిఁ దూఱ నాడిన
- యా కృష్ణమృగంబు పల్కు లట మున్నుగ న
- క్కోకసతి యన్న మాటలు
- నేకంబై తన మనంబు నెరియం జేయన్. 82
- ఉ. అరయ నిట్టిరోఁతలకు నాలయముల్ జలజాక్షు లేటికిన్
- వీరలతోడిసంగ మిఁక వీడెద నంచుఁ దలంచి తోన దు
- ర్వారములైన కోరికల వంక వివేకము చొప్పు దక్కి యిం
- పారఁగ నాఱునూఱు సురహాయనముల్ చరియించెఁ గ్రమ్మఱన్. 83
వ. తదనంతరంబ క్రమక్రమంబున మనోరమయందు విజయుండును విభావసియందు మేరునందనుండును, కళావతియందు విభావసుండును నను నందనులం గాంచి పద్మినీ విద్యాప్రభావంబునం బాకశాసన దిశాముఖంబున విజయునకు విజయాఖ్యపురంబును, గిన్నరేశ్వర హరిదంతంబున మేరునందనునకు గంధవతి యను పుట భేదనంబును, దక్షిణంబున విభావసునకు ధారాహ్వయోదార మహా నగరంబునుం గల్పించి యనల్ప విభవంబున నక్కుమారుల నప్పట్టణంబులకుఁ బట్టంబుగట్టి కృతార్థుండై యొక్కనాఁడు. 84
- ఉ. శాసితశత్రుఁ డానృపతిచంద్రుఁడు తూణధరుండు సజ్య బా
- ణాసన పాణిపంకజుఁడు నై మృగసంఘములెల్లఁ బెల్లు సం
- త్రాసము నొందఁ గ్రూరత నరణ్యమునన్ మృగయా కుతూహలో
- ల్లాసమునం జరించెఁ జల లక్ష్యవిభేద విధావధానుఁడై. 85
వ. ఆసమయంబున. 86
- క. కుటిల కృశ సాంధ్య రజనీ
- విట కోరక కోమల చ్ఛవి స్ఫుటదంష్ట్రో
- ద్భట పోత్ర ఖనిత్రాగ్ర
- స్ఫుటితవనీధాత్రి నొక్క పోత్రిం గనియెన్. 87
- సీ. జంభారిభిదుర సంరంభంబు వీక్షించి, జరుగు నంజన మహాశైల మనఁగ
- ఝంఝా ప్రభంజ నాస్ఫాలనంబున కుల్కి, యరుగు సంవర్త కాలాభ్ర మనఁగఁ
- గఠిన కంఠేకాలకంఠమూలము వాసి, వెస వచ్చు నుజ్జ్వల క్ష్వేళ మనఁగఁ
- గలుష ధూర్వహ ఖలోత్కరముపైఁ బఱతెంచు, దండధర క్రూర దండ మనఁగ
- తే. ఘుర్ఘురారావ సంఘాత ఘూర్ణమాన-సప్త పాథోధి పాథః ప్రచండ నక్ర
- తిమి తిమింగిల మగుచు నభ్రమును మహియుఁ-గ్రమ్ముకొని వచ్చు నొక యేకలమ్ముఁ గనియె. 88
హరిణీ రూపమున వచ్చిన వనదేవత స్వరోచిని బ్రసన్నుని జేసికొనుట
- మ. కని మౌర్వీ నినదంబు సేయుచు భుజంగ క్రూర నారాచముం
- దన దోర్దండ కృతాంతదండనిభ కోదండంబునం గూర్చి బో
- రన నేయం దమకించుచుండ నొక సారంగాంగనారత్న మ
- జ్జన నాథాగ్రణిఁ జేరి పంచజన భాషాప్రౌఢిమై నిట్లనున్. 89
- క. నృప! యీ క్రోడము నీకే
- యపకారము సేసె? దీని కలుగఁగ నేలా?
- కృప మదిఁ జొనుపక నాపై
- నిపు డీ శర మేసి నిగ్రహించుట యొప్పున్. 90
- క. అని పలుక నతఁడు నీ వీ
- తనువుపయిన్ రోయ నేల? తద్దయు గృశమై
- యునికియుఁ గాదు గదా! చెపు
- మనవుడు నా హరిణి పల్కె నవనీపతికిన్. 91
- ఆ. అన్యసతులయందు నాసక్తుఁ డగువానిఁ
- దమక మొదవి కూఁడ దలఁచుకంటె
- మరణ మైన మేలు మది వితర్కింపంగ
- ననుచుఁ బలుకుటయును నవనివిభుఁడు. 92
- క. తావకహృదయం బెవ్వని
- పై వదలక నిలిచె నీదు భావము తెలియం
- గా వలయుఁ జెప్పు మన్న ధ
- రావల్లభుతోడ హరిణి క్రమ్మఱ ననియెన్. 93
- చ. చెదరక నామనంబు నృపశేఖర! నీ యెడ నిల్చి మన్మథ
- ప్రదర పరంపరా విహతి పాల్పడి వ్రేఁగెడు నట్లుగాన నా
- యద టడఁగింపు మన్న హరిణాంగన వీవు నరుండ నే ముదం
- బొదవఁగ నీకు నాకు మిథునోచితకృత్యము లెట్లు చేకుఱున్. 94
- క. నావుడు నను నాలింగన
- మీ వనురాగమునఁ జేయు మింతియ చాలున్
- భూవర! యన్నఁ గృపార్ద్రుఁడు
- గావున నా నృపతి హరిణిఁ గౌఁగిటఁ జేర్చెన్. 95
వనదేవతా సౌందర్యాభివర్ణనము
- సీ. వల్లీమతల్లి లావణ్య సర్వస్వంబు, విమలాంగ రేఖ నావిర్భవింప
- మంజుల మంజరీ మహిత సౌభాగ్యంబు, పరివృత్త కుచవృత్తిఁ బరిణమింపఁ
- బల్లవచ్ఛద చారు భావానుభావంబు, మృదుహస్తలీల మూర్తీభవింపఁ
- రమణీయ ముకుళ విభ్రమ భాగధేయంబు, కరరుహ స్ఫూర్తి సాక్షాత్కరింపఁ
- తే. జేసి మృగియై వహించు నక్షిద్వయంబు-భాసురంబుగఁ దన యంకపాళిలోన
- మించుక్రొమ్మించు నుపమించు మెలఁత యగుచు-నిలుచు నవ్వనదేవత నృపతి సూచి. 96
దేవతల పంపున వనదేవత స్వరోచితోఁ గ్రీడించుట
- క. పూనిన విస్మయ రసమున
- మానిని! మృగివై చరించి మఱి యంగనవై
- కానంబడితివి చిత్రం
- బే నెన్నఁడు నెఱుఁగఁ జెప్పవే! తెలియంగన్. 97
- సీ. నావుడు నమరకాంతాతనూభవుఁ జూచి, యివ్వన దేవత నే నరేంద్ర!
- సకల భూభువన రక్షాదక్షు మనువర్యు, నీ యందుఁ బడయు నెన్నిక సమస్త
- దివిజులు నన్నుఁ బ్రార్థించిన వచ్చితి, ననురాగవతి నైన నను వరించి
- పడయుము నాయం దపత్యంబు దీన నీ, కగుఁ బుణ్యలోక సంప్రాప్తి యనిన
- తే. నట్ల కా కని యయ్యంబుజాయతాక్షి-నేకచిత్తంబుతోడ నంగీకరించె
- బాల యిట్లు సుఖాంబుధిఁ దేలుచుండి-యంత గర్భిణియై శుభంబగు దినమున. 98
- స్వారోచిషుని జననము
- శా. కాంచెం బుత్త్రు విశాల నేత్రుఁ బృథుపక్షఃపీఠ విభాజితుం
- బంచాస్యోద్భట శౌర్యధుర్యు ఘనశుంభద్బాహుఁ దేజోనిధిం
- బంచాస్త్రప్రతిమాను మానఘను సామ్రాజ్యైకహేతుప్రభూ
- తాంచల్లక్షణలక్షితున్ సుగుణ రత్నానీక రత్నాకరున్. 99
- క. వేడుక నయ్యవసరమున
- నాడిరి సురసతులు కిన్నరాంగనలర్థిం
- బాడిరి గంధర్వులు గొని
- యాడిరి సురతూర్యనినద మగ్గల మయ్యెన్. 100
- తే. అట్లు జనియించి స్వారోచిషాఖ్య నతఁడు
- శాంతి దాంతి దయా సత్య శౌచ నిరతుఁ
- డై యకామతఁ జిరతపం బాచరించె
- నచ్యుతునిఁగూర్చి యంతఁ గృపార్ద్రుఁ డగుచు. 101
స్వారోచిషుని తపమునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించుట
- సీ. నీలమేఘము డాలు డీలుసేయఁగఁ జాలు, మెఱుఁగుఁ జామనచాయ మేనితోడ
- నరవిందములకచ్చు లడఁగించు జిగిహెచ్చు, నాయతం బగు కన్నుదోయితోడఁ
- బులుఁగురాయని చట్టుపల వన్నె నొరవెట్టు, హొంబట్టు జిలుఁగు గెంటెంబుతోడ
- నుదయార్కబింబంబు నొఱపు విడంబంబుఁ, దొరలంగ నాడు కౌస్తుభముతోడ
- తే. జయజయ ధ్వని మౌళి నంజలులు సేర్చు-శర్వ శతధృతి శతమన్యు శమన శరధి
- పాలకైలబిలాదిదేవాళితోడ-నెదుటఁ బ్రత్యక్షమయ్యె లక్ష్మీశ్వరుండు. 102
- క. ఈ తెఱఁగునఁ దోఁచిన హరి
- కాతఁడు సాష్టాంగ మెఱఁగి యంగము పులకా
- న్వీతంబుగ హర్షాశ్రువు
- లేతేరఁగఁ జూచి భక్తి నిట్లని పొగడెన్. 103
స్వారోచిషుని భగవన్నుతి
- కవిరాజవిరాజితము. జయజయ దానవ కారణ శార్ఙ్గ రథాంగ గదాసి ధరా!
- జయజయ చంద్ర దినేంద్రశతాయుత సాంద్ర శరీర మహః ప్రసరా!
- జయజయ తామరసోదర సోదర చారుపదోజ్ఘిత గాంగఝరా!
- జయజయ కేశవ! కేశినిషూదన! శౌరి! హరీ! దురితాపహరా! 104
- సీ. అవ్యయానంత విశ్వాత్మక విశ్వేశ, బ్రహ్మవు నీవ కపర్ది వీవ
- యింద్రుండ వీవ వహ్నివి యనిలుఁడ వీవ, వరుణుండ వీవ భాస్కరుఁడ వీవ
- యముఁడ వీవ వసూత్కరము నీవ రుద్రులు, నీవ యాదిత్యులు నీవ విశ్వు
- లీవ మరుత్తులు నీవ మంత్రములు నోం, కృతి వషట్కృతి శ్రుతి స్మృతులు నీవ
- తే. వేద్య మీవ యీవచ్చిన విబుధగణము- సర్వమును నీవ యెట్లన్న సర్వగతుఁడ
- వగుట మఱి నీవు గానివాఁడనఁగ నెవ్వఁ-డరయఁగను శేషభూతసమస్త! శేషి! 105
- మ. పరతత్త్వం బగు నీకు మోడ్పుఁగరముల్ పద్మాక్ష! గీర్తించెదన్
- బురుషార్థస్థితి నొప్పునిన్నుఁ గరుణాంభోధిన్ భవార్తున్ జడున్
- శరణార్థిన్ ననుఁ గావఁగాఁ దగుఁ బ్రధానవ్యక్త! కాలాత్మ! యీ
- శ్వర! భూతంబుల కీవె కర్తవును బ్రోవన్ భర్తవున్ హర్తవున్. 106
దశావతార స్తవము
- చ. విలయ తమిస్రవేళ నతివేల మహాంబుధి నూర్ధ్వలోక వా
- సులు నతులై కనుంగొనెడు చూడ్కుల కౌర్వహుతాశనక్రియా
- కలితగతిన్ వెలుంగు ఘనకాయవిజృంభణఁ జోఱమీన వై
- కలయఁగఁ గ్రాలు నీ వెడఁదకన్నులు ప్రోచు మమున్ మురాంతకా! 107
- చ. చటుల కృపీట సంస్థిత రసాస్థలి వ్రీలక యుండ గార యి
- చ్చుటకునుబోలె శంఖ మణి శుక్తికదంబము నుగ్గుగా విశం
- కట చరమాంగ మంథగిరి ఘట్టనఁజేసి ఘరట్టమై కృపా
- పటిమ జగంబుఁ బ్రోచు నల ప్రాక్కమఠంబు నినున్ భజించెదన్. 108
- చ. ఉరుతరవిగ్రహస్ఫురణ నుబ్బిన నీ రుపరిచ్ఛిదాముఖాం
- తరమునఁ దోరమై యెగయు ధార నజాండము గాజుకుప్పెతో
- సరి యనఁగాఁ దలాతలరసాతలసీమలు సించి ధాత్రి ను
- ద్ధరణ మొనర్చినట్టి నిను నాదివరాహము నాశ్రయించెదన్. 109
- మ. కరుణించున్ మము నట్టి నీదు భుజయుగ్మం బెద్ది పూనెన్ నభోఽం
- తరసీమన్ దితిజాంత్రసక్త నఖ సంతానంబుతో నో నృకే
- సరి! రాత్రించరభీతికై త్రిభువనాస్థానీయవీథిన్ విక
- స్వర శోణ స్రగలంకృత క్రకచ భాస్వత్తోరణ స్తంభతన్. 110
- చ. దనుజకులేంద్ర దత్త కరతామరస స్థిత దానధారచే
- ననిమిష దైన్య దుఃఖిత మహామునిమండల దృశ్య కశ్యపాం
- గన నయనాంబువుల్ గడిగి కంజభవాండము మోవ లీల మైఁ
- బెనిచిన దంభవామను నుపేంద్రుని నిన్ను సమాశ్రయించెదన్. 111
- చ. తనదగు సంతతిం గనలి తానె వధించిన పాపముల్ చెడన్
- మునిఁగెడు నాగుణోగ్రకిణముల్ మొనయంగ శమంతపంచక
- మ్మునఁ బితృతర్పణచ్ఛలన మున్కలువెట్టు భవద్భుజాయుగం
- బున కిదె వందనంబు భృగుపుంగవరూప! విహంగవాహనా! 112
- మ. పవిధారా పతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
- తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా సప్తసా
- ల విభేదం బొనరించి నిల్వక సలీలం జన్న యుష్మన్మరు
- జ్జవనాస్త్రం బొసఁగున్ సిరుల్ రఘుకులస్వామీ! రమావల్లభా! 113
- క. పెరుఁగు ప్రలంబుని వీఁపునఁ
- గరిపై హరివోలె విశద కాంతి నిలిచి త
- త్కరణం బారాటముగాఁ
- బరిమార్చిన నీదు బలిమిఁ బ్రణుతింతు హరీ! 114
- తే. కొలుతుఁ దాదృగ్భవ ద్బాహు కులిశ యష్టి
- నెద్ది గిరివోలెఁ గడుపులో వృద్ధిపొందఁ
- బగిలి రాకాసి దేహంబు మొగపు ముత్య
- మయ్యె ముంగామురారి రంగై మురారి! 115
- క. కృతయుగ మేతేర నలం
- కృతికై కాశ్మీరపంక మిడి యలుకుక్రియన్
- క్షితి యెల్ల మ్లేచ్ఛరక్త
- ప్లుతముగఁ గావించు రౌతుఁ బొగడెద నిన్నున్. 116
వ. అని ప్రస్తుతించినం బ్రసన్నుండయి పాంచజన్యధరుండు వాత్సల్యంబున వత్సా! వరంబు వేఁడు మనుటయుం బ్రసాదం బని స్వారోచిషుం డిట్లనియె. 117
- క. దేవ! భవద్దాస్యసుఖం
- బే వేఁడెద దయకుఁ దగుదునే సాలోక్యం
- బీవే! యితరము లొల్లన్
- నావుడు నాతనికిఁ బద్మనాభుం డనియెన్. 118
- శ్రీ మహావిష్ణువు స్వారోచిషుని మనువుగ నియమించుట
- క. సాలోక్యముఁ దుది నిచ్చెద
- నేలు మిల ద్వితీయ మనువ వీవై నయ ధ
- ర్మాలోలబుద్ధిఁ దిరముగ
- వేలుపులకుఁ దపసులకును విధికిఁ బ్రియముగాన్. 119
- చ. అని మహిమన్ మనుత్వమున కాతనిఁ బట్టము గట్టి పద్మలో
- చనుఁడు విరించి శర్వముఖ సర్వసుపర్వులతో నదృశ్యుఁడై
- చనియె నిజాలయంబునకు శాస్త్రవినిశ్చయయుక్తి దండపా
- లనముల నవ్విభుండుఁ బ్రజలం బ్రజల ట్లరసెం గృపామతిన్. 120
ఫలశ్రుతి
- సీ. వానలు సరవితో వర్షించె, సస్యముల్, వేళ్ళఁ గొల్చుగ విఱ్ఱవీఁగి పండె
- నారోగ్య పుత్త్ర పౌత్రైశ్వర్యవంతులై, బ్రదికిరి నూఱేండ్లుఁ బంచజనులు
- పూవుఁబోఁడులు పతి దేవతలై రగ్ని, భయ తస్కర వ్యాధి భయము లడఁగె
- ఫల వయః కుసుమాది బహు పదార్థంబులు, రసగంధ సామగ్రి నెసక మెసఁగె
- తే. నీత్యుపద్రవ మృత్యు రాహిత్యయుక్తి-ధరఁ బ్రజావృద్ధి తామర తంపరయ్యె
- న్యాయపథమున స్వారోచిషాఖ్యమనువు-శ్రీలఁ బెంపొంది పాలించు కాలమునను. 121
- క. కోరిక నీ స్వారోచిషు
- చారిత్రము వినిన వ్రాయఁ జదివిన ధన ధా
- న్యారోగ్యపుత్త్రవంతులు
- నై రూఢిగఁ గండ్రు పిదప నమరత్వంబున్. 122
- తే. అని మృకండు తనూభవుఁ డనుఁగు శిష్యుఁ
- డైన క్రోష్టికి వినిపించినట్టి యీ క
- థా సుధాధార నించిరి దయ దలిర్ప
- జైమిని శ్రుతిపుటముల శకునివరులు. 123
ఆశ్వాసాంత పద్యగద్యములు
- శా. వ్యాయామ స్థిరసంధిబంధ! కటకాధ్యక్షానుగక్షోణి భృ
- త్కాయ గ్రావభిదా విధా భిదురదోఃఖడ్గాగ్ర! యుగ్రాచల
- జ్యాయః కీర్తి భర ప్రంచ! వరపంచారామ రామామణీ
- గేయామేయజయాంక! పంకజదృగంగీకార ధీరాకృతీ! 124
- క. కాంతా లతాంతశర! యే
- కాంతిక భక్తి ప్రతోషితాంభోధిసుతా
- కాంతా! ప్రతాప రవిశశి
- కాంతాయిత విమతనృపతి కాంతాహృదయా! 125
- వనమయూరము. రాజపరమేశ! ఫణిరాజబల! ఫుల్లాం
- భోజముఖ! భోజముఖ భూప! విపులాంసో
- త్తేజిత ధరాభరణ దీక్షితభుజా! ని
- ర్వ్యాజభయదాజి విజితారి నృపరాజీ! 126
గద్యము. ఇది శ్రీ మదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోప తాపస ప్రసాదసమాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసానిచొక్కయామాత్య పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా ప్రబంధంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.
- వెనక్కి-విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు