Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -9328

దయ దలఁచఁగరాదా తరుణిపై నిఁకనైన

రాగము: శ్రీరాగం

దయ దలఁచఁగరాదా తరుణిపై నిఁకనైన
ప్రియములు చెప్పేనంటాఁ బెనఁగుచు నలసె॥పల్లవి॥
  
వొగరులాడకుమంత వోపదుచెలి నీతో
నగవుల చేతనే మిన్నక యలసె
జగడాలడువకుమీ సంగతులు గావిఁక
మొగమోడి సారెసారె మొక్కి మొక్కి అలసె॥దయ॥
  
పంతాలు చూపుకుమంత పనిలేదు యాపెతోను
వింత నీబాసలు విని విని యలసె
చింతలు రేఁచకుమిఁక సేసినట్టెల్లాఁ జెల్లె
అంతరంగముగ నిచ్చలాడి యాడి యలసె॥దయ॥
  
అలయించుకుమంత ఆరడేల ఇల్లాలితో
కలసి కాఁగిటిలో రతులనలసె
యెలమి శ్రీ వేంకటేశ ఇంతసేసి కూడితివి
అలరిన నీమన్నన లందియంది యలసె॥దయ॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!